ఆ టైమ్‌లో నాన్నగారు నవ్వడం మానేశారు!
‘‘ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన రికార్డ్ నాన్నగారిది. అలాంటి ఆయన టెన్షన్ పడటం చూసి నాకు విచిత్రంగా అనిపించింది. ఒక కొడుకు డెరైక్టర్.. మరో కొడుకు హీరో.. ఈ ఇద్దరూ కలసి చేసిన సినిమా ఏమవుతుందోనని ఆయన టెన్షన్. ఇప్పుడు చాలా కూల్‌గా ఉన్నారు’’ అని ఆది పినిశెట్టి అన్నారు. ఇప్పటికే తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న ఆది ‘గుండెల్లో గోదారి’తో ఇక్కడ కూడా భేష్ అనిపించుకున్నారు. ఇప్పుడు తన అన్నయ్య సత్యప్రభాస్ దర్శకత్వంలో తండ్రి, ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మించిన ‘మలుపు’ ద్వారా మరోసారి తెరపైకొచ్చారు. ఈ సందర్భంగా ఆదితో చిట్ చాట్..
‘మలుపు’ విషయంలో మీ నాన్నగారు టెన్షన్ పడినప్పుడు మీకేమనిపించింది?
బేసిక్‌గా మాది హ్యాపీ ఫ్యామిలీ. కానీ, ‘మలుపు’ మొదలుపెట్టిన తర్వాత నాన్నగారు దాదాపు నవ్వడం మానేశారు. ఎప్పుడూ టెన్షన్ పడేవారు. ‘మీరు చేయని సినిమాలా నాన్నా.. అంతా బాగానే ఉంటుంది’ అని సర్దిచెప్పేవాణ్ణి. కానీ, ఆయన టెన్షన్ పడేవారు. సినిమా విడుదలై, హిట్ టాక్ వచ్చాక కూల్ అయిపోయారు.
రొటీన్ కమర్షియల్ మూవీస్ కాకుండా డిఫరెంట్ రూట్‌లో వెళుతున్నారు.. మరి... మెయిన్ స్ట్రీమ్ హీరో అయ్యేదెప్పుడు?
స్టార్ అనిపించుకునే ముందు మంచి నటుడు అనిపించుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఆ తర్వాత స్టార్‌డమ్ దానంతట అది వచ్చేస్తుంది. తమిళంలో మొదటి సినిమా ‘మృగం’ తర్వాత నాకలాంటి కథలే వస్తే, ‘ఇలాంటి పాత్రలకే పనికొస్తాడు’ అని స్టాంప్ వేస్తారని చేయనన్నాను. తెలుగుకి వస్తే, ‘గుండెల్లో గోదారి’లో చేపలు పట్టేవాడిగా యాక్ట్ చేశాను. ‘మలుపు’లో నా వయసున్న కుర్రాళ్లు ఎలా ఉంటారో అలాంటి పాత్ర చేశాను. కిక్ కోసమే ఇలా డిఫరెంట్ పాత్రలు చేసుకుంటూ వెళుతున్నా. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలపై కూడా దృష్టి సారిస్తాను. అవి చేయననడంలేదు.
‘సరైనోడు’లో విలన్‌గా నటించడంవల్ల, తర్వాత అలాంటి పాత్రలకే మిమ్మల్ని పరిమితం చేసే అవకాశం ఉంటుందేమో?
ఉండొచ్చు. కానీ, నేను చేయాలి కదా. ‘సరైనోడు’ కథ చాలా బాగుంటుంది. నటుడిగా నాకు మంచి స్కోప్ దక్కుతుంది. అందుకే ఒప్పుకున్నా. తమిళంలో ‘తని ఒరువన్’ని తీసుకుందాం. విలన్‌గా చేసిన అరవింద్ స్వామికి హీరోకన్నా ఎక్కువ పేరొచ్చింది. కొన్ని విలన్ పాత్రలు అలా సెట్ అవుతాయి. ‘సరైనోడు’లో హీరో అల్లు అర్జున్ పాత్రకు దీటుగా ఉండే విలన్ పాత్ర నాది.
మీ నాన్నగారు దర్శకత్వం వహించినవాటిలో ఏ చిత్రం రీమేక్‌లో నటించాలని ఉంటుంది?
కార్తీక్, రాజేంద్రప్రసాద్‌గారి కాంబినేషన్‌లో నాన్నగారు చేసిన ‘పుణ్యస్త్రీ’ నాకు చాలా ఇష్టం. ‘యముడికి మొగుడు’కి మించిన మంచి మాస్ సినిమా ఉంటుందా? ‘యమపాశం’ సినిమా కూడా నాకిష్టం. అవకాశం వస్తే ఈ మూడు చిత్రాల రీమేక్స్‌లో నటించాలని ఉంది.
తెలుగు అబ్బాయి అయ్యుండి తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు.. మరి తెలుగులో కంటిన్యూస్‌గా చేయాలని లేదా?
మాతృభాషలో చేయాలని ఎందుకుండదు? ఈ మధ్య నాలుగైదు కథలు విన్నాను. డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ‘మలుపు’ ఉందనీ, చాలా మంచి సినిమా అని ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు. సో.. నా నెక్ట్స్ సినిమా కూడా వాళ్లతో మెప్పు పొందాలి. అందుకే ఆలోచించి ఫైనలైజ్ చేస్తా.
ప్రొఫెషనల్‌గా హ్యాపీ.. పర్సనల్ లైఫ్‌లో సెటిల్ అయ్యేదెప్పుడు?
పెళ్లే కదా. నాకెలాంటి అమ్మాయి అయితే బాగుంటుందో అమ్మానాన్నకు తెలుసు. అందుకే, అమ్మాయిని చూసే బాధ్యతని వాళ్లకే వదిలేశా. కానీ, నాక్కూడా నచ్చితేనే పెళ్లి చేసుకుంటా.