‘‘నేను పుట్టింది హైదరాబాద్‌లో. మా గ్రాండ్ మదర్ ఇక్కడే ఉన్నారు. హైదరాబాద్‌లో మాకు దాదాపు 500 మంది బంధువులున్నారు. ఐ లవ్ హైదరాబాద్. మై ఫేవరెట్ ప్లేస్ ఇది. తెలుగు మాట్లాడగలను కానీ పూర్తి స్థాయిలో రాదు. తప్పులు దొర్లుతుంటాయి (నవ్వుతూ)’’ అని నిధీ అగర్వాల్ అన్నారు. అఖిల్, నిధీ అగర్వాల్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ మజ్ను’. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా నిధీ అగర్వాల్ పంచుకున్న విశేషాలు.
తెలుగులో నాగచైతన్యతో ‘సవ్యసాచి’ మూవీ చేశా. ఇప్పుడు అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’లో నటించా. చైతన్య, అఖిల్ ఇద్దరూ ఇద్దరే. మంచి కో స్టార్స్. ఇద్దరికీ ఎందులోనూ పోలిక ఉండదు. ఒకరు నీరు అయితే మరొకరు నిప్పు. కానీ, ఇద్దరూ చాలా క్రమశిక్షణగా ఉంటారు. వారితో పని చేయడం గొప్ప అనుభూతి.
‘మిస్టర్ మజ్ను’కి వస్తున్న స్పందన చూసి టీమ్ అంతా చాలా సంతోషంగా ఉంది. నాకు సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది. సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను మేం అధిగమించాం. ఈ చిత్రంలోని నిక్కీ పాత్ర నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే నిజ జీవితంలో నేను నిక్కీలా ఉండను. ఈ పాత్ర నాకు పూర్తి ఆపోజిట్‌గా ఉంటుంది.
‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో ఇంట్రవెల్, క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు చాలా ముఖ్యమైనవి. చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. ఆ సన్నివేశాలు చూసి చాలా మంది ఏడ్చేస్తారు. కొందరు నాకు ఫోన్ చేసి థియేటర్లో మా వాళ్లు ఏడ్చేశారు అని చెబుతుంటే సంతోషంగా అనిపించింది. డైరెక్టర్ వెంకీ రైటింగ్ టఫ్.
‘సవ్యసాచి’ సినిమాలో నటించడం ఈజీగా అనిపించింది. అయితే ‘మిస్టర్ మజ్ను’ చిత్రం కొంచెం కష్టంగా అనిపించింది. ఇందులో పెద్ద పెద్ద డైలాగులున్నాయి. బాగా చదువుకుని, అర్థం చేసుకుని చెప్పేదాన్ని. ఎక్కువ టేక్‌లు తీసుకునేదాన్ని కాదు. ఈ సినిమా చూసి మా పేరెంట్స్ హ్యాపీ. ‘నువ్వు ఇంత బాగా నటిస్తావా? అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు’ అని అమ్మ అంది. అవే నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్.
నేను సింపుల్‌గా ఉంటాను. ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో చెప్పినట్టు రియల్ లైఫ్‌లో నాకు రాముడిలాంటివాడు దొరుకుతాడనే నమ్మకం ఉంది (నవ్వుతూ). నా ముఖం కొంచెం అమాయకంగా ఉంటుంది. అందుకే అలాంటి పాత్రలు వస్తున్నాయేమో అనిపిస్తోంది. నాకు డ్యాన్స్ అంటే ప్రాణం. అన్ని రకాల నృత్యాలు నేర్చుకున్నా. బాగా డ్యాన్స్ చేయడం నా బలం కూడా.
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు నచ్చిన రోల్స్ చేసే స్టేజ్‌కి వచ్చానని అనుకోవట్లేదు. కానీ, ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఒకేరకమైన పాత్రలు కాకుండా వైవిధ్యమైన రోల్స్‌పై దృష్టి పెడతా. పూరి జగన్నాథ్‌గారిలాంటి పెద్ద డైరెక్టర్ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కథ వినగానే చాలా ఎగై్జటింగ్‌గా అనిపించింది. వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ నాది. ఫిబ్రవరిలో ఆ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతాను.
నెగటివ్ కామెంట్స్‌ని పాజిటివ్‌గా తీసుకుంటా. అయితే ఆ కామెంట్స్ ఎవరు చేస్తున్నారనేది ముఖ్యం. రైట్ పర్సన్స్ నుంచి వచ్చిన కామెంట్స్‌నే పట్టించుకుంటా. ‘మిస్టర్ మజ్ను’కి మాత్రం 100కి 95% పాజిటివ్ కామెంట్సే వచ్చాయి. ఇంతకంటే ఇంకా ఏం కావాలి?
తెలుగులో నేను చూసిన మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’. ‘సవ్యసాచి’ షూటింగ్‌లో ఉన్నప్పుడు నాగచైతన్య చెబితే ఆ సినిమా చూశా. చాలా బాగా నచ్చింది. అందుకే ఆ సినిమాను 4 సార్లు చూశాను. అవకాశం దొరికితే ఆ సినిమాలో ‘అర్జున్ రెడ్డి’ పాత్ర చేయాలనుంది.
రాజమౌళిగారితో పని చేయాలన్నది నా కల. తెలుగులో త్రివిక్రమ్‌గారు, వెంకీ అట్లూరి.. ఇలా ఇంకా చాలా మంది మంచి డైరెక్టర్లు ఉన్నారు. శ్రీదేవి, రేఖ, దీపికా పదుకోన్‌లాంటి వారు గ్లామర్ రోల్స్‌తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేశారు. వారిలాగా చేయాలనుంది.
తెలుగులో అవకాశాలొస్తున్నాయి కానీ తొందరపడటం లేదు. ఇప్పటి వరకూ ‘మిస్టర్ మజ్ను’ చిత్రంపైనే ఫోకస్ పెట్టాను. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’. కథ, నా పాత్రకి ఇంపార్టెన్స్ ఉండే పాత్రలు చేయాలనుకుంటున్నా.
Comments
Please login to add a commentAdd a comment