ఏ జన్మలో అయినా శిశువుకు దొరికే ప్రథమ వరం ఏమిటంటే తల్లి ఒడి.ఎలా ఉంటుంది ఆ ఒడి.వెచ్చగా ఉంటుంది. నేనున్నానని దగ్గరగా ఉంటుంది. పక్కటెముకల చెంత పరుండబెట్టుకుని ధైర్యం ఇస్తుంది. గుండె లయను వినిపిస్తూ కలత పడవలసిన అవసరం లేదనే సంభాషణ చేస్తుంది. ఒడి– స్తన్యాన్ని దగ్గరగా ఉంచుంది. ఒడి– అమ్మను దగ్గరగా ఉంచుతుంది. ఒడి– నాకో అమ్ముంది అనే అతిశయాన్ని ఇస్తుంది.అది ఉన్నవాళ్లకు దాని విలువ తెలుసో లేదో.కాని లేని వాళ్లకు మాత్రం దాని విలువ కచ్చితంగా తెలుసు.
ఆ రోజు భోగి.అక్కర్లేనివన్నీ అగ్నిలో ఆహుతి చేస్తున్నారు. విసిరి పారేస్తున్నారు. పాతవాటిల్ని నమిలేస్తున్న మంట ఆ ప్రభాతాన ఎర్రగా నాలుకలు సాచి ఉంది. ఆ తల్లికి నొప్పులు. నొప్పులంటే ఏమిటో తెలియని వయసు. పదమూడో పద్నాలుగో. నెలలు నిండిపోయాయి. ఇల్లు వద్దనుకుంది. ఊరు వద్దనుకుంది. కడుపులో ఉన్న శిశువును వద్దనుకుంటే మళ్లీ దగ్గరకు తీసుకుంటుందేమో.
ఆ శిశువు ఆ తల్లికి అడ్డం.కాని శిశువు కదా. తన కడుపున పుట్టాడు కదా. ఎలా వదిలిపెట్టడం. తప్పదు. గూడ్స్ బండి ఏదో కదులుతుంటే పసుపుబట్టలో చుట్టి అందులో పడుకుకోబెట్టి మళ్లీ ఉండబట్టలేక దాని వెంట పరిగెట్టినా... కూ అని కూతపెడుతూ బిడ్డను మోసుకెళుతూ పసికందు రోదనను తనలో లీనం చేసుకుంటూ ఆ బండి వెళ్లిపోయింది.శిశువు దూరమైంది.కాని పాశం దూరం కాగలదా?
ఆ బిడ్డను ఎవరో చేరదీశారు. ఏ మురికి వాడలోనో ఆ మురికి జన్మ ఊపిరి పీల్చుకోగలిగింది. పెరిగి పెద్దదై యువకుడిగా మారగలిగింది. ఆ యువకుడి గుండెల్లో ఎప్పుడూ ఒకటే ప్రశ్న. అమ్మ నన్నెందుకు పారేసింది? ఆ చేయి స్పర్శ కావాలనిపిస్తుంది. ఆ చేయి శిరస్సు మీద పెట్టి నిమిరితే అనుభవించాలని ఉంటుంది. ఆ తల్లి ఒడిలో తలను పరుండబెట్టి సేదతీరాలని ఉంటుంది. ఏం... ఆ తల్లిని పట్టుకుని గట్టిగా ఏడవాలని ఉండదూ?సమాజంలో ఎప్పుడూ ఒక ప్రశ్న.మీ అమ్మ పేరేమిటి?తెలియదు.నాన్న పేరు?తెలియదు.అనుభవించినవారికే తెలుస్తుంది నెత్తుటి గాటు. ఉబికి ఉబికి పొంగే ఆశ్రువు. ఆ యువకుడికి అప్పుడు ఒక స్నేహితుడు దొరుకుతాడు. నేనున్నానంటాడు. గాలికి గమ్యం లేకుండా ఎగురుతున్న జెండా ముక్క ఒక గుంజెకు తగులుకుంటే ఎలా ఉంటుంది? అది అక్కడ రెపరెపలాడే వీలు దక్కించుకుంటే ఎలా ఉంటుంది? ఆ యువకుడికి ఆ స్నేహితుణ్ణి చూస్తే అలాగే అనిపించింది. ఇప్పుడు ఈ ప్రాణానికి అర్థముంది. అది ఇవ్వడానికి ఒక స్నేహితుడు దొరికాడు. అవును. ఈ జన్మ ఈ స్నేహితుని కోసమే.
అనాథ రజనీకాంత్, గ్యాంగ్‌స్టర్ మమ్ముట్టి ప్రాణానికి ప్రాణం అవుతారు. ఇద్దరూ పేదవాళ్లకు మిత్రులు. పేదల కష్టాలకు చట్టానికి ఆవల ఉన్న పరిష్కారాలను చేసి పెడుతుంటారు. ఆపదలో ఉన్నవాళ్లకు దేవుళ్లు. రజనీకాంత్ కులం ఏమిటి మతం ఏమిటి తల్లిదండ్రులు ఎవరు అనేది చూడకుండా మమ్ముట్టి అతణ్ణి గౌరవించాడు. తన దళపతిని చేసుకున్నాడు. తోడబుట్టినవాడనుకున్నాడు. అందుకు రజనీకాంత్‌కు మమ్ముట్టి అంటే కృతజ్ఞత. ప్రేమ. అర్పణం. కాని రజనీకాంత్ ప్రేమించిన అమ్మాయి రజనీకాంత్‌కు దక్కలేదు. తల్లిదండ్రీ లేనివాడికి పిల్లనివ్వను అని చెబుతాడు అమ్మాయి తండ్రి. భారతంలో కర్ణుని ఆత్మగౌరవానికి వీర పరీక్షలు ఎదురయ్యాయే తప్ప ఇలా సాంఘిక పరీక్షలు ఎదురు కాలేదు. పోలీసులు కేసులు పెట్టినప్పుడల్లా ‘నీ తల్లి పేరేమిటి... తండ్రి పేరేమిటి?’ అని అవమానిస్తూనే ఉంటారు. ఈ అన్ని సందర్భాల్లోనూ రజనీకాంత్‌కు దొరికే ఒక ఒక ఓదార్పు మమ్ముట్టి స్నేహమే. అందుకే ఊరిలోని పెద్దమనిషి వాణ్ణి వదిలేసి నా పక్షంలో చేరిపో అనంటే వెళ్లడు. ఉండిపోతాడు. ఆ పెద్దమనిషి ప్రమాదకారి. ఇది ప్రమాదం.
కురుక్షేత్రం కేవలం భౌతిక సవాళ్లనే విసరలేదు. మానసికమైన మల్లయుద్ధాన్ని కూడా ఆహ్వానించింది. మమ్ముట్టి, రజనీకాంత్‌లను నిరోధించడానికి వచ్చిన కలెక్టర్ అరవింద్ స్వామి వాళ్లను నిరోధించ ప్రయత్నించి వాళ్లిద్దరికీ విరోధి అవుతాడు. అతణ్ణి చంపేయాలి. కాని అతడు రజనీకాంత్‌కు తమ్ముడు. ఏ తల్లయితే తనను విసిరేసిందో ఆ తల్లి కడుపున పుట్టినవాడు. ఆ తల్లి ఈ సంగతి తెలుసుకుని తన పెద్దకొడుకు దగ్గరకు భిక్షకు వస్తుంది– కొడుకు ప్రాణాలు ఇమ్మని. తల్లినీ తమ్ముణ్ణి స్వీకరిస్తే స్నేహితుడికి ప్రమాదం. స్నేహితుడు కావాలనుకుంటే తమ్ముడి ప్రాణాలకు ప్రమాదం.అయినా సరే స్నేహితుడే ముఖ్యం అనుకుంటాడు రజనీకాంత్.రక్తబంధాలు అనాథ వదిలేసినప్పుడు స్నేహమే ఐశ్వర్యం ఇచ్చింది. ఆ సంగతి మర్చిపోడు రజనీకాంత్. స్నేహానికి అర్థం అదే కదా.
కురుక్షేత్రం వస్తుంది.ఊళ్లోని పెద్దమనిషి స్నేహితులిద్దరి మీదా దాడి చేయిస్తాడు.వాస్తవానికి కర్ణుడు చనిపోతే సుయోధనుడు బదులు తీర్చుకోవాలి.కాని మమ్ముట్టి చనిపోతే రజనీకాంత్ బదులు తీర్చుకుంటాడు. కొన్ని బంధాలు వీడ్కోలు తీసుకున్నప్పుడు కొత్త బంధాలు గుండెలకు హత్తుకుంటాయి. రజనీకాంత్ జీవితంలో ఇప్పుడు స్నేహితుడులేకపోవచ్చు. తల్లి ఉంది. పుట్టిన కొద్ది గంటల్లోపే దూరమైన ఆ శిశువు సుదీర్ఘమైన పరితాపం, వేదన తర్వాత తల్లి ఒడికి చేరి పొందిన ప్రశాంతతో కథ ముగుస్తుంది.లక్షలు, కోట్లు, మిద్దెలు, మేడల వేటలో మనిషి మర్చిపోతున్న వరం కూడా అదే– తల్లి ఒడి.
భారతం కథ
మణిరత్నం దర్శకత్వంలో 1991లో వచ్చిన ‘దళపతి’ ఆ కాలంలో విడుదలకు ముందు అతి పెద్ద సంచలనంగా మారింది. రజనీకాంత్, మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడం, మమ్ముట్టి కూడా ఉండటం వల్ల మల్టీస్టారర్ కావడం, ఇళయరాజా చేసిన పాటలు విడుదలకు ముందే పెద్ద హిట్ కావడం ఇవన్నీ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచాయి. ‘దళపతి’ టైటిల్ కూడా పెద్ద హంగామాను ఎక్స్‌పెక్ట్ చేసేలా చేసింది. కాని చివరకు ఇది ‘భారతం కథ’ అని తెలియడం కొంత ప్రేక్షకులను నిరాశ పరిచింది. నేరుగా విలన్ కథలో లేకపోవడం, హీరోయిజంను పెంచే కథనం లేకపోవడం కొంత లోటు. కాని భావోద్వేగాల కురుక్షేత్రాన్ని మాత్రం ఈ కథ బలంగా పట్టుకోగలిగింది. తల్లి కాదనుకున్న బిడ్డడి అంతర్మథనం రజనీకాంత్‌లో, తల్లిని పారేసిన తల్లి వేదన శ్రీవిద్యలో చాలా శక్తిమంతంగా దర్శకుడు చూపిస్తాడు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, తోట తరణి సెట్స్ పెద్ద పేరు తెచ్చాయి. ‘ఆడజన్మకు ఎన్ని సోకాలో’, ‘చిలకమ్మ చిటికేయంగా’, ‘యమునా తటిలో’... ఇవన్నీ పెద్ద హిట్స్. బాలు, ఏసుదాస్ కలిసి పాడిన ‘సింగారాల పైరుల్లోన’ ఇప్పటికీ ఆ గాయకుల మేలిమి కలయికకు ఒక నజరానాగా నిలిచింది. రజనీకాంత్‌ను అప్పటి సినిమాల ధోరణికి భిన్నంగా సహజంగా అందమైన హెయిర్‌స్టయిల్‌తో ఈ సినిమా చూపించింది. మణిరత్నం, ఇళయరాజా కలిసి పని చేసిన చివరి సినిమాగా, అరవింద్ స్వామి తొలి సినిమాగా ఇది గుర్తుండిపోతుంది.
– కె
Comments
Please login to add a commentAdd a comment