సాక్షి, హైదరాబాద్ : కథానాయకుడు బోల్తా కొట్టడంతో... మహానాయకుడుపై మేకర్స్ ప్రత్యేక దృష్టి సారించి ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే.. అందరి ఊహాగానాలకు భిన్నంగా సాగిన ఈ సినిమా అభిమానులను ఆశ్చర్యంలో ముంచింది. బయోపిక్ అంటే కత్తిమీద సాము లాంటిది. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే.. కొందరికి రుచించకపోవచ్చు. కొన్ని వాస్తవాలను దాచిపెట్టినా... అసలు ఏమాత్రం పొంతనలేని, జరగని సంఘటనలు జరిగినట్టు చూపించడమే కాకుండా ఈ సినిమాలో కథకు మూలమైన నాయకుడి పాత్రను తగ్గించి మరోపాత్రకు ప్రాధాన్యత కల్పించడంతో అసలు బయోపిక్ అర్థాన్నే మార్చడం గమనార్హం.
బాలీవుడ్‌లో వచ్చిన ‘సంజు’ గమనిస్తే అందులో సంజయ్ దత్ కావాలని ఎలాంటి తప్పు చేయలేదనీ, పరిస్థితులే అతన్ని అలా మార్చేశాయనీ, తప్పంతా మీడియాదేనని, సంజు మంచి బాలుడు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సంజు పాత్రలో రణ్‌బీర్ అద్భుత నటనకు ప్రశంసలైతే వచ్చాయి. కానీ, సినిమా కథ, కథనాలపై ఘాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తెలుగులో బయోపిక్ ట్రెండ్ రావడానికి కారణం మహానటి.
అలనాటి మహానటి సావిత్రి జీవితం గురించి, ఆమె చివరి రోజుల్లో మద్యానికి బానిసవ్వడం, ఆమె మరణానికి దారితీసిన కారణాలు అందరికీ తెలిసిందే. అయితే ‘మహానటి’లో సావిత్రిలోని మంచి గురించి, చెడు గురించి చెప్పారు కాబట్టే.. ఆ చిత్రాన్ని ఆదరించి పట్టం కట్టారు. అయితే ఆమెలోని చెడును కూడా ప్రేక్షకులు ఒప్పుకునేట్టు చేసి.. ఆ పరిస్థితిలో ఎవరైనా అలాగే చేస్తారులే.. అని ప్రేక్షకుల చేతే అనిపించేలా చేయగలగడం దర్శకుడి గొప్పదనం. అందుకే మహానటి అంతటి విజయాన్ని సొంతంచేసుకుని.. ఆ మహానటికి నిజమైన నివాళిగా ‘మహానటి’ చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాకుండా కథను ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా చెప్పడమే కాకుండా ఆ పాత్రను వేస్తున్న నటీనటులు అందులో పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడే ప్రేక్షకులు ఆ పాత్రను నమ్ముతారు. పాత్రతో పాటే లీనమవుతారు. ఇలా మహానటికి అన్నీ కుదరడంతో తెలుగు తెరపై బయోపిక్‌లకు మార్గదర్శకంగా నిలిచింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్‌ది స్వర్ణ యుగమని అందరికీ తెలిసిందే. తిరుగులేని కథానాయకుడిగా ప్రజల్లో దేవుడిగా ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనాలు సృష్టించారు. అయితే ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయనకు ఎదురైన అనుభవాలు, లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించడం.. చంద్రబాబు వెన్నుపోటు పొడవడం, చివరగా ఆయన మరణం... ఇదంతా వెండితెరపైన చూపిస్తే ఎన్టీఆర్ బయోపిక్ సక్సెస్ అయ్యేదేమో. అలా కాకుండా వారు మెచ్చిన వాటిని ఎంపిక చేసుకుని నచ్చినట్టుగా తెరకెక్కిస్తే సహజంగానే ప్రేక్షకుల ఆదరణ లభించదన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇటీవల విడుదలైన యాత్ర సినిమా కూడా ప్రేక్షకులను కదిలించిందంటే.. కథ, కథనంలో ఉన్నఆ పట్టు.. ఆ పాత్రను అంతగా పోషించిన కథానాయకుడు పాత్రలో జీవించారు. సినిమాలో భావోద్వేగాలు పండటంతోనే సినిమా అందరిని ఆకట్టుకుంది. సినిమా పక్క దారి పట్టకుండా వారు ఏం చెప్పదలుచుకున్నారో అదే చెప్పారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్‌గా చెప్పుకుంటున్న కథానాయకుడు, మహానాయకుడులో అవి లోపించాయి. కథను తమకు నచ్చినట్టుగా మార్చడంతో అసలు విషయాలను కావాలనే దాచిపెట్టినట్టు ప్రేక్షకుల ముందు ఇట్టే తేలిపోయింది. తెరపై ఎన్టీఆర్ పాత్రను పండించడం పక్కన పెడితే, ప్రేక్షకులను సినిమాలో లీనం చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కోవలసివచ్చింది.
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానాయకుడు పూర్తిగా గాడి తప్పడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఇది ఎన్టీఆర్ గురించి తీసిన సినిమా? లేక చంద్రబాబును పైకెత్తడానికి తీసిన సినిమా? అన్న అనుమానం సగటు ప్రేక్షకుడికి వస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విడుదల చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలో అత్యంత దుర్భరమైన వెన్నుపోటు ఘటనను చూపించకపోవడం కావాలనే పక్కన పెట్టినా... విలన్ పాత్రలో ఉండాల్సిన వ్యక్తిని హీరో పాత్రలో చూపించడం ప్రేక్షకులకు ఏమాత్రం మింగుడుపడటం లేదు.
ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచిన వెన్నుపోటు ఘటనలో ముద్దాయిని చూపించకపోయినప్పటికీ ఎన్టీఆర్, ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ ఒక మునిగిపోతున్న నావగా చిత్రీకరించడమే కాకుండా ఆ నావను ఒడ్డుకుచేర్చి కాపాడిన మహోన్నత వ్యక్తిగా బాబును చిత్రీకరించారు. ఈ వక్రీకరణలు మింగుడుపడని అభిమానులు సోషల్‌మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకుడికి బాబు మహానాయకుడా..లేక ఎన్టీఆర్ మహానాయకుడా అన్న సందేహం వస్తుంది. కథను కథనాన్ని గమనిస్తే బాబుకోసం ఈబయోపిక్ ను బలిపెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దాంతో సహజంగానే అందరి దృష్టి ఇప్పుడు వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై పడింది. సినిమాను ప్రకటించినప్పటి నుంచి సాధారణ ప్రేక్షకుడు సైతం.. వర్మ తీస్తున్న సినిమాపైనే ఆసక్తి చూపించాడన్న సంగతి తెలిసిందే. మహానాయకుడు ఎక్కడ ముగిసిందో.. ఎన్టీఆర్ జీవితంలో అసలు కథ ఎప్పుడు మొదలైందో.. అక్కడి నుంచే వర్మ తన సినిమాను ప్రారంభించడమే అందరి దృష్టిలో పడటానికి కారణం. మహానాయకుడులో ఆకాశానికెత్తేసిన చంద్రబాబు.. అసలు రంగు వర్మ తీసిన సినిమాల్లో బయటపడుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు చలోక్తులు విసురుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ అంటూ హడావిడి సృష్టించిన బాలయ్య.. తన బావకు ఏదో మేలు చేద్దామని చేసిన ప్రయత్నం వృథా అయిందని ఆయన అభిమానులే పెదవి విరుస్తున్నారు.
చదవండి :
Comments
Please login to add a commentAdd a comment