Kavacham Movie Review, in Telugu | ‘కవచం’ మూవీ రివ్యూ - Sakshi

Dec 7 2018 12:48 PM | Updated on Dec 7 2018 1:33 PM

Kavacham Telugu Movie Review - Sakshi

‘కవచం’ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఏ మేరకు ఆకట్టుకున్నాడు? ఈ సినిమా ఈ యంగ్‌ హీరో కెరీర్‌ను గాడిలో పెడుతుందా..?

టైటిల్ : కవచం
జానర్ : యాక్షన్ థ్రిల్లర్‌
తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌, మెహరీన్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌
సంగీతం : తమన్‌ ఎస్‌ఎస్‌
దర్శకత్వం : శ్రీనివాస్‌ మామిళ్ల
నిర్మాత : నవీన్‌ శొంఠినేని

కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి భారీ బడ్జెట్‌ చిత్రాలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఈ సారి రూట్‌ మార్చి ఓ మీడియం రేంజ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కమర్షియల్‌గా హిట్ అనిపించుకోలేకపోవటంతో ఈ సారి ఎలాగైనా ఓ భారీ హిట్ కొట్టాలన్న కసితో కవచం సినిమా చేశాడు. కొత్త దర్శకుడు శ్రీనివాస్‌ మామిళ్లను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సాయి శ్రీనివాస్‌కు సక్సెస్‌ అందించిందా..?

కథ ;
విజయ్‌ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) విశాఖపట్నం 3 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్స్‌పెక్టర్‌. నిజాయితీగా పని చేసే విజయ్‌ ఎన్‌కౌంటర్‌ స్పెలిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కంటుంటాడు. ఓ కాఫీ షాప్‌లో పనిచేసే అమ్మాయి(కాజల్‌)తో ప్రేమలో పడతాడు. కానీ ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పే లోపే ఆ అమ్మాయికి పెళ్లి కుదరటంతో విజయ్‌కి దూరమవుతుంది. తరువాత ఓ ప్రమాదం నుంచి సంయుక్త(మెహరీన్‌) అనే అమ్మాయిని కాపాడతాడు విజయ్‌. ఆ తరువాతి రోజు విజయ్‌ తల్లికి యాక్సిడెంట్ కావటంతో సంయుక్త డబ్బు కోసం కిడ్నాప్‌ నాటకం ఆడదామని సలహా ఇస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్న విజయ్ కిడ్నాప్‌ చేసినట్టుగా సంయుక్త మామయ్యకు ఫోన్‌ చేసి యాబై లక్షలు తీసుకుంటాడు. కానీ ఆ మరుసటి రోజు సంయుక్త నిజంగానే కిడ్నాప్‌ అయ్యిందని, ఎస్‌ఐ విజయ్‌ కిడ్నాప్‌ చేశాడని న్యూస్‌లో వస్తుంది. అదే సమయంలో అసలు సంయుక్త విజయ్‌కి కాఫీ షాప్‌లో పరిచయం అయిన అమ్మాయని తెలుస్తుంది. మరి విజయ్‌కి సం‍యుక్తగా పరిచయం అయిన మరో అమ్మాయి ఎవరు..? అసలు సంయుక్త ఏమైంది..? ఈ కిడ్నాప్‌ల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు..?ఈ ప్రశ్నలకు విజయ్‌ ఎలా సమాధానం కనుకున్నాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మరోసారి మాస్‌ యాక్షన్‌ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. నటనపరంగా పెద్దగా కొత్తదనం ఏమీ కనిపించకపోయినా పోలీస్‌ లుక్‌తో ఆకట్టుకున్నాడు. యాక్షన్‌, డ్యాన్స్‌లతో మెప్పించాడు. హీరోయిన్స్‌గా కనిపించిన కాజల్‌, మెహరీన్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. గ్లామర్‌తోనూ ఆకట్టుకున్నారు. ప్రతినాయకుడిగా పరిచయం అయిన బాలీవుడ్ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ స్టైలిష్‌ లుక్‌లో మెప్పించాడు. రెండు షేడ్స్‌ను చాలా బాగా చూపించాడు. అయితే అతని పాత్ర తెర మీద కనిపించేది కొద్ది సేపే కావటంతో పెద్దగా ప్రూవ్‌ చేసుకునే చాన్స్‌ దక్కలేదు. పోలీస్‌ అధికారిగా హరీష్ ఉత్తమన్‌ పర్ఫెక్ట్‌గా సరిపోయాడు. ఇతర పాత్రల్లో ముఖేష్‌ రుషి, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్‌ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.


విశ్లేషణ ;
యాక్షన్ థ్రిల్లర్ అన్న జానర్‌కు తగ్గట్టుగా మంచి ట్విస్ట్‌లతో కథను తయారు చేసుకున్నాడు దర్శకుడు. అయితే కొన్ని సీన్స్‌లో ప్రేక్షకులను థ్రిల్‌ చేసినా చాలా చోట్ల స్లోగా కథను నడిపించి నిరాశపరిచాడు. ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్‌లో కిడ్నాప్‌ సీన్‌, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ తప్ప మిగతా కథనమంతా నెమ్మదిగా నడుస్తూ సహనాన్ని పరీక్షిస్తుంది. సెకండ్‌ హాఫ్‌లో కథనం స్పీడందుకుంటుంది. క్లైమాక్స్‌ యాక్షన్‌ బాగున్నా ఫైట్‌ సీన్‌ కోసమే సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సినిమాకు మరో మేజర్‌ మైనస్‌ పాయింట్‌ సంగీతం. తమన్‌ అందించిన పాటల్లో ఒక్కటి కూడా గుర్తుండిపోయేలా లేదు. నేపథ్యం సంగీతం బాగున్నా కొన్ని సన్నివేశాలను డామినేట్‌ చేసినట్టుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి బాగుంది. వైజాగ్‌ అందాలు, ఏరియల్‌ షాట్స్‌, యాక్షన్‌ సీన్స్‌లో కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;
కథలో మలుపులు
యాక్షన్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ ;
సంగీతం
ఫస్ట్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్‌

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement