భలే మంచి రోజు | Today is the 96th birthday of ghantasala | Sakshi
Sakshi News home page

భలే మంచి రోజు

Dec 4 2018 12:17 AM | Updated on Dec 4 2018 12:17 AM

Today is the 96th birthday of  ghantasala - Sakshi

చందమామ నవ్విన రోజు పల్లవి పులకించిన రోజు
చరణం చకితమైన రోజు
గానం పరవశించిన రోజు
పాట గుండెకందిన రోజు

అనుభూతి అనుభూతించిన రోజు
మన కోసం అదృష్టం పుట్టిన రోజు
జీవితానికి ఒక తోడు వచ్చిన రోజు
ఘంటసాల పుట్టిన రోజు
పాట చిరయశస్సు పొందిన రోజు

నిట్టా జనార్దన్‌ సుప్రసిద్ధ సితార్‌ విద్వాంసులు. ఘంటసాలతో పని చేశారు. ఆయన పాటలకు సితార్‌ సహకారం అందించారు. ఘంటసాల జయంతి సందర్భంగా జనార్దన్‌ పంచుకున్న జ్ఞాపకాలు. 1958, జూన్‌ 6న ‘భాగ్యదేవత’ సినిమా కోసం మాస్టర్‌ వేణు సంగీత దర్శకత్వంలో ఘంటసాల, సుశీల పాడిన పాటకు మొట్టమొదట సితార్‌ అందించాను. నేను వాయించడం అంత దూరం నుంచి చూసిన ఘంటసాల ‘ఎంత హాయిగా ఉంది బాబూ నీ రాగం’ అని ఆలింగనం చేసుకున్నారు. అలా ఆయనతో నా సినిమా సంగీత ప్రయాణం ప్రారంభమైంది. ఒకప్పుడు గుడికి వెళ్లే సందర్భం, ఆనంద సంబరం, శోభన సన్నివేశాలలో మాత్రమే సితార్‌ ఉపయోగించేవారు. ఒకసారి ఒక సినిమా విషాద సన్నివేశంలో ‘సరోద్, సారంగి వాయించడానికి ఎవరూ లేరు. ఇప్పుడెలా?’ అన్నారు ఘంటసాల. అప్పుడు నేను సితార్‌ మీద వాయిస్తానని చెప్పి మంద్రస్థాయిలో ‘బిలాస్‌ఖాన్‌ తోడి రాగం’ లో వాయించేశాను. ఘంటసాల పరుగుపరుగున నా దగ్గరకు వచ్చి నన్ను ఆప్యాయంగా కౌగలించుకున్నారు. తాన్‌సేన్‌ కుమారుడు బిలాస్‌ఖాన్‌. తాన్‌సేన్‌ మరణించినప్పుడు బిలాస్‌ఖాన్‌ ఏడవకుండా ఒక రాగాన్ని పలికించాడు. అది బిలాన్‌ఖాన్‌ తోడి రాగంగా స్థిరపడిపోయింది. దానిని ఆ సందర్భానికి ఉపయోగించడం మంచి జ్ఞాపకం. డా.చక్రవర్తి సినిమాలో ‘మనసున మనసై... బతుకున బతుకై’ పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఆ పాట కోసం జయజయంతి రాగం వాయించమన్నారు ఘంటసాల. ఆయన మేధావితనం వల్లే ఆ పాట నిలబడింది. ఆయన స్వరపరచిన ‘లవకుశ’ సినిమాలో అన్ని సీన్స్‌కి నేను సితార్‌ వాయించాను. పునర్జన్మ చిత్రంలో ‘ఎవరివో నీవెవరివో’ పాటలో ఘంటసాల గొంతు, నా సితార్‌ పోటాపోటీగా వినపడతాయి. ‘‘ఘంటసాల ‘పయనించే ఓ చిలుకా’ ‘బంగరు బొమ్మా సీతమ్మా’ పాడుతుంటే నాకు కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ఆయన పాటలో ఉండే అనుభూతి, స్పష్టతల వల్ల ఆయన పాటలో నిమగ్నమైపోతాం. అలాగే ఘంటసాల ఆలపించిన ‘జయదేవుడి అష్టపదులకు’ సితారు అందించడం నేను నా జీవితంలో మరచిపోలేను. ఒకసారి ఘంటసాల భార్య సావిత్రమ్మ... ‘మీరు జనార్దన్‌ గారు ఎలా వాయించినా విని ఊరుకుంటారేంటి’ అన్నారు. అందుకు ఆయన ‘జనార్దన్‌ విద్వాంసుడు. మనం చెప్పక్కర్లేదు’ అని నా మీద ఉన్న నమ్మకాన్ని వివరించారు. ఘంటసాల తనకు మూడు కోరికలున్నాయని చెప్పేవారు. భగవద్గీత స్వరపరచుకుని గానం చేయడం, విదేశీ పర్యటన, తన పేరుతో ఒక సంగీత పాఠశాల ప్రారంభించడం. ఆయన బతికుండగా మొదటి రెండు జరిగాయి. గతించాక మూడోది కూడా జరిగింది. 

ఘంటసాలగారికి విదేశీ పర్యటన చేయాలనే కోరిక 1971లో నెరవేరింది. యునైటెడ్‌ నేషన్స్‌ ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లి అక్కడ పాటలు పాడి అందరినీ అలరించారు. ఆయన వెంట నన్ను కూడా తీసుకువెళ్లారు. నేను ముందుగా ఒక పావుగంట సేపు శాస్త్రీయ సంగీతకచేరీ చేశాక, ఆర్కెస్ట్రాలో వాయిస్తానని చెప్పాను. ఆయన నిండు మనసుతో అంగీకరించారు. ఆఖరి రోజుల్లో స్వరపరచిన భగవద్గీతకు ‘జనార్దనే సితార్‌ వాయించాలి’ అని పట్టుబట్టారు ఘంటసాల. ఒక్కో శ్లోకం ఒక్కో రాగంలో రూపొందించారు. ముందరి రాగాల నుంచి తరవాత రాగానికి చేరుకోవాలి. అంటే అది ఇంటర్‌లింక్‌ చేయాలి, అలాగే చేశాను. ఘంటసాల తుదిశ్వాస వరకు ఆయన పాటలకు సితార్‌ వాయిస్తూనే ఉన్నాను.  ‘ఘంటసాల గానగంధర్వుడు’. అలాంటివాళ్లు మళ్లీ పుట్టరు.
– నిట్టా జనార్దన్, సితార్‌ విద్వాంసులు
 

ఘంటసాల పాడిన ఈ పాటలకు సితార్‌ నేనే వాయించాను
మనసున మనసై (డా. చక్రవర్తి), దివి నుంచి భువికి దిగి వచ్చే (తేనె మనసులు), చెలికాడు నిన్నే రమ్మని పిలువ (కులగోత్రాలు), విన్నవించుకోనా చిన్న కోరిక (బంగారు గాజులు), విన్నానులే ప్రియా (బందిపోటు దొంగలు), మల్లియలారా మాలికలారా (నిర్దోషి), (మౌనముగానే మనసు పాడిన వేణు గానములు వింటిలే (గుండమ్మ కథ), మురిపించే అందాలే అవి నన్నే చెందాలే (బొబ్బిలియుద్ధం), పూవై విరిసిన (తిరుపతమ్మ కథ), ఊహలు గుసగుసలాడే (బందిపోటు), నన్ను దోచుకుందువటే (గులేబకావళి కథ), ప్రియురాల సిగ్గేలనే (శ్రీకృష్ణార్జున యుద్ధం), హిమగిరి సొగసులు (పాండవ వనవాసం), తొలివలపే పదే పదే (దేవత), విన్నారా అలనాటి వేణుగానం (దేవుడు చేసిన మనుషులు), జగమే మారినది మధురముగా ఈ వేళ (దేశ ద్రోహులు), కిలకిల నవ్వులు చిలికిన (ఇద్దరు మిత్రులు).
- నిట్టా జనార్దన్‌
సంభాషణ డా.వైజయంతి పురాణపండ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement