వైజయంతీకి వందేళ్ల ప్రయాణం ఖాయం | Special chit chat with aswini dutt | Sakshi
Sakshi News home page

వైజయంతీకి వందేళ్ల ప్రయాణం ఖాయం

Published Wed, Sep 19 2018 12:46 AM | Last Updated on Wed, Sep 19 2018 12:46 AM

Special chit chat with aswini dutt  - Sakshi

1973లో మా నాన్నగారు ఇచ్చిన డబ్బును మదరాసు టీ నగర్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే  కోట్లకు అధిపతిని అయ్యుండేవాడ్ని. డబ్బుల పరంగా బ్యాలెన్స్‌ షీట్‌ చూసుకోలేదు. నాకున్న పేరు, ప్రఖ్యాతుల పట్ల హ్యాపీ. ముందు తరం హీరోలతో సినిమాలు తీశాను. ఆ హీరోల కొడుకులు, మనవళ్లతోనూ తీశాను. 45 ఏళ్లయింది ఇండస్ట్రీకి వచ్చి. మరో 55 ఏళ్లు మా పిల్లలు రన్‌ చేస్తారు. వైజయంతీ మూవీస్‌ ప్రయాణం వందేళ్లయినా ఆగదని చెప్పడానికి గర్వంగా ఉంది. మా బ్యానర్‌కు ఎన్టీఆర్‌గారు పేరుపెట్టారు. ఆయనకు ధన్యవాదాలు.

‘‘ఇండస్ట్రీలో 45వ ఏట అడుగుపెట్టాను. ‘దేవదాస్‌’ 52వ చిత్రం. ఈ జర్నీలో తృప్తి, ఆనందం ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోల పేర్లు మాదిరిగానే నా పేరు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోంది. నా ఎదుగుదలలో నా భార్య పాత్ర కూడా ఉంది. పిల్లలు ముగ్గరు అమెరికాలో చదువుకుని ఈ రంగాన్ని ఎంచుకోవడం హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో ఓ ఫైన్‌ మార్నింగ్‌ అందర్నీ పిలిచి ‘రిటైర్డ్‌’ అని చెబుతాను. అందుకు ఎక్కువ టైమ్‌ కూడా పట్టకపోవచ్చేమో. ఎందుకంటే స్వప్నా అండ్‌ ప్రియాంకా చాలా స్ట్రాంగ్‌ అండ్‌ మోర్‌ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తున్నారు’’ అన్నారు నిర్మాత అశ్వనీదత్‌. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్‌’. వైజయంతీ మూవీస్, వయాకామ్‌ 18 మీడియా పతాకాలపై అశ్వనీదత్‌ నిర్మించిన  ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా

అశ్వనీదత్‌ చెప్పిన విశేషాలు...
∙స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్‌లో నిర్మించిన ‘మహానటి’ మాకు మంచి కమ్‌బ్యాక్‌ అయింది. ఇప్పుడు మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్‌’ సినిమా చేశాం. ఇద్దరు డిఫరెంట్‌ వ్యక్తులు కలిసి చేసే ట్రావెల్‌ ఎలా ఉంటుంది? అన్నదే ఈ చిత్రకథ. నాగార్జున, నాని ఇద్దరూ టైమింగ్‌ ఉన్న ఆర్టిస్టులు.  ‘గుండమ్మకథ’ లాంటి ప్రయత్నం చేశాం. ముందు సినిమా లైన్‌ సెలక్ట్‌ చేసుకున్నాం. నాగార్జున, నానీలను శ్రీరామ్‌ సెలక్ట్‌ చేశారు. కథ విన్న ఇద్దరు హీరోలు వెంటనే ఓకే అన్నారు. ‘ఆజాద్‌’ తర్వాత నాగార్జునగారితో సినిమా తీయలేదు. ఇప్పుడు నాగార్జున ఇన్‌వాల్వ్‌మెంట్‌ చూసి కాస్త షాక్‌ అయ్యాను. సినిమాలో నాని ఇన్‌వాల్వ్‌మెంట్‌ను ‘ఎవడే సుబ్రమణ్యం’ అప్పుడు చూశాను.  ఇద్దరి టైమింగ్స్‌ సూపర్‌. బాంబే రైటర్‌ శ్రీధర్‌ రాఘవన్, భూపతి రాజా, సత్యానంద్, సాయి మాధవ్‌ బుర్రా బాగా సహకరించారు. మంచి సినిమాలు తీస్తున్న యంగ్‌ డైరెక్టర్స్‌లో శ్రీరామ్‌ ఆదిత్య ఒకరు. ఈ సినిమాను బాగా తీశారు.  ∙ఈ ‘దేవదాస్‌’ చిత్రంతో మా బ్యానర్‌లో మణిశర్మగారు 17 సినిమాలు పూర్తి చేశారు. ఆయన్ను ‘చూడాలని ఉంది’ ద్వారా నేనే ఇంట్రడ్యూస్‌ చేశాను. ∙కొంతకాలంగా మా బ్యానర్‌లో హిందీ సినిమాలు చేయడం లేదు. ప్రియాంకా అండ్‌ స్వప్నా లీడర్‌షిప్స్‌లో వైజయంతీ మూవీస్‌లో పలు భాషల్లో సినిమాలు చేయాలని ఉంది. నాగ్‌ అశ్విన్‌ (దర్శకుడు, అశ్వనీదత్‌ అల్లుడు) కూడా ఓ హిందీ, తెలుగు ద్విభాషా చిత్రంపై ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు. హిందీ సినిమాలు కూడా చేయాలని నిర్మాణ సంస్థ వయాకామ్‌ 18తో అసోసియేట్‌ అవుతున్నాం.వైజయంతీ మూవీస్‌ను తిరిగి పెంచాలని ప్రియాంకా, స్వప్నా ప్రయత్నం చేస్తున్నారు. స్వప్నా, ప్రియాంకాలు వైజయంతీ మూవీస్‌ను లాక్కోలేదు. హైజాక్‌  చేశారంటే çకరెక్ట్‌ (నవ్వుతూ). ∙హీరోనే సినిమా అని నమ్మి నేను సినిమాల్లోకి వచ్చాను. అదే నా స్లోగన్‌. హీరోలందరూ నాతో  ఇష్టంగా ఉంటారు. నేను ఈ హీరోతో సినిమా తీయను అనే పరిస్థితి నాకెప్పుడూ రాలేదు. అంత మంచి వాతావరణంలో సినిమాలు నిర్మించాను. ∙నాకు కెమెరా ముందుకు రావాలనిపించలేదు. డైరెక్షన్‌ చేయాలనిపించలేదు. అన్నం ఉడికిన తర్వాత ఇది ఉంది.. అది లేదు అని చెప్పడంలో నా జడ్జిమెంట్‌ ఉంది.

వాళ్లు చేయాల్సిన పనిని మనం చేయకూడదన్నదే నా సిద్ధాంతం. ∙సినిమా చేద్దాం అంటే ఏ తల్లిదండ్రులూ ఒప్పుకోరు. కానీ వారిని కన్విన్స్‌ చేసి విశ్వనాథ్‌గారితో ‘ఓ సీత కథతో’ సినిమా తీశాను. ఆ తర్వాత అభిమాన హీరోలతో సినిమాలు తీశాను. కానీ వాటి మధ్య చిన్న సినిమాలను మరిచిపోలేదు. అన్నీ పోయి ఇంటికెళ్లిపోయే పరిస్థతి వచ్చినప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డిగారితో ‘శుభలగ్నం’ సినిమా తీశాం. ఆ తర్వాత రాఘవేంద్రరావుగారితో తీసిన ‘పెళ్లి సందడి’ కూడా మంచి హిట్‌. చిన్న సినిమా అయినా,పెద్ద సినిమా అయినా కరెక్ట్‌ ఎటెమ్ట్‌ కాకపోతే, స్టోరీ ఆడియన్స్‌కి నచ్చకపోతే, ఆపై మన టైమ్‌ బాగోలేకపోతే కిందికీ, పైకి వెళ్తాం. ఎప్పుడూ తలదించుకునే సినిమాలు తీయాలనుకోలేదు. తీయగలను అనుకుంటేనే సినిమా తీశా. అందుకే ఏడేళ్ల గ్యాప్‌ కూడా వచ్చింది.  ∙‘మహానటి’ సినిమాకు దాదాపు 17 కోట్లు బడ్జెట్‌ అవుతుందని స్వప్నా చెప్పింది. లేడీ ఒరియంటెడ్‌ సినిమాకు అంత బడ్జెట్‌ ఎక్కువ అనుకున్నాను. కానీ సావిత్రిగారి కథ. ఒకటీ రెండు కోట్ల ఎక్కువైనా పర్లేదు. గ్రాఫిక్స్‌ దగ్గర కాంప్రమైజ్‌ కావద్దు. ఆడియన్స్‌కు 1980 ఫీల్‌ను, కథను సరిగ్గా చెప్పకపోతే ఈ సినిమాను తీయవద్దు అని చెప్పాను. దాని కోసం ఏమైనా ఖర్చుపెట్టండి అన్నాను. చివరికి ఆ సినిమా బడ్జెట్‌ 29 కోట్ల దగ్గర ఆగింది. ∙అప్పట్లో విజయా ప్రొడక్షన్స్, రామానాయుడుగారు, జగపతి పిక్చర్స్‌ ఇలా ఓ నలుగురైదుగురు మాత్రమే భారీ బడ్జెట్‌ సినిమాలు తీయగలిగేవారు. ఇప్పుడు అందరూ తీస్తున్నారు. ఇప్పుడు వందకు 90 శాతం మంది అలాగే తీస్తున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్‌ రేట్‌ పెరగాలి. ఇప్పుడు నిర్మాతలకు డిజిటల్‌ రైట్స్, శాటిలైట్స్‌ రూపంలో మంచి ఆదాయం వస్తోంది.

ఇది మంచి పరిణామం. నిర్మాతలకు కాస్త రిస్క్‌ తగ్గింది. ∙ఆ రోజుల్లో పద్మాలయావారు గొప్ప సినిమాలు తీశారు. కానీ మహేశ్‌బాబును (రాజకుమారుడు) నేను ఇంట్రడ్యూస్‌ చేశాను. చాలా గౌరవంగా భావించాను. అలాగే హరికృష్ణ కోరిక మేరకు ‘స్టూడెంట్‌ నెం. 1’ సినిమా తీశాం. చిరంజీవిగారికి పెద్ద బ్యానర్‌ ఉంది. అల్లు అరవింద్‌కి బ్యానర్‌ ఉంది. కానీ రామ్‌చరణ్‌ను నేను ఇంట్రడ్యూస్‌ చేశాను. నాకు, రాఘవేంద్రరావుకి, అరవింద్‌కి మంచి బాండింగ్‌ ఉంది. నేను, రాఘవేంద్రరావు మాట్లాడుకుని అల్లు అర్జున్‌ని ఇంట్రడ్యూస్‌ చేద్దామనుకున్నాం. అరవింద్‌కి చెబితే హ్యాపీ ఫీలయ్యారు. చంద్రబాబుగారు రోహిత్‌ను అడిగారు. కొత్తదనానికి, వారసత్వానికి పీట వేసుకుంటూ వచ్చాం. ∙నెక్ట్స్‌ సినిమా కోసం నాగీ స్క్రిప్ట్‌ వర్క్‌ స్టార్ట్‌ చేశాడు. నాగ్‌ అశ్విన్‌ స్క్రిప్ట్‌ చిరంజీవిగారి కోసమేనా? అంటే ఇప్పుడే చెప్పలేను. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఓ సినిమా స్టార్ట్‌ చేస్తాం. ఎన్టీఆర్‌తో ఒక సినిమా ఉంది. విజయ్‌ దేవరకొండతో రెండు సినిమాలు ఉన్నాయి. విజయ్‌ దేవరకొండ చేసే ఒక సినిమాకు రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తారు. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్‌ చేయాలని ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement