అంతా నాటకమే! | Special Interview With Super Star Rajinikanth | Sakshi
Sakshi News home page

అంతా నాటకమే!

Published Sun, Dec 2 2018 2:09 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Special Interview With Super Star Rajinikanth - Sakshi

రజనీకాంత్‌

‘తన పేరుని వింటే, కీర్తిని కంటే.. కడలి చరుచు చప్పట్లే’ అని ఓ సినిమాలో రజనీకాంత్‌ని వర్ణిస్తాడు రచయిత. నిజమే... రజనీకాంత్‌కి, సముద్రానికి చాలా దగ్గర పోలికలున్నాయి. ఆయన సినిమాలు కలెక్షన్ల సునామీలు సృష్టిస్తాయి. ఆయన అభిమాన సంద్రం గురించి చెప్పక్కర్లేదు. స్క్రీన్‌ మీద ఎగసిపడే కెరటాలాంటి ఎనర్జీ రజనీకాంత్‌ సొంతం. కానీ వ్యక్తిగతంగా సముద్రమంత లోతు, ప్రశాంతంగా ఉన్నప్పుడు సముద్రంలో కనిపించే నిశ్శబ్దం, నిర్మలత్వం రజనీలో అగుపిస్తాయి. ఇన్నేళ్ల తన సినీ ప్రస్థానం, త్వరలో ప్రారంభించబోయే రాజకీయ ప్రస్థానం గురించి ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు రజనీకాంత్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విశేషాలు మీ కోసం..

► వయసుని పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నారు. అదే ఎనర్జీ, అదే ప్యాషన్‌. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తోంది?
కెరీర్‌ స్టార్టింగ్‌లో యాక్టింగ్‌ని బ్రతుకు తెరువు కోసం ఎంచుకున్నాను. నటుడిగా నిలదొక్కుకున్న తర్వాత మా అవసరాలన్నీ తీరిపోయాక యాక్టింగ్‌ని ఎంజాయ్‌ చేయడం మొదలుపెట్టాను. చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించేది. ఒకవేళ జస్ట్‌ ప్రొఫెషన్‌లా భావించి ఉంటే బరువుగా, బాధ్యతగా అనిపించేదేమో. కానీ అదో ఆటలా అనిపిస్తోంది. అందుకే ఎనర్జీ వస్తుందనిపిస్తోంది.

► ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు?
కామెడీ సినిమాలు. కామెడీ చేయడాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాను. సెట్‌లోకి వెళ్లినప్పుడు కామెడీ సీన్‌ ఉంది అని చెప్పగానే ఎగిరి గంతేయాలి అనిపిస్తుంటుంది. వేరే వాళ్లను నవ్వించడం చాలా కష్టం. సిచ్యువేషనల్‌ కామెడీ చాలెంజింగ్‌గా అనిపిస్తుంటుంది.

► లైఫ్‌లో స్టార్టింగ్‌ స్టేజ్‌లో కండక్టర్‌గా కూడా వర్క్‌ చేశారు. ఇప్పుడేమో సూపర్‌ స్టార్‌.  జీవితాన్ని చూసే విధానంలో ఏదైనా మార్పు కనిపించిందా?
తొలినాళ్లలోనే కష్టాలు, బాధలు ఉండేసరికి ప్రస్తుతం లైఫ్‌ని ఎంజాయ్‌ చేయగలుగుతున్నాను అనిపిస్తోంది. చేదు రుచి తెలిస్తే తీపిని ఇంకా ఆస్వాదించగలం. అలాగే బాధను అనుభవించాకే సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాను.

► కండక్టర్‌ నుంచి యాక్టింగ్‌లోకి ఎలా రావాలనుకున్నారు?
చాలా పాత కథ, పెద్ద కథ. షార్ట్‌గా చెబుతా. కర్ణాటకలో బస్‌ కండక్టర్‌గా పని చేసేవాణ్ణి. ప్రతి సంవత్సరం యానివర్శరీ సెలబ్రేషన్స్‌కు ఏదో ఓ నాటకం వేయాలి. నేను దుర్యోధనుడి పాత్ర చేయాలనుకున్నాను. నేను ఎన్టీ రామారావుగారి అభిమానిని. ఆయన్ను బాగా ఇమిటేట్‌ చేసేవాణ్ణి. అప్పుడు నా స్నేహితుడు ప్రోత్సహించాడు. మా అన్నయ్య కూడా ఎంకరేజ్‌ చేయడంతో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్‌ అయ్యాను. అక్కడ బాలచందర్‌గారు పరిచయం అయ్యారు. తర్వాత మీకు తెలిసిందే.

► యాక్టింగ్‌లో మీ రోల్‌ మోడల్‌ ఎవరు?
 శివాజీ గణేశన్‌గారు. ఆయన్ను బాగా ఇమిటేట్‌ చేసేవాణ్ణి. ‘ఆల్రెడీ శివాజీ గణేశన్‌గారు ఉన్నప్పుడు మళ్లీ ఇమిటేట్‌ చేయడం దేనికి?’ అని బాలచందర్‌గారు నాతో అన్నారు. నాలో స్పీడ్‌ని గమనించారు ఆయన. ‘ఇది నీ ఒరిజినాలిటీ. నీ స్టైల్, నీ ట్రేడ్‌మార్క్‌’ అన్నారు. అలా నాకంటూ ఓ ప్రత్యేక స్టైల్‌ ఏర్పరచుకున్నాను.

► సిగిరెట్‌ ఎగరేసి నోటితో పట్టుకునే స్టైల్‌ మీ ట్రేడ్‌మార్క్‌ మేనరిజాల్లో ఒకటి. ఎక్కడ నేర్చుకున్నారు?
హిందీ సినిమాల్లో శత్రుఘ్న సిన్హా  ఫస్ట్‌ టైమ్‌ చేశారు. దాన్ని కొంచెం మార్చి కొత్తగా చేశాను.  కొన్ని వందల సార్లు ప్రాక్టీస్‌ చేసి పర్ఫెక్ట్‌ అయ్యాను.

► మీలో స్వాగ్‌ (ఒకలాంటి స్టైల్‌)  ఉందంటుంటారు. అది కూడా అలవర్చుకున్నదేనా?
అది అలవర్చుకున్నది కాదు. నాలో సహజంగానే ఉంది. అందరూ నన్ను స్టైలిష్‌గా ఉన్నాడు అంటుంటారు. బహుశా అందుకేనేమో.

► ఇంత సుదీర్ఘ కెరీర్‌లో మీరు నేర్చుకున్నదేంటి? తెలుసుకున్నదేంటి?
అంతా నాటకమే అని తెలుసుకున్నాను (పెద్దగా నవ్వుతూ).

► మీ సినిమాల ద్వారా ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటారా?
నేను ఎంటర్‌టైనర్‌ని. రజనీకాంత్‌ సినిమా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఎంజాయ్‌ చేయడానికి వస్తారు. ముందు వాళ్లందర్నీ ఎంటర్‌టైన్‌ చేయాలి. ఒకవేళ స్క్రిప్ట్‌లో వీలుందంటే కచ్చితంగా మెసేజ్‌ చెప్పాలనుకుంటా.

► కరుణానిథి, యంజీఆర్‌లు తమ సినిమాల ద్వారా రాజకీయాలను చెప్పారు. మీరు కూడా అది ఫాలో అవుతారా?
రాజకీయాలు, సినిమా రెండూ వేరు వేరు. ఫస్ట్‌ నుంచి కూడా ఈ రెండింటినీ కలపకూడదని నిర్ణయించుకున్నాను. కొన్ని సందర్భాల్లో డైలాగ్స్‌ చెబుతుంటాం. దాన్ని ఫ్యాన్స్‌ ఎలా తీసుకుంటున్నారన్నది మనం ఆపలేం. అది కూడా కావాలని చేయం. కొన్ని సార్లు జరుగుతుంటాయి.

► యంజీఆర్‌ తన జీవితం ద్వారా ఏం చెప్పారని అనుకుంటున్నారు?
సినిమా హీరో కూడా ప్రజలను పరిపాలించగలడు అని చెప్పారు యంజీఆర్‌.

► ఆయన మీకు రోల్‌ మోడలా?
సినిమా నుంచి రాజకీయాల వైపు వెళ్లాలనుకునే ఎవరికైనా ఆయన తప్పకుండా రోల్‌ మోడల్‌గా ఉంటారు.

► యంజీఆర్‌గారి నుంచి నేర్చుకున్న విషయం?
ఆయన సహాయ గుణం. పేదవాళ్లను ఆయన ఆదరించిన తీరు గొప్పది. రాజకీయ నాయకుడు అయిన తర్వాత మాత్రమే కాదు సినిమాల్లో ఉన్నప్పుడు కూడా ఆయనది సహాయం చేసిన చేయి.

► జయలలిత గారి గురించి, ఆవిడ పరిపాలన గురించి?
పరిపాలన గురించి ఇప్పుడు మాట్లాడను. కానీ పురుషాధిక్య ప్రపంచంలో తన ధైర్యం, పట్టుదల, ఒంటరిగా అన్నింటినీ ఎదుర్కోవడం... అది అభినందించవలసిన విషయం.

► మీకు, ఆవిడకు మధ్య గతంలో చిన్న డిస్ట్రబెన్స్‌లు నెలకొన్నాయి. ఆ తర్వాత మళ్లీ కలుసుకున్నారా?
మా అమ్మాయి పెళ్లికి జయలలితగారు వచ్చారు.

► కమల్‌హాసన్‌గారు, మీరు రైవల్స్‌? ఎందుకంటే ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వెళ్తున్నారు కదా?
రైవల్సా? పోటీదారులం అని కూడా అనను. కమల్‌హాసన్‌ నా ఆçప్త మిత్రుడు. ఒక సీరియల్‌కి నాకు డైలాగ్‌ డెలివరీ నేర్పించాడు కమల్‌. ఇప్పటికీ నా ఆప్తమిత్రుడే.

► మీరు సినిమాల్లో విలన్‌గానూ కనిపించారు. స్మోకింగ్, డ్రింకింగ్‌ కూడా చేశారు. అదేమైనా మీ పబ్లిక్‌ పర్సనాలిటీకి ఇబ్బంది అనుకుంటున్నారా?
నా సినిమాలు, నా జీవితం రెండూ వేరు వేరు. రెండింటినీ ఎందుకు కలపాలి? సినిమాల్లో యాక్ట్‌ చేయడానికి డబ్బులు ఇస్తారు. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని చేయాలి. రాజకీయాల్లోకి వస్తే నేను నాలానే ఉంటా. రాజకీయాల్లో కొత్త విధానాలు కొత్తదనం తీసుకు రావాలనుకుంటున్నాను. ఆరోగ్యం పరంగా అంత బాగాలేను. ఈ వయసులో రాజకీయాల్లోకి రావడం అంత సులువు కూడా కాదు.

► ఈ మధ్య మీ ఆరోగ్యం బావుండటం లేదు?
మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు దాని గురించి అసలు పట్టించుకోం. కానీ అస్వస్థతకు గురైనప్పుడు దాని విలువ తెలుస్తుంది.

► సినిమాలకు, రాజకీయాలకు తేడా ఏంటి?
ఇంకా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిని కాలేదు. నాకున్న చిన్నపాటి అనుభవంతో చెబుతున్నాను.. రాజకీయాలు చాలా చాలా కష్టం. నేను ఇందాక చెప్పినట్టు అంతా డ్రామా... గేమ్‌. సినిమాల్లో ఒక నిర్మాత, దర్శకుడు, కథా రచయిత.. ఇలా చాలా మంది ఉంటారు. కానీ రాజకీయాల్లో అన్నీ మనమే.

► సినిమాల్లో సూపర్‌ ఫాస్ట్‌గా ఉన్నారు. కానీ రాజకీయాల విషయానికి వస్తే చాలా స్లోగా ఉన్నారు.
రాజకీయాలు చాలా డేంజరెస్‌ ఆట. నెమ్మదిగా, జాగ్రత్తగా ఆడాల్సిన ఆట.

► ‘మీటూ’ ఉద్యమం మీద మీ అభిప్రాయం?
ఈ ఉద్యమం చాలా మంచిది. కానీ దీన్ని తప్పుగా ఉపయోగించకూడదు.

► మీ జీవితంలో మీ భార్య లత పోషించిన పాత్ర గురించి?
వైఫ్‌గా నా పిల్లల్ని, వాళ్ళ బాధ్యతల్ని, మా ఇంటినీ అన్నీ తనే చూసుకుంటుంది. కేవలం భార్య మాత్రమే కాదు స్నేహితురాలు, నా ఫిలాసఫర్‌గా కూడా ఉంటుంది.

► మారుతున్న టెక్నాలెజీ గురించి? ఆడియన్స్‌ కొత్త కొత్త ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్తున్నారు.
టెక్నాలజీ మార్పుని మనం ఎవ్వరం ఆపలేం. మనం వాటì కి అలవాటు పడటమే. ఎన్ని ప్లాట్‌ఫామ్‌లు వచ్చినా కూడా కంటెంట్‌ బావుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు.

► రాజకీయాలను, సినిమాలను సమాంతరంగా కొనసాగిస్తారా?
ప్రేక్షకులు నన్ను స్క్రీన్‌ మీద చూడాలనుకున్నంతవరకు, నా ఒంట్లో ఓపిక ఉన్నంతవరకూ నేను సినిమాలు చేస్తూనే ఉంటాను.

► మీరు చేసిన సినిమాల్లో మీ ఫేవరేట్‌?
‘బాషా, అలెక్స్‌ పాండ్యన్‌ (తమిళ చిత్రం ‘మూండ్రు ముగమ్‌’లో చేసిన పాత్రల్లో ఓ పాత్ర), శ్రీ రాఘవేంద్ర’ ఈ మూడు సినిమాల్లో నటుడిగా బాగానే చేశాను అనిపిస్తుంది.


‘పేట్టా’లో రజనీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement