అదితిరావు హైదరి. ఈ పేరును చాలాసార్లు వినేవుంటారు. ఒక శుక్రవారం వచ్చి సూపర్‌హిట్ అయిన సినిమాలో అద్భుతంగా నటించిందని విని ఉంటారు. అదే రోజు సాయంత్రం టీవీలో వచ్చే ఏదో ప్రోగ్రామ్‌లో ‘ఓ.. చెలి తార..’ అంటూ ఒక పాట పాడుతూ కనిపిస్తే ఆ గొంతుకి ముగ్ధులైపోయి ఉంటారు. ఆ తర్వాత రోజో, ఇంకెప్పుడో యూట్యూబ్‌లో ఒక డ్యాన్స్ వీడియోలో ‘ఎంత అందంగా డ్యాన్స్ చేస్తోందో కదా!’ అని చూస్తూ ఉండిపోయి ఉంటారు. అన్నిసార్లూ కనిపించిన ఆ అందమైన ముఖం పేరు అదితి రావు హైదరి. టాలీవుడ్, బాలీవుడ్‌లో కొత్త సెన్సేషన్. మల్టీ టాలెంటెడ్ అదితి గురించి కొన్ని విషయాలు...
బాలీవుడ్ టు టాలీవుడ్...
బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అక్కడక్కడా మెరుస్తూ వచ్చిన అదితి కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పిన సినిమా ‘చెలియా’. ఇండియన్ సినిమా లెజెండరీ డైరెక్టర్స్‌లో ఒకరైన మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో అదితి, తన అందం, నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తాజాగా ‘సమ్మోహనం’ సినిమాతో పెద్ద హిట్ కొట్టి తన మార్క్ నటనతో ఆకట్టుకుంది. సమ్మోహనం తర్వాత అదితికి వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘నవాబ్’ సినిమాలోనూ అదితి కనిపించనుంది.
భరతనాట్యం చేసిందంటే... ఫిదా!
అదితిరావుకు చిన్నప్పట్నుంచే డ్యాన్స్ అంటే పిచ్చి. పదకొండేళ్లకే గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలని భరతనాట్యం డ్యాన్సర్‌గా తన కెరీర్ మొదలుపెట్టేసింది. కొన్ని సినిమాలకు పనిచేసింది. ఆ సమయంలోనే అదితికి యాడ్ ఫిల్మ్స్‌లో, ఫీచర్ ఫిల్మ్స్‌లో చిన్న చిన్న అవకాశాలు రావడం మొదలైంది. అవి పెద్ద పెద్ద అవకాశాలుగా మారాయి. 2010 తర్వాత ఏకంగా హీరోయిన్ అవకాశాలు రావడం మొదలైంది. ఆ తర్వాత ఆమె మెల్లిగా హీరోయిన్‌గా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వెళ్తోంది.
పాట ఇంకో ఎత్తు..
అదితి యాక్టింగ్, డ్యాన్స్ ఒక ఎల్తైతే ఆమె పాట ఇంకో ఎత్తు. అదితి తల్లి విద్యారావు పాపులర్ క్లాసికల్ సింగర్. ఆమె నుంచి నేర్చుకున్న విద్యే అదితిని సింగర్‌గానూ మార్చింది. తాను నటించిన సినిమాల్లోనే కొన్ని పాటలు పాడింది అదితి. కొన్ని స్టేజ్ షోలలో కూడా అదితి పాడిన పాటలకు యూట్యూబ్‌లో పెద్ద ఫాలోయింగ్ ఉంది.
హైదరాబాదీ!
అదితిరావు ఇటు తల్లి తరపు నుంచి, అటు తండ్రి తరపు నుంచీ రాయల్ ఫ్యామిలీ. తండ్రి ఎహ్‌సాన్ హైదరి. తల్లి విద్యారావు. ఇద్దరివీ రాయల్ ఫ్యామిలీస్. వేర్వేరు మతాలు. అదితిరావు మన హైద్రాబాద్‌లోనే పుట్టింది. తెలుగుంటి అమ్మాయే. చిన్న వయసులోనే అదితి తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. తల్లి విద్యారావుతో ఎక్కువగా ఢిల్లీలో పెరిగింది అదితి. తండ్రి పేరులోని హైదరి, తల్లి పేరులోని రావు రెండూ కలిసేలా తన పేరును ‘అదితిరావు హైదరి’గా మార్చుకుంది.
పర్సనల్ పర్సనల్..
31 ఏళ్ల అదితిరావు, ఇరవైల్లో ఉన్నప్పుడే టెలివిజన్ నటుడు సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయం గురించి మాట్లాడటానికి అదితి ఎప్పుడూ పెద్దగా ఇష్టపడలేదు. 2013లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సత్యదీప్ నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment