వీళ్లు హీరోల్రా బుజ్జీ | Special story to lady oriented movies | Sakshi
Sakshi News home page

వీళ్లు హీరోల్రా బుజ్జీ

Published Tue, Oct 16 2018 12:00 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Special story to lady oriented movies - Sakshi

సినిమా అనగానే హీరో ఎవరు అని అడుగుతారు.వాల్‌పోస్టర్‌ మీద హీరోయే క్రౌడ్‌ పుల్లర్‌.టైటిల్స్‌లో ఫస్ట్‌ కార్డ్‌ హీరోదే.అవన్నీ వదిలేయండి అంటున్నారు హీరోయిన్లు. వియ్‌ కెన్‌ అని నిరూపిస్తున్నారు.పూర్వం కెరీర్‌ దాదాపు ముగిసే దశలో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చేసేవారు.ఇప్పుడు పీక్‌ కెరీర్‌లో కూడా హీరో క్యాన్సిల్‌ అంటున్నారు.తెర మీద హీరో రహిత కథను భుజాన వేసుకుని పండిస్తున్నారు.హీరోల్రా బుజ్జీ అనిపిస్తున్నారు.నవ రాత్రుల వేళ  షేర్‌ చేసుకోవాల్సిన స్త్రీ శక్తి ఇది.

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌ అనే తేడా లేకుండా ఇప్పుడు కథల తీరు మారింది. హీరోలకు మాత్రమే కథలు రాసే స్థితి నుంచి హీరోయిన్ల కోసమే కథలు రాసే పరిస్థితికి సినీ పరిశ్రమ ఎదిగింది. హీరోయిన్లు కూడా నాలుగు డ్యాన్సులు వేసి క్లయిమాక్స్‌లో తాళ్లతో చేతులను కట్టివేస్తే హీరో కోసం వెయిట్‌ చేస్తూ చూసే పాత్రల కంటే సొంత ప్రతిభను ప్రదర్శించగలిగే లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. 2018లో అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ప్రేక్షకులు కూడా హీరో లేకపోయినా పర్లేదు అనుకుని సినిమాలు చూస్తున్నారు. హీరోయిన్లనే హీరోలుగా భావిస్తున్నారు. 

హిట్‌ హిట్‌ హుర్రే
హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలలో ఈ సంవత్సరం ‘భాగమతి’ బోణి కొట్టింది. ఆ పాత్రను పోషించిన అనుష్క తన ఖాతాలో మరో హిట్‌ వేసుకుని కథల ఎంపికలో తన మతిని క్షితిని నిరూపించుకున్నారు. ఆ తర్వాత కాజల్‌ ‘అ!’ సినిమా చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. స్త్రీ పాత్రల ప్రాముఖ్యంతో వచ్చిన ఈ సినిమా మారిన తెలుగు సినీ ధోరణులకు ఒక ఉదాహరణ. ఇక ఆంధ్రుల అభిమాన తార సావిత్రి బయోపిక్‌ ఎలా ఉంటుందో అని ఆందోళన చెందిన అభిమానులను తన పెర్‌ఫార్మెన్స్‌తో చతికులను చేసి హీరోయిన్‌ కేంద్రంగా చేయగలిగే సినిమా ఏ రేంజ్‌కు వెళ్లగలదో చూపించారు కీర్తీ సురేశ్‌. మంచు లక్ష్మి ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ చేశారు. మరో వైపు హిందీలో దీపికా పదుకోన్‌ ‘పద్మావత్‌’గా, అనుష్కా శర్మ ‘పరీ’గా, రాణి ముఖర్జీ ‘హిచ్కీ’తో  బాక్సాఫీస్‌ దగ్గర చప్పట్లు కొట్టించారు. ‘వీరే ది వెడ్డింగ్‌’తో న్యూ ఏజ్‌కు వెల్కమ్‌ చెప్పారు కరీనాకపూర్, సోనమ్‌ కపూర్‌లు. తమిళంలో  నయనతార ‘ఆరమ్‌’, ‘కోకోకోకిల’ సినిమాలు చేశారు. ఇక  సమంత ‘యూ టర్న్‌’ సినిమా చేసి మూస సినిమాలను యూ టర్న్‌ కొట్టేలా చేయగలిగారు. ఇవి ఇప్పటి దాకా రిలీజ్‌ అయిన సినిమాలు. రాబోతున్న సినిమాల విషయానికి వస్తే...

రేడియో జాకీ విజయలక్ష్మి
జ్యోతిక కేవలం గృహిణిగా, నటుడు సూర్య భార్యగా ఉండిపోదలచుకోలేదు. నటిగా తన ప్రతిభను, మార్కెట్‌ను కొనసాగించదలిచారు. ఈ సంవతర్సం ‘నాచ్చియార్‌’లో ఆమె పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించారు. ఇప్పుడు హిందీలో హిట్‌ అయిన ‘తుమ్హారీ సులూ’ సినిమా తమిళ వెర్షన్‌లో నటిస్తున్నారు.  దర్శకుడు రాధా మోహన్‌ సౌత్‌ ఆడియన్స్‌  టేస్ట్‌కు తగ్గట్టుగా కథను మార్చి తెరకెక్కించారట. తమిళంలో ‘కాట్రిన్‌ మొళి’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రం నవంబర్‌లో రిలీజ్‌ కానుంది.

అదిగో ఆ పక్షిలా...
హీరోలే కాదు హీరోయిన్లు కూడా ఫైట్లు చేయగలరు అని యాక్షన్‌ సినిమా చేస్తున్నారు అమలా పాల్‌.  స్క్రిప్ట్‌కి కట్టుబడి యాక్షన్‌ సీక్వెన్స్‌లో రిస్కులు చేసి, కొన్ని కట్లు కూడా కట్టించుకున్నారు. ఆమె ముఖ్య పాత్రలో రూపొందుతోన్న  యాక్షన్‌ మూవీ ‘అదో అంద పరవై పోల’ (అదిగో ఆ పక్షిలా). కథ అంతా అడువుల్లో జరగనుందట. వినోథ్‌ కేఆర్‌ దర్శకత్వం  వహిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే మరో లేడీ ఓరియంటెడ్‌ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు అమలాపాల్‌. ‘మేయాద మాన్‌’ వంటి కామెడీ జానర్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ సాధించిన దర్శకుడు రత్నకుమార్‌ అమలాపాల్‌తో ‘ఆడై’ అనే సినిమాను తీయనున్నాడు. ‘ఆడై’ అంటే దుస్తులు అని అర్థం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని చూసి ‘బోల్డ్‌’గా ఉందని చాలామంది అన్నారు. 

గ్రామీణ యువతి కనా
క్రికెట్‌ మగవాళ్ల క్రీడ. ఆడవాళ్ల క్రికెట్‌కు పెద్ద గిరాకీ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా క్రికెట్‌ నేపథ్యంగా సినిమా రావడం విశేషం.  తెలుగు మూలాలున్న తమిళ హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేశ్‌ నటిస్తున్న ఈ స్పోర్ట్స్‌ డ్రామాలో  ప్రపంచ స్థాయి క్రికెట్‌ మ్యాచ్‌ ఆడాలని తాపత్రయపడే గ్రామీణ యువతి కలలు కథాంశం. సినిమా పేరు ‘కనా’. అంటే కల అని అర్థం. ఈ సినిమాను తమిళ నటుడు శివకార్తికేయ నిర్మించి, ఓ చిన్న గెస్ట్‌ రోల్‌ కూడా చేయడం విశేషం. ‘కనా’ రిలీజ్‌కి రెడీ అవుతోంది.


సౌత్‌లో క్వీన్స్‌
మూడు భాషల్లో ముగ్గురు కథానాయికలతో ఏక కాలంలో హిందీ ‘క్వీన్‌’ సినిమా సౌత్‌లో రీమేక్‌ అవుతోంది. తెలుగులో ‘దటీజ్‌ మహాలక్ష్మీ’ అంటూ తమన్నా, ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ అంటూ తమిళంలో కాజల్‌ అగర్వాల్, మలయాళంలో ‘జామ్‌ జామ్‌’ అంటూ మంజిమా మోహన్‌ నటిస్తున్నారు. పెళ్లి ఆగిపోవడంతో తన గురించి తాను తెలుసుకోవడం కోసం ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టిన అమ్మాయి కథే ఈ క్వీన్‌.షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. తెలుగు వెర్షన్‌ను దర్శకుడు నీలకంఠ మధ్యలో తప్పుకోవడంతో ‘అ!’ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మిగతా పనిని పూర్తి చేశారు.

ఒకే పాత్రతో
ఒక్కటంటే ఒకే  పాత్ర తో నాలుగు భాషల్లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వికే ప్రకాశ్‌. ఈ సాహసానికి రెడీ అయ్యారు నిత్యా మీనన్‌. తెలుగు, తమిళం. కన్నడం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. పాత్ర తీరు తెన్నులు నచ్చకపోతే మేకప్‌ కిట్‌ కూడా ముట్టుకోని  నిత్యా ఈ సినిమా చాలా స్పెషల్‌గా ఉండబోతోంది అంటున్నారు. ఇందులో రచయిత్రి పాత్ర పోషించారామె. రిలీజ్‌కి రెడీ అయింది.


మళ్లీ భయపెడతాం!

‘గీతాంజలి’తో ఆడియన్స్‌ను ఏకకాలంలో భయపెట్టి, నవ్వించారు అంజలి. హారర్‌ కామెడీ సినిమాల్లో కొత్త ట్రెండ్‌ తీసుకొచ్చింది ‘గీతాంజలి’. ఆ మ్యాజిక్‌ని మళ్లీ రిపీట్‌ చేయాలనుకుంటున్నారు. అందుకే సీక్వెల్‌ ప్లాన్‌ చేశారు. అమెరికా, ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ కొత్త చిత్రం ఉండబోతోందట.  కోన వెంకట్‌ నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

రాకెట్‌ స్టోరీ
బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్‌ కథ యువతకు స్ఫూర్తినిచ్చే కథావస్తువు. అది గ్రహించిన బాలీవుడ్‌ దర్శకుడు అమోల్‌ గుప్తే ఆమె బయోపిక్‌ రూపొందించే పనిలోపడ్డారు. సైనాగా శ్రద్ధా కపూర్‌ నటిస్తున్నారు. సైనాలా రాకెట్‌ తిప్పడం కోసం శ్రద్ధా కపూర్‌ రోజూ 4,5 గంటలు శ్రద్ధగా బ్యాడ్మింటన్‌ ప్రాక్టీస్‌ చేశారట. ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు.

తాప్సీ ‘గేమ్‌ ఓవర్‌’
2018 తాప్సీకి బ్లాక్‌బస్టర్‌ సంవత్సరం. అటు బాలీవుడ్, ఇటు సౌత్‌ ఇండస్ట్రీల్లో సక్సెస్‌ టేస్ట్‌ చేశారు. ఇప్పుడు ‘గేమ్‌ ఓవర్‌’ అంటూ సింగిల్‌ స్టార్‌గా వస్తున్నారు. సినిమా ఇటీవలే స్టార్ట్‌ అయింది. వీల్‌ చైర్‌లో ఉన్న తాప్సీ ఫొటోను ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌గా విడుదల చేశారు. థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. అశ్విన్‌ శర్వానణ్‌ దర్శకుడు. సో.. హీరోయిన్లందరూ ‘హీరో’లవుతున్నారు. అంతేకదా.. సినిమాని నడిపించేవాళ్లను ‘హీరో’ అనే అంటారు కదా.
ఇన్‌పుట్స్‌: గౌతమ్‌ మల్లాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement