తెలుగువారి తొలి కంఠం | Special story from ghantasala Jayanti | Sakshi
Sakshi News home page

తెలుగువారి తొలి కంఠం

Published Tue, Dec 4 2018 12:20 AM | Last Updated on Tue, Dec 4 2018 12:20 AM

Special story from  ghantasala Jayanti - Sakshi

గురువుకు కృతజ్ఞతగా ఉండలేని వాడి కంఠాన సరస్వతి ఉండదు. ఘంటసాలకు గురుభక్తి ఎక్కువ. తన గురువు పట్రాయని సీతారామశాస్త్రి అంటే చాలా గౌరవం. భక్తితో మసలేవారు. అంతేనా? వారి అబ్బాయి సంగీతరావును తనసహాయకులుగా నియమించుకున్నారు. ఇరవై ఏళ్ల పాటు ఘంటసాల దగ్గర సన్నిహితంగా మెలిగిన సంగీతరావు దగ్గర ఘంటసాల జ్ఞాపకాల రాశి ఉంది. ఘంటసాల జయంతి సందర్భంగా వాటిలో కొన్ని పల్లవులు పద్యాలు వరుస కట్టిన జ్ఞాపకాలు...

ఘంటసాల కంఠం ఒక మంత్రదండం. అందులో మంద్ర, మధ్యమ, తారస్థాయులు అలవోకగా పలుకుతాయి. ఆయనతో పని చేసేవారే ఆయన ప్రతిభ చూసి అప్రతిభులు అయ్యేవారు. ఒకరోజు ఏదో పని ఉండి వాహిని స్టూడియోకి వెళ్లాను.  ‘కృష్ణా ముకుందా మురారీ’ పాట రికార్డింగ్‌ జరుగుతోంది. అక్కడున్న వాద్యబృందం, టెక్నీషియన్లు ఘంటసాల పాడుతున్న విధానానికి మంత్రముగ్ధులవుతున్నారు.  ఆ రోజు ఆర్కెస్ట్రాలో సన్నాయి సత్యం ఉన్నారు.  ఘంటసాల పాడిన అనేక పాటలకు సత్యం పని చేశారు. అయినప్పటికీ  పాటచివర ‘హే కృష్ణా! ముకుందా! మురారీ!’ అనే సాకీ తారస్థాయిని చే రే సందర్భంలో ఆ కంఠంలోని సామర్థ్యం, దైవత్వం చూసి సన్నాయి సత్యం ఉద్వేగంతో కన్నీళ్ల పర్యంతమవడం నాకు గుర్తుంది...

లవకుశ సినిమాకు సంగీతం ఘంటసాల అందించారన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఆ సినిమా నిర్మాణంలో ఉండగా కొన్నాళ్లు షూటింగ్‌ వాయిదా పడింది. కాని అప్పటికే కొన్ని పాటలను ఘంటసాల రికార్డు చేశారు. ఆ పాటలు బాగా వచ్చాయి. అవి జనానికి చేరువ కావడంలో జాప్యం అవుతుండటంతో, కనీసం తన సంగీత దైవానికైనా వినిపిద్దామనుకుని, తిరువయ్యూరు వెళ్లి త్యాగయ్యగారి సమాధి దగ్గర ఆ పాటలను గానం చేసి వచ్చారు. ఎంత మంచి విషయం, విశేషం అది...

‘రహస్యం’ సినిమాలో మల్లాది రామకృష్ణశాస్త్రి  రచించిన ఓ తత్త్వం ఉంది. ‘‘దీని భావము నీకే తెలియునురా ఆనందకృష్ణా. దీని మర్మము నీకే తెలియునురా’’ అని ప్రారంభం అవుతుంది ఈ తత్త్వం. ‘ఈ తత్త్వానికి పల్లవి ఎలా చేస్తారు’ అనుకున్నాను. మొదటి రెండు లైన్లూ చతురస్ర గతిలోను, తరవాత ఖండగతిలోను చాలా చిత్రంగా చేశారు. అది నిజమైన తత్త్వం వింటున్నంత తన్మయత్వం కలిగించింది నాకు. ఏ పాట చేసినా సంపూర్ణంగా దాని మూలాన్ననుసరించి చేయాలనే దృష్టి ఆయనది. స్త్రీల పాటలు – మంగళ హారతులు కూడా అలాగే చేసేవారు... 

శాస్త్రీయ సంగీత రచనలేవీ లేని స్కేల్స్‌లో కూడా ఆయన చాలా పాటలు చేశారు. బందిపోటు చిత్రంలోని ‘ఊహలు గుసగుసలాడే’ పాట ఇటువంటిదే. సగమపనిస – సనిపమగస... ఈ మూర్ఛన అమృతవర్షిణి, శుద్ధ ధన్యాసి, ఉదయ రవిచంద్రిక వంటి అనేక రాగాలకు సమానమే కాని సరిగ్గా ఏ రాగమో తెలియలేదు. పరిశీలిస్తే సౌదామిని రాగం అని తెలిసింది. అంతలోనే ‘సుమనేశ రంజని’ రాగ లక్షణాలు కూడా ఉన్నాయని తేలింది. ఇలా రాగాలను సంలీనం చేసి అపూర్వ ప్రయోగాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అన్నమాచార్యులను గురించి ఎక్కువగా ప్రస్తావించని రోజుల్లోనే అన్నమయ్య కృతుల్ని రాగబద్ధం చేసి పాడారు ఘంటసాల.

‘కృష్ణకుచేల’ సినిమాలో రాజసూయ యాగ ఘట్టంలో పద్యాలన్నీ వేషధారులే పాడారు – అద్దంకి శ్రీరామ్మూర్తి, సియస్సార్‌ మొదలైనవాళ్లు. అద్దంకి శ్రీరామ్మూర్తి తన పద్యాన్ని పాడేశారుగాని ‘నిలుపంజాలను నెమ్మనంబు’ పద్యాన్ని వయసు కారణంగా సియస్సార్‌ సరిగా పాడలేకపోవడంతో ఘంటసాల పాడారు. అయితే ఆ తర్వాత సియస్సార్‌ని కలిసినప్పుడు ‘మాస్టారూ! మీరు పాడిన పద్యం నేను తిరిగి పాడవలసి వచ్చింది. కానీ మీరు పాడిందే ఎంతో భావయుక్తంగా ఉంది. నేను కేవలం పద్యం పాడానంతే’ అంటూ మనఃపూర్వకంగా చెప్పారు. ఆ నిజాయితీయే ఆయనను అపూర్వ వ్యక్తిని చేసింది. 

‘‘ఘంటసాల గారికి సాహిత్యంలో వస్తున్న గీతాలు, ప్రజాజీవితంలో పాటలంటే చాలా ఇష్టం. ఆయన వాటిని వెతుక్కుంటూ శ్రీకాకుళం దాకా వెళ్లారు. ‘రావయాన రావయాన రాజా నామాలుకి (నా మహలుకి)’ అంటూ జముకు వాయిస్తూ జానపదులు పాడిన పాటను ఆయన ఇలాంటి అన్వేషణలో జానపదుల నుంచి విని సినిమాకు వాడారు. ఆయన వల్ల ‘అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా’ లాంటి పాటలు ప్రజలలో ప్రాచుర్యం పొందాయి. సినిమాలతో సంబంధం లేకుండా ప్రైవేట్‌ గ్రామఫోను రికార్డులు కూడా చేశారు. కరుణశ్రీ రచించిన ‘పుష్పవిలాపం’, ‘కుంతీకుమారి’ రసజ్ఞుల హృదయాలను దోచుకున్నాయి. శ్రీశ్రీ ‘పొలాలనన్నీ హలాల దున్నీ’, గురజాడ వారి ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ పాటలు ప్రాచుర్యం పొందాయి. ఆరోజుల్లో రేడియోలో ఎన్నో లలిత గీతాలు పాడారు ఘంటసాల. ‘ఈ చల్లని రేయి తిరిగి రానేరాదు’, ‘తూరుపు దిక్కున అదిగో చూడు’, ‘బహుదూరపు బాటసారి’ వంటి పాటలెన్నో. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆంధ్రరాష్ట్ర గానం వంటి ఆంధ్రమాతను ప్రస్తుతించే పాటలు, ‘ఆంధ్రుల చరితం అతిరసభరితం’ వంటి పాటలు ఎంతో ఉత్తేజకరంగా గానం చేశారు. తిరుపతి శ్రీవేంకటేశ్వరుని మీద పాడిన భక్తిగీతాలు తెలుగునాట ఇంటింటా వినిపించాయి. తిరుమల గిరులు ఘంటసాల గారి భక్తిగీతాలతో ప్రతిధ్వనించాయి.ఘంటసాల తన జీవిత చరమాంకంలో గానం చేసినది భగవద్గీత. ఇది రాగబద్ధం చేస్తున్నప్పుడే చాలా ఆసక్తికరంగా ఉండేది. భగవద్గీత సంగీత ప్రధానమైన రచన కాదు. ప్రధానంగా తాత్త్విక చర్చ వంటిది. అటువంటి రచనను సంగీతానికి అనుకూలంగా చేయడంలో కృతకృత్యులయ్యారు ఘంటసాల. ఘంటసాల స్వర్గస్థులై, అమరగాయకుడై నాలుగు దశాబ్దాలు దాటుతున్నా ఆయన పాడిన పాటల్ని వర్ధమాన గాయకులు ఇంకా పాడుతూండడం తెలుగువారికి ఆయనపట్ల గల అపారప్రేమకు, అభిమానానికీ నిదర్శనం. నేటికీ అనేక తెలుగు కుటుంబాలలో ఘంటసాల ప్రాతఃస్మరణీయుడు.

రహస్యం’ సినిమాలో మల్లాది రామకృష్ణశాస్త్రి  రచించిన ఓ తత్త్వం ఉంది. ‘‘దీని భావము నీకే తెలియునురా ఆనందకృష్ణా. దీని మర్మము నీకే తెలియునురా’’ అని ప్రారంభం అవుతుంది ఈ తత్త్వం. ‘ఈ తత్త్వానికి పల్లవి ఎలా చేస్తారు’ అనుకున్నాను. మొదటి రెండు లైన్లూ చతురస్ర గతిలోను, తరవాత ఖండగతిలోను చాలా చిత్రంగా చేశారు. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు కేళీ గోపాలంలో రాసిన నృత్యనాటకం తరవాతి రోజుల్లో ‘రహస్యం’ సినిమాలో ‘గిరిజాకల్యాణం’గా ఉపయోగించారు. అది ఎంత ప్రసిద్ధి చెందిందో తెలిసిందే. 
– పట్రాయని సంగీతరావు, 
చెన్నై (ఘంటసాల గురువులైన 
పట్రాయని సీతారామశాస్త్రి కుమారుడు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement