అది పూర్వజన్మ సుకృతం
చిరంజీవి 150వ చిత్రానికి దర్శకత్వం వహించడంపై వీవీ వినాయక్
అంతర్వేది(సఖినేటిపల్లి): మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 150వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. ఈ చిత్రం తాలూకు స్క్రిప్టును గురువారం ఆయన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వినాయక్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీలోని హీరోలతో ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించినా..
వారికి సంబంధించి మొట్టమొదటిసారిగా ప్రారంభమైన కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై మొదటి చిత్రం చిరంజీవితో చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాగా చిత్రం ముహూర్తం షాట్ శుక్రవారం హైదరాబాద్‌లో చిరంజీవితో చేస్తున్నట్టు చెప్పారు. జూన్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు.