నీ చేపకళ్లు... చేపకళ్లు గిచ్చుతున్నవే! | Special chit chat with heroine kajal | Sakshi
Sakshi News home page

నీ చేపకళ్లు... చేపకళ్లు గిచ్చుతున్నవే!

Published Sun, Dec 2 2018 1:14 AM | Last Updated on Sun, Dec 2 2018 1:14 AM

Special chit chat with heroine kajal - Sakshi

‘కాజల్‌ కళ్లు... బ్యూటీ కావ్యాలు’ అంటారు అభిమానులు. అలా అన్నారు కదా అని అందమైన పాత్రలకే పరిమితమై పోకుండా భిన్నమైన పాత్రలు ఎంచుకుంటుంది  కాజల్‌ అగర్వాల్‌. అప్పటి ‘లక్ష్మీ కళ్యాణం’ నుంచి  ఇప్పటి ‘కవచం’ వరకు జరిగిన  ప్రయాణాన్ని చూస్తే కాలంతో పోటీ పడే కిటుకేదో ఆ కళ్లకు తెలిసినట్లే ఉంది. ‘ఒకే మూసలో నటించాలని లేదు’ అంటున్న కాజల్‌ అంతరంగ  తరంగాలు ఇవి...

ఆ విధంగా...
సినిమా ప్రభావం నిజ జీవితం మీద ఎంత ఉంటుందనే గంభీరమైన చర్చ మాట ఎలా ఉన్నా... సినిమాల పుణ్యమా అని కొత్త విద్యలు నేర్చుకున్నాను. మిస్టర్‌ పర్‌ఫెక్ట్, తుపాకి... మొదలైన సినిమాల ద్వారా సైకిలింగ్, స్కూటర్‌ రైడింగ్‌ నేర్చుకున్నాను. అంతకుముందు జంతువులంటే భయంగా ఉండేది... సినిమాల్లోకి వచ్చిన తరువాత ఆ భయం హుష్‌కాకి అయిందన్నమాట. షూటింగ్‌ లేని సమయంలో ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదువుతాను. చిత్ర దివకరుని రచనలు అంటే ఇష్టం.


పెళ్లంటే ఏమిటంటే...
కెరీర్‌కు, పెళ్లికి ముడిపెట్టవద్దు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. ‘పెళ్లికి రైట్‌ టైమ్‌ ఏమిటి?’ అనే ప్రశ్నకు నా సమాధానం: ‘రైట్‌ పర్సన్‌’. పెళ్లయితే కెరీర్‌కు çఫుల్‌స్టాప్‌ పెట్టాలనే రూల్‌ ఏమీలేదు. నటులను కార్పొరేట్‌ ఉద్యోగులతో ఎందుకు పోల్చరు? పెళ్లైనంత మాత్రాన కార్పొరేట్‌ ఉద్యోగులు తమ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పరు కదా! నటుల విషయంలో మాత్రం ‘పెళ్లి’ అనగానే ‘ఇక సినిమాల్లో నటించరన్నమాట’ అనే మాట వినిపిస్తుంది. ఇది తప్పు. పెళ్లైన తరువాత కూడా నటిస్తున్న నటీమణులను చూస్తే  చాలా సంతోషంగా ఉంటుంది.


గ్లామర్‌ గ్రామర్‌
చీరలో కూడా గ్లామరస్‌గా కనిపించవచ్చు. ‘గ్లామరస్‌’ కోసం బికినీ మాత్రమే ధరించనక్కర్లేదు. గ్లామర్‌ అనే పదాన్ని వేరే అర్థంలో  చూస్తున్నాం. స్కిన్‌ షోకు ఒక పరిధి ఉంది. డీసెంట్‌గా ఉంటే ఓకే. డీసెన్సీ, వల్గారిటీ మధ్య గీత ఉంది. ఆ గీత దాటితే వల్గారిటీ. ఎన్నో స్టేజీ ప్లేలలో నటించినప్పటికీ సినిమాల్లోకి రావాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఎంబీయే చేసి మార్కెటింగ్‌లోకి వెళ్లాలనుకున్నాను. కానీ విధి ఇలా డిసైడ్‌ చేసింది! పాత్రల ఎంపిక  విషయానికి వస్తే క్రియేటివ్‌ శాటిస్‌ఫేక్షన్‌ ఇచ్చే పాత్రలు అంటే ఇష్టం.

రోల్‌ మోడల్స్‌
చిత్రసీమలో నా రోల్‌మోడల్స్‌ జాబితా కాస్త పెద్దగానే ఉంటుంది. శ్రీదేవి, మాధురీ దీక్షిత్, ప్రియాంకా చోప్రా... ఇలా నా జాబితాలో చాలామందే ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి ఒక్కో విషయంలో స్ఫూర్తి పొందుతుంటాను. కొన్ని ప్రశ్నలు చిత్రంగా అనిపిస్తాయి. ఉదాహరణకు... బాలీవుడ్‌లో చేస్తున్నప్పుడు ‘సౌత్‌లో ఎందుకు చేయడం లేదు?’ అని అడిగేవాళ్లు. సౌత్‌లో బిజీ అయినప్పడు ‘బాలీవుడ్‌లో ఎందుకు చేయడం లేదు?’ అని అడుగుతుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement