ఎవరి టాలెంట్‌నూ ఆపలేం | bellamkonda sai srinivas interview about kavacham | Sakshi
Sakshi News home page

ఎవరి టాలెంట్‌నూ ఆపలేం

Published Thu, Dec 6 2018 12:26 AM | Last Updated on Thu, Dec 6 2018 5:13 AM

bellamkonda sai srinivas interview about kavacham - Sakshi

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

‘‘నేను టీమ్‌ వర్క్‌ని నమ్ముతాను. పదిమంది దగ్గర పది ఆలోచనలు ఉంటాయి. మనమే కరెక్ట్‌ అనుకుంటే తప్పు. నాన్నగారికి (బెల్లంకొండ సురేశ్‌) చాలా అనుభవం ఉంది. అందుకే నా సినిమాల స్క్రిప్ట్స్‌ సెలక్షన్‌లో ఆయన సహకారం ఉంటుంది. ఎడిటింగ్‌ రూమ్‌లో కూడా అభిప్రాయాలను చెప్పమని అడుగుతాను’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. శ్రీనివాస్‌ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘కవచం’. కాజల్, మెహరీన్‌ కథానాయికలుగా నటించారు. నవీన్‌ శొంటినేని నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ చెప్పిన విశేషాలు.

► చిన్నప్పటి నుంచి యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. ప్రేమకథా చిత్రాల కన్నా యాక్షన్‌ సినిమాలకు పెద్ద రీచ్‌ ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. యాక్షన్‌ నేపథ్యంలోని కథల్లో డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉంటాయి. ‘కవచం’ యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్‌ మూవీ. ఇందులో పోలీసాఫీసర్‌ పాత్ర చేశాను. ఈ పాత్ర కోసం ముఖ్యంగా అమితాబ్‌బచ్చన్‌గారి సినిమాలు చూశాను. ఆయన విజయ్‌ పేరుతో చేసిన  సినిమాలు సూపర్‌ హిట్టయ్యాయి. అందుకే ఈ సినిమాలో నా పాత్రకు విజయ్‌ అని పెట్టాం (నవ్వుతూ). విజయ్‌పై వచ్చిన ఆరోపణలు తప్పని ఒక్క రోజులో ఎలా నిరూపించగలిగాడు? అనేదే సినిమా కథ. స్క్రీన్‌ప్లే రేసీగా ఉంటుంది. ఇంట్రవెల్‌ తర్వాత నుంచి 24 గంటల్లో జరిగే కథతో సినిమా ఉంటుంది.  

► సినిమాలో ఉన్న ట్విస్ట్‌లను ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తారు. సినిమాలో నాకు, అజయ్, నీల్‌నితిన్‌ ముఖేష్‌ క్యారెక్టర్స్‌ మధ్య మంచి గేమ్‌ ప్లే ఉంటుంది. ఈ సినిమాతో నవీన్‌ శొంటినేని కొత్త ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేశారు. దర్శకుడు శ్రీనివాస్‌కు చాలా అనుభవం ఉంది. ‘దృశ్యం, గోపాల గోపాల’ సినిమాలకు కో డైరెక్టర్‌గా వర్క్‌ చేశారు. అసలు కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రంలా ఉండదు. మా అందరిలో దాగి ఉన్న ప్రతిభను సినిమాకు తగ్గట్లు వినియోగించుకున్నారు.

► ‘జయజానకి నాయక’ సినిమాకు 27 కోట్ల షేర్‌ వచ్చింది. 15 కోట్లు శాటిలైట్‌ రైట్స్‌ వచ్చాయి. మూడో సినిమాకు ఆడియన్స్‌ నుంచి ఒక హీరోగా ఇంకా ఏం కోరుకుంటాం. అత్యాశ మంచిది కాదు. ‘కవచం’ సినిమా రిలీజ్‌కు ముందే సేఫ్‌ జోన్‌లోకి వెళ్లాం. మంచి శాటిలైట్‌ రైట్స్‌ వచ్చాయి. ఈ సినిమా 10 కోట్లు చేసినా ప్రాఫిట్‌లోకి వెళ్లిపోతాం. సక్సెస్‌ అవుతుందన్న నమ్మకం ఉంది.

► ‘జయజానకి నాయక’ సినిమా లుక్, మా ప్రిపరేషన్‌కి చాలా టైమ్‌ పట్టింది. ‘సాక్ష్యం’ చిత్రానికి. దాదాపు 165 రోజులు వర్క్‌ చేశాం. దాదాపు 220 కాల్షీట్లు. ఒక 5 సినిమాలు తీయొచ్చు ఆ టైమ్‌లో. ‘సాక్ష్యం’ సినిమా రిజల్ట్‌ నిరుత్సాహపరిచిన మాట వాస్తవమే. నాలుగైదు రోజులు బయటకు రాలేదు. లక్కీగా నా చేతిలో  వర్క్‌ ఉంది కాబట్టి షూటింగ్‌కు వెళ్లిపోయాను. లేకపోతే నెక్ట్స్‌ సినిమా చేయడానికి 6 నెలల టైమ్‌ పెట్టేది.

► కష్టపడుతుంటే ఫ్యాన్‌ బేస్‌ కూడా వస్తుంది.  స్టార్‌ నిర్మాత కొడుకు లాంచ్‌ అంటే ఈజీగానే ఉంటుంది. కానీ ప్రేక్షకుల నమ్మకాన్ని, ప్రేమను పొందటం కష్టం. ఇప్పుడు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయి. ఎవరి ప్రతిభనూ ఆపలేం. ఓ ప్రతిభావంతుడు ఓ వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పెడితే వైరల్‌ అవుతోంది. ఒకప్పుడు నెపోటిజమ్‌ (బంధుప్రీతి) ఉండేదేమో. ఇప్పుడు మంచి ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయి. అందరి ఫ్యాన్స్‌ నన్ను ఇష్టపడాలని నేను కోరుకుంటాను.

► తేజగారి దర్శకత్వంలో నేను హీరోగా నటిస్తున్న సినిమా తుది దశకు చేరుకుంది. సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. ఈ సినిమాలాగానే నా క్యారెక్టర్‌ కూడా ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఫస్ట్‌హాఫ్‌ రొమాంటిక్‌గా, సెకండాఫ్‌ యాక్షన్‌గా ఉంటుంది. తేజగారితో నాకు మంచి వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉంది. కష్టపడేవారికి, బాగా చేసేవారికి ఆయన అంత మంచి వ్యక్తి అసలు ఉండరు. ఆయనతో మూడు, నాలుగు సినిమాలైనా చేస్తాను. అవుట్‌పుట్‌ బాగా రావడానికి ఆయన ఎందాకైనా  వెళతారు.

► నిన్న మొన్నటి వరకు కాస్త కూల్‌గా సినిమాలు చేశాను. ఇప్పుడు మరింత కష్టపడాలని డిసైడ్‌ అయ్యాను. అక్షయ్‌ కుమార్‌గారిలా ఏడాదికి మూడు, నాలుగు సినిమాలను రెడీ చేయాలని అనుకుంటున్నాను. నా తర్వాతి చిత్రాలను నా బర్త్‌ డే జనవరి 3న వెల్లడిస్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement