ఇంగ్లిష్ వాళ్లకు ‘జేమ్స్‌బాండ్’ ఉన్నాడు. హిందీ వాళ్ళకు ‘టైగర్’ ఉన్నాడు. మరి తెలుగు వాళ్లకు? నెల్లూరు నుంచి ‘ఏజెంట్ ఆత్రేయ’ దొరికాడు. ఈ క్యారెక్టర్‌తో సిరీస్‌గా ఎన్ని సినిమాలైనా తీయవచ్చు. ఈ క్యారెక్టర్‌ని స్క్రీన్ ఐకాన్‌గా మార్చవచ్చు.మనకు డిటెక్టివ్ రచయితలు ఉన్నారు కానీ డిటెక్టివ్ హీరోలు లేరు. కొవ్వలి, టెంపోరావ్, కొమ్మూరి సాంబశివరావు, మధుబాబు, పానుగంటి వీరంతా తెలుగులో డిటెక్టివ్ సాహిత్యం లేదా ‘సీక్రెట్ ఏజెంట్’ సాహిత్యం సృష్టించారు. వీళ్లు సృష్టించిన డిటెక్టివ్‌లు ‘డిటెక్టివ్ వాలి’, ‘యుగంధర్’, ‘షాడో’, ‘బుల్లెట్’ వీరంతా పాఠకులకు ఇష్టులు. హీరోలు.బెంగాలీ సాహిత్యం తెలుగు సాహిత్యం మీద ప్రభావం చూపుతున్న 1950ల కాలంలో బెంగాలీలో విపరీతంగా వస్తున్న డిటెక్టివ్ సాహిత్యానికి ప్రభావితమైన తెలుగువారు ఉన్నారు. చక్రపాణి వంటివారు అందుకే ‘మిస్సమ్మ’లో తొలి లోకల్ డిటెక్టివ్‌ను చూపించారు. మిస్సమ్మలో అక్కినేని స్కూల్ సూపర్‌వైజర్ కమ్ డిటెక్టివ్. ఎప్పుడూ హ్యాట్, చేతిలో స్టిక్, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని తిరుగుతుంటాడు. ప్రతి డిటెక్టివ్‌కు ఒక అసిస్టెంట్ ఉన్నట్టే అక్కినేనికి కూడా అంజిగాడు అసిస్టెంట్‌గా ఉంటాడు. మిన్ను విరిగి మీద పడినా అతడు చలించకుండా ఏదో నోట్ చేసుకుంటూ ఉంటాడు. అక్కినేని చేసిన ఈ పాత్ర ఎంత హాస్యం పండించినా తుదకు సావిత్రే మిస్సమ్మ అని తేల్చడంలో కీలకంగా మారి తన వృత్తి ధర్మానికి న్యాయం చేకూర్చింది. అక్కినేని టాలెంట్ వల్ల ఆ పాత్ర హిట్ అయ్యింది కాని అలాంటి పాత్రలు రిపీట్ కాలేదు.
కాని సినిమా రంగంలో ఉంటూ డిటెక్టివ్ సాహిత్యాన్ని బాగా ఔపోసన పట్టినవాడు ఆరుద్ర. ఆయన చొరవతోనే ‘గూఢచారి 116’ వంటి సినిమాలు తెలుగులో సాధ్యమయ్యాయి. తెలుగు తెర మీద తొలి జేమ్స్‌బాండ్‌గా కృష్ణ ఇప్పటికీ ప్రశంసలు అందుకుంటున్నారు. కాని ఆ తర్వాత ఆ స్థాయిలో ఏజెంట్ సినిమాలు హిట్ కాలేదు. కృష్ణ హీరోగా ‘ఏజెంట్ గోపి’, ‘రహస్య గూఢచారి’ తదితర సినిమాలు తయారయ్యాయి. చిరంజీవి హీరోగా ‘గూఢచారి నం.1’ సినిమా వచ్చింది.
ఈ సందర్భంలోనే కొమ్మూరి సాంబశివరావు వీర శిష్యుడు అయిన మల్లాది వెంకటకృష్ణమూర్తి తెలుగులో లోకల్ డిటెక్టివ్ పాత్రను సృష్టించారు. ‘చంటబ్బాయ్’ నవలలో ఆయన సృష్టించిన పాండురంగారావు పాత్ర ఆ తర్వాత వెండితెర మీద చిరంజీవి పోషించడంతో ‘జేమ్స్‌పాండ్’ అయ్యింది. ‘చంటబ్బాయ్’ ఒక కామెడీ డ్రామాగా నిలిచింది తప్ప పూర్తిస్థాయి ఏజెంట్ సినిమా కాలేకపోయింది. ఆ తర్వాత సస్పెన్స్ సినిమాలలో ఆరితేరిన దర్శకుడు వంశీ– మోహన్‌బాబు హీరోగా ‘డిటెక్టివ్ నారద’ తీశారు. ఒక ఇంట్లో జరుగుతున్న గూడుపుఠాణీని ఆ ఇంటికి డిటెక్టివ్‌గా వచ్చిన నారద ఛేదించడం కథ. ఇందులో మోహన్‌బాబు అసిస్టెంట్ అల్లావుద్దీన్‌గా మల్లికార్జునరావు నటించాడు. ఆ సినిమా హిట్ అయితే ఎలా ఉండేదో కాని జనం నిరాదరించారు.
ఆ తర్వాత చాలా కాలం తెలుగు సినిమా ఈ లాంగ్ కోట్, నల్ల కళ్లద్దాలు, తలమీద హ్యాట్, జేబులో భూతద్దంతో తిరిగే ఏజెంట్ పాత్రను పట్టించుకోలేదు. తమిళంలో కూడా ఇదే పరిస్థితిగా ఉండగా దర్శకుడు మిష్కిన్ ‘డిటెక్టివ్’ పాత్రను మళ్లీ తెర మీదకు తెచ్చి విశాల్‌తో సూపర్ హిట్ కొట్టాడు. ఆధారాలు ఏమీ దొరక్కుండా భారీ మొత్తాలకు వ్యక్తుల అడ్డు తొలగించే ఒక కరడు కట్టిన ముఠాను డిటెక్టివ్ విశాల్ ఎలా పట్టుకున్నాడన్నది ఈ సినిమాలో మిష్కిన్ చాలా రోమాంచితంగా చూపించాడు. అయితే ఈ సినిమాలో డిటెక్టివ్‌కు అసిస్టెంట్‌గా వేసిన నటుణ్ణి హాస్యగాడిగా కాకుండా అతణ్ణి కూడా ఒక సమవుజ్జీగా దర్శకుడు చూపించాడు. తెలుగులో కూడా ఇది హిట్ కావడంతో డిటెక్టివ్ సినిమాల మూడ్ సెట్ అయ్యింది. ఇప్పుడు ‘సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఆ మూడ్‌ను స్థిరపరచడమే కాదు తెలుగు ప్రేక్షకులకు ఒక లోకల్ ఏజెంట్‌ను సక్సస్‌ఫుల్‌గా ఇచ్చింది.
సాధారణంగా ఏజెంట్లు, డిటెక్టివ్‌లు సిటీ బ్యాక్‌డ్రాప్‌లో తిరుగుతుంటారు. కాని ఈ సాయి శ్రీనివాస ఆత్రేయ మాత్రం కోస్తా జిల్లా అయిన నెల్లూరు చుట్టుపక్కల తిరుగుతుంటాడు. అసలు ఈ పాత్రకు ‘సాయి శ్రీనివాస ఆత్రేయ’ అని పెట్టడమే ఒక నేటివిటి. ‘ఏజెంట్ విక్రమ్’లాగా పెట్టి ఫిక్షనల్ చేయకుండా సినిమాలో చెప్పినట్టు ‘నాది ఫిక్షనల్ క్యారెక్టర్ కాదు రియల్ క్యారెక్టర్’ అనేవిధంగా చూపి ప్రేక్షకులకు దగ్గర చేశాడు దర్శకుడు స్వరూప్. ఇక హీరో నవీన్ పోలిశెట్టి అసలు సిసలు తెలుగు డిటెక్టివ్‌గా కనిపించి ఇతను కేసు ఛేదించే తీరుతాడు అనే నమ్మకం కలిగిస్తాడు. సాధారణంగా డిటెక్టివ్ కథలు నలిగిన ఇతివృత్తాలతో ఉంటాయి. కాని ఇందులో కొంచెం రియల్ క్రైమ్‌ను బేస్ చేసుకున్నారు. రైల్వే ట్రాక్‌ల దగ్గర తరచూ కనిపించే అనాథ శవాలు ఎవరివి, అవి ఎందుకు ఉంటున్నాయి, ఆ మరణాలకు కారణం ఎవరు అనేది ఈ సినిమా కథ. దీనికి ‘రెలిజియస్ క్రైమ్స్ ఇన్ ఇండియా’ అనే స్టడీ నేపథ్యం కావడం కూడా ప్రేక్షకుల్లో చైతన్యం పెంచే అంశం.
చాలా తక్కువ బడ్జెట్ ఉన్నా, వనరులు తక్కువ ఉన్నా ఒక తెలుగు డిటెక్టివ్ పూనుకుంటే క్రైమ్‌ను ఛేదించే సత్తా ఉంటే ఒక జత బట్టలతో కూడా సినిమా మొత్తం నడిపి మెప్పించగలడని ఈ సినిమా నిరూపిస్తుంది. నిజానికి ఈ ఏజెంట్ పాత్రలు కత్తి మీద సాము. హిందీలో వందలకోట్ల ఖర్చుతో సల్మాన్ ఖాన్‌ను హీరోగా పెట్టి తీసిన ‘ఏక్ థా టైగర్’ కలెక్షన్ల పరంగా బాగున్నా సినిమా పెద్దగా టాక్ సంపాదించుకోలేదు. అయినప్పటికీ టైగర్ సిరీస్‌ను కంటిన్యూ చేయడానికి ‘టైగర్ జిందా హై’ తీశారు. అది ఘనవిజయం సాధించింది. కాని అంతే భారీగా సైఫ్ అలీఖాన్‌ను హీరోగా పెట్టి దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తీసిన ‘ఏజెంట్ వినోద్’ ఫ్లాప్ అయ్యింది. అలాంటి నేపథ్యంలో తెలుగు నుంచి ఒక పాత పద్మిని ప్రీమియర్ కారులో తిరిగే డిటెక్టివ్ జనానికి నచ్చడం విశేషమే.
సమాజంలో నేరం పెరిగింది. నేరం చేసే మనుషులు మన ఇరుగు పొరుగే ఉంటారు అన్నంతగా వార్తలు కలవర పరుస్తున్నాయి. సైబర్ నేరాలకైతే అంతే లేదు. ఇందుకు ఆడా మగా తేడా లేదు. దొంగ ఐడీ సృష్టించి వేరే ఫొటోలు డిస్‌ప్లే పిక్చర్‌లుగా పెట్టి పెళ్లి కూతురుగా ఒక మహిళ ఒకతన్ని మోసం చేస్తే, సినిమా ప్రొడ్యూసర్‌గా మరో మహిళ మరొకతన్ని మోసం చేసిన ఘటనలు వారం రోజుల వ్యవధిలో బయటపడ్డాయి. డ్రగ్స్ సరఫరాలు నిర్వహించే ముఠాలు, హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడే ముఠాలు... వీటిని ఛేదించే ఆత్రేయలు ఇవాళ చాలామంది అవసరం. ఆ ముఠాల గుట్టు బట్టబయలు చేసి ప్రేక్షకులను అలెర్ట్ చేయడం కూడా ముఖ్యం.
బహుశా రాబోయే రోజుల్లో ‘ఆత్రేయ ఇన్ పూణె’, ‘ఆత్రేయ ఇన్ అమలాపురం’, ‘ఆత్రేయ ఇన్ ఫలక్‌నుమా’ అనే సినిమాలు రావచ్చు. అలాంటి సినిమాలకు చాన్స్ ఉన్న పాత్రను సృష్టించినందుకు ‘సాయి శ్రీనివాస ఆత్రేయ’ యూనిట్‌కు రీసౌండ్ వచ్చేలా చప్పట్లు కొట్టాలి. తప్పకుండా నల్ల కళ్లద్దాలు కొని గిఫ్ట్‌గా బహూకరించాలి.– కె
బ్రేక్ కోసంఎదురు చూశాం– విజయ్ దేవరకొండ
నవీన్ పోలిశెట్టి, శృతీ శర్మ హీరోయిన్లుగా స్వరూప్ తెరకెక్కించిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా కొసాగుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖులు చిత్రాన్ని వీక్షించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో విజయ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్‌గా ఉన్నప్పటి మెమొరీస్‌ను గుర్తు చేసుకున్నట్టుంది నాకు ప్రస్తుతం. నవీన్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. మేమిద్దరం కలసి థియేటర్ చేశాం. కలసి యాక్టింగ్ ప్రాక్టీస్ చేశాం. మాకు బ్రేక్ ఎప్పుడు వస్తుందా? అని కలసి ఎదురు చూసే వాళ్లం. థియేటర్ చేస్తున్న రోజుల్లో నవీన్ మమ్మల్ని అందర్నీ బాగా ఎంటర్‌టైన్ చేసేవాడు. నాకు ‘పెళ్లి చూపులు’ సినిమాతో బ్రేక్ రావడాన్ని వాడు చాలా సంతోషించాడు. ఇప్పుడు వాడికి బ్రేక్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మన ఇండస్ట్రీకి మరో మంచి హీరో దొరికాడు. చాలా హ్యాపీగా ఉంది. నాకు కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది (నవ్వుతూ). స్వరూప్ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు. రాహుల్‌గారు కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడం చాలా సంతోషం. ఈ సినిమాను అందరూ చూడాలి. కచ్చితంగా ఎంటర్‌టైన్ అవుతారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment