జాన్‌ హ్యాండ్సమ్‌ | special story to john abraham | Sakshi
Sakshi News home page

జాన్‌ హ్యాండ్సమ్‌

Published Thu, Dec 22 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM

జాన్‌ హ్యాండ్సమ్‌

జాన్‌ హ్యాండ్సమ్‌

జాన్‌ అబ్రహం రాత్రి తొమ్మిదింటికి నిద్రపోతాడు. ఉదయం నాలుగు Výæంటలకి లేచి ఎక్సర్‌సైజులు చేస్తాడు.
  జాన్‌కు తల్లి మీద అభిమానం ఎక్కువ. అనుక్షణం ఆమె తన వెంట ఉండాలని కోరుకుంటాడు.
జాన్‌ ప్రతి 2 గంటలకు ఒకసారి భోజనం చేస్తాడు. ‘మద్రాస్‌ కెఫె’ చిత్రం కోసం కేరళలో షూటింగ్‌లో ఉండగా బ్రేక్‌ఫాస్ట్‌లో 26 ఆప్పవ్‌ులు తినేసేవాడు. ఏ క్షణమైనా సరే రెండు కిలోల కాజూ బర్ఫీ ఒక్క దమ్మున తినేయగలడు.
  జాన్‌ అంటే సల్మాన్‌ఖాన్‌కు ఎందుకనో సదభిప్రాయం లేదు.
జాన్‌ ఆల్కహాల్‌ ముట్టడు. డ్రగ్స్‌ వాడడు. మాంసాహారం కూడా అప్పుడప్పుడే.
  జాన్‌ ‘పెటా’ సభ్యుడు. మూగజీవాలపై హింసను వ్యతిరేకిస్తాడు.

జాన్‌ అబ్రహం సెట్‌కు రాగానే సాధారణంగా ప్రతి డైరెక్టర్‌ అరిచే అరుపు– ‘జాన్‌... ముందు ఆ చొక్కా విప్పి పడేయ్‌’... ఎస్‌. జాన్‌ చొక్కా విప్పేయాలి. కండలు చూపించాలి. నలుగురిని చావబాదాలి. ప్యాకప్‌ చెప్పి వెళ్లిపోవాలి. ‘ఒరి వెధవా. నాక్కూడా బుర్రుందిరా. చదువుంది. జ్ఞానం ఉంది. విషయ పరిజ్ఞానం ఉంది. నన్నొక మనిషిగా చూడవా నువ్వూ.’

1991 మే 21న రాజీవ్‌గాంధీ హత్య జరిగింది. అందుకు కారకులెవరో తేల్చడానికి ఆ తర్వాత జస్టిస్‌ జైన్‌ ఆధ్వర్యంలో కమిషన్‌ నియుక్తమైంది. కమిషన్‌ విచారణ చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత 3000 పేజీల రిపోర్ట్‌ ఇచ్చింది. దానిని ఎంతమంది చదివారో లేదో కానీ జాన్‌ అబ్రహం చదివాడు. రాజీవ్‌ గాంధీ మరణం ఒక సాధారణ మరణం కాదు. దేశాన్ని మలుపు తిప్పిన మరణం. దీనిని వార్తా పత్రికలు విస్తృతంగా కవర్‌ చేశాయి. కాని పాపులర్‌ మీడియా అయిన సినిమాలో కూడా ఈ ఉదంతం రికార్డ్‌ చేయాలి. దీనిని సినిమాగా తీయాలి. జైన్‌ కమిషన్‌ ఆధారంగా జాన్‌ అబ్రహం ఈ సినిమా తీయాలనుకున్నాడు. తనే హీరోగా అంటే సినిమాలో విచారణ అధికారిగా నటించాలనుకున్నాడు. స్క్రిప్ట్‌ తయారైంది. స్టూడియోలకు ఎక్కే గడప దిగే గడపగా తిరగడం మొదలుపెట్టాడు. ‘ఇదేం స్క్రిప్ట్‌’ అని ఒకరు, ‘ఇందులో మసాలా ఏముంది’ అని ఒకరు, ‘ఇందులో నువ్వు చొక్కా విప్పవు కదా ఏం ఆడుతుంది’ అని ఇంకొకరు, ‘చివరలో నువ్వు చచ్చిపోతావా? అయితే వేస్ట్‌’ అని మరొకరు – ఇలా జాన్‌ను ఛీ కొట్టారు. జాన్‌ మాత్రం ఆ సినిమా తీయాలని పట్టుబట్టాడు. చివరకు తీశాడు. ‘మద్రాస్‌ కెఫే’. జాన్‌ను నిర్మాతగానే కాదు బుర్రున్న ఒక మనిషిగా, నటుడిగా కూడా ఈ సినిమా నిలబెట్టింది.
అరె.. జాన్‌ పుట్టింది కేవలం చొక్కా విప్పడానికి కాదా అని ఒకరిద్దరు పాత డైరెక్టర్లు ఆశ్చర్యపోయారు.

దీనికి ముందు కూడా జాన్‌కు బుర్ర ఉందని నిరూపితం అయ్యింది. ఒక కథ. ఏమిటంటే ఒక కుర్రాడు తన వీర్యాన్ని అమ్ముతూ ఉంటాడు. దాని వల్ల నిజ జీవితంలో సమాజ పరంగా ఎలాంటి ఆటంకాలు ఎదుర్కొన్నాడు అనేది చూపించాలి. దీనిని ఎవరు ప్రొడ్యూస్‌ చేస్తారు? అసలు వీర్యం అనే మాటను సినిమాలో ఎలా పలకడం. కాని జాన్‌ అబ్రహం ధైర్యం చేశాడు. తానే ప్రొడ్యూస్‌ చేస్తానని ముందుకు వచ్చాడు. సినిమా తయారైంది. పేరు– ‘విక్కీ డోనర్‌’. చిల్లర డబ్బుతో తీసిన ఆ సినిమా కోట్లు సంపాదించింది. ఇటీవల తెలుగులో ‘నరుడా డోనరుడా’ పేరుతో రీమేక్‌ కూడా అయ్యింది.

జాన్‌ మీద తండ్రి ప్రభావం ఎక్కువ ఉంది. ఆయన మలయాళీ. ముంబయ్‌లో ఆర్కిటెక్ట్‌గా చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. అక్కడే ఒక జొరాష్ట్రియన్‌ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. జాన్‌ పెద్ద కొడుకు. తల్లి అతడికి ఫర్హాన్‌ అనే పేరు పెట్టుకుంది. తండ్రి జాన్‌ అని పెట్టుకున్నాడు. చివరకు జాన్‌ అబ్రహంగా స్థిరపడింది. చిన్నప్పుడు జాన్‌ క్లాస్‌లో బుద్ధిగా చదువుకునేవాడు. చూట్టానికి బాగుండేవాడు. కాని కాలేజీ వయసుకు వచ్చేసరికి ముఖమంతా మొటిమలే. వాటిని వదిలించుకోలేక సిగ్గుపడేవాడు. అద్దం చూసుకోవడానికే భయం. కానీ తెర మీద ఎలా చూసుకోగలిగాడు?

ఒకసారి ఒక సినిమా వచ్చింది. హాలీవుడ్‌ సినిమా. అందులో హీరో యమాగా ఉన్నాడు. తీర్చిదిద్దిన కండలతో ఉన్నాడు. మనిషి కూడా గొప్ప అందగాడు. రాకెట్‌ లాంచర్‌ పేల్చాడంటే విలన్‌ డెన్‌ తుక్కు తుక్కు కావాల్సిందే. జాన్‌ కాలేజీ చదువుతుండగా ఆ సినిమా వచ్చింది. వెళ్లి థియేటర్‌లో చూశాడు. చూశాక ఏమనిపించిందంటే ఇప్పటికిప్పుడు ఆ హీరోలా తయారవ్వాలని. హాలు నుంచి బయటకు వస్తే అరటిపండ్ల బండి కనిపించింది. వెంటనే వెళ్లి ఒక డజను పండ్లు తినేశాడు. అరటి పండ్లు తింటే కండలొస్తాయి మరి. కండలు రాలేదు కాని మనసులో హీరో కావాలనే కోరిక మాత్రం పుట్టింది. ఆ తర్వాత నిజంగానే హీరో అయ్యాడు. అందుకు అతడు ఆ హాలీవుడ్‌ హీరోకు ఎప్పుడూ థ్యాంక్స్‌ చెబుతూ ఉంటాడు. అతడి పేరు – సిల్వర్‌స్టర్‌ స్టాలెన్‌.

జాన్‌ది తండ్రి పోలిక. చూడటానికి చక్కగా ఉంటాడు. ఫొటోలకు సరిపడినట్టుగా ఆ ముక్కు ఉంటుంది. ‘గ్లాడరాక్స్‌’ అనే మేగజీన్‌ ఏదో కుర్రాళ్ల పోటీ పెడితే అందులో జాన్‌ పాల్గొన్నాడు. ఫొటోలు బయటికొచ్చాయి. ఒక ఏజెన్సీ వాళ్లు చూసి ‘లెవీ జీన్స్‌’ కోసం పేపర్‌ యాడ్‌ చేయమంటే చేశాడు. పెద్ద హిట్‌. ఆ తర్వాత అలాంటివే చాలా యాడ్స్‌ వచ్చాయి. ఫ్యాషన్‌ షోస్‌... ర్యాంప్‌ వాక్స్‌. అయితే ఏ వృత్తిలో అయినా ఆ వృత్తికి సంబంధించిన చీకాకులు ఉంటాయి. ఒకసారి ఢిల్లీలో ర్యాంప్‌ వాక్‌ ఉందని కబురు చేశారు. మరో మోడల్‌ డినో మోరియాతో కలిసి వెళ్లాడు. ర్యాంప్‌ వాక్‌కు సిద్ధమయ్యాక తెలిసింది అదో అండర్‌ వేర్‌ కంపెనీకి సంబంధించిన వాక్‌ అనీ... అండర్‌ వేర్‌ ధరించి అందరి ముందు నడవాలనీ. సిగ్గుతో చచ్చి సున్నమయ్యాడు. అయితే అలా నడిచినా సరే... అతడు గ్రీకు శిల్పంలా ఉన్నాడని మార్కులు పడ్డాయి.

హాలీవుడ్‌లో ఆల్రెడీ ఒక కండల వీరుడు ఉన్నాడు.... సల్మాన్‌ ఖాన్‌. మరో యాక్షన్‌ హీరో ఉన్నాడు.... అక్షయ్‌ కుమార్‌. రొమాంటిక్‌ హీరోలు... షారుఖ్, ఆమిర్‌ ఉన్నారు. జాన్‌ లాంటి కొత్త హీరోలకు చోటు లేదు. కాని తను హీరో కావాలనుకున్నాడు. ఎలా?  ఇండస్ట్రీలో ఏ అండా లేని వారికి భట్‌ కుటుంబమే అండ. మహేశ్‌ భట్, అతని కుమార్తె పూజా భట్‌ కలిసి నిర్మిస్తున్న సినిమా– ‘జిస్మ్‌’ (2003)లో ఛాన్స్‌ వచ్చింది. ఆడవాళ్లంటే పడి చచ్చే ఒక తిరుగుబోతు పాత్ర అది. ఒక వివాహితతో సంబంధం పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకొనే పాత్ర. ఆ పాత్ర హిట్‌ అయ్యింది. అందులోని ‘జాదూ హై నషా హై’... పాట కూడా. అయితే ఆ వెంటనే వచ్చిన అవకాశాలు పెద్దగా లాభించలేదు. లాభం ఏదైనా ఉంటే అది బిపాషా బసూయే. ఆమె ‘జిస్మ్‌’ హీరోయిన్‌. అప్పుడే అయిన తాజా పరిచయం.

జాన్‌ అబ్రహంను, బిపాషా బసును ఇండస్ట్రీలో ‘సూపర్‌ కపుల్‌’ అని పిలిచేవారు. వారి అనుబంధం, ‘లివ్‌ ఇన్‌ రిలేషన్‌’ ఇవాళ ఉండి, రేపు పోయేది కాదు. దాదాపు 8 సంవత్సరాలు కొనసాగింది. ‘ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఇక మీదట కూడా కలిసే ఉంటాం. మేం విడిపోయే సమస్యే లేదు’ అని బిపాష ఒక సందర్భంలో అంది. కాని ఆమె నమ్మకం తప్పని తేలింది. 2011లో వాళ్లిద్దరూ విడిపోయారు. ఇండస్ట్రీలో పెద్ద గోల అయ్యింది. ఎందుకు ఎందుకు... అని అందరూ ఆరా తీశారు. కాని జాన్‌ అబ్రహం నోరు మెదపలేదు. తన జీవితంలో 8 ఏళ్ల పాటు కలిసి జీవించిన జీవితాన్ని ఇచ్చిన స్త్రీని గౌరవించాలని అతనికి తెలుసు. ఆమెకు వ్యతిరేకంగా ఒక్క కామెంట్‌ కూడా చేయలేదు. ఇప్పటికీ. ఎక్కడా. ఆమె కూడా సంయమనం పాటించింది. చాలా మర్యాదకరంగా వారిరువురూ విడిపోయారు. ఆ తర్వాత జాన్‌ ఫైనాన్స్‌ అనలిస్ట్‌ అయిన ప్రియా రుచల్‌ను (2014)లో, బిపాషా టీవీ నటుడైన కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ (2016)ను వివాహం చేసుకున్నారు. కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌కు ఇదివరకే రెండు సార్లు పెళ్లయ్యిందనేది కేవలం అదనపు సమాచారం.

జాన్‌ అబ్రహంకు బైక్‌ అంటే తెగ పిచ్చి. మన ఇళ్లల్లో బైక్స్‌ ఎప్పుడైనా గమనించారా? 100 సిసి, 125 సిసి ఇలా ఉంటాయి. జాన్‌ దగ్గర ఉన్న బైక్‌ కేవలం 1700 సిసి మాత్రమే. అలాంటి బైక్‌ తీసుకుని ఎవరినీ ఇబ్బంది పెట్టని సమయంలో రాత్రి పూట అతడు చక్కర్లు కొడుతూ ఉంటాడు. ఇలాంటి బైక్‌ పిచ్చే అతడికి యశ్‌చోప్రా ‘ధూమ్‌’లో అవకాశం ఇచ్చింది. ఆ సినిమా కలెక్షన్లలో దుమ్ము రేపింది. రాత్రికి రాత్రి జాన్‌ పెద్ద స్టార్‌ అయ్యాడు. ఆ తర్వాత ప్రియదర్శన్‌ దర్వకత్వంలో వచ్చిన ‘గరం మసాలా’ (2005), నానా పటేకర్‌తో నటించిన ‘టాక్సీ నంబర్‌ 9211’ (2006) జాన్‌ను బాలీవుడ్‌లో స్థిరమైన హీరోగా నిలబెట్టాయి. ఆ తర్వాత కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘దోస్తానా’ (2008) జాన్‌ను కథకు అనుగుణమైన పాత్రలు వేసే హీరో ఇమేజ్‌ వచ్చింది. దోస్తానాలో అభిషేక్‌ బచ్చన్, జాన్‌ అబ్రహమ్‌ తమ పొట్ట కూటి కోసం ‘గే’ అవతారాలెత్తి నవ్వులు పండిస్తారు. పురుషుల కండల పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగి కరణ్‌ జోహార్‌ ఈ సినిమాలో జాన్‌ను అరమరికలు లేకుండా చూపించి, అభిమానులకు కనువిందు చేయించాడు.

2016లో జాన్‌ అబ్రహంవి 3 సినిమాలు వచ్చాయి. ‘రాకీ హ్యాండ్సమ్‌’, ‘డిషూమ్‌’, ‘ఫోర్స్‌ టు’. మొదటిది ఒక మోస్తరుగా ఆడినా మిగిలిన రెండు పెద్ద హిట్టయ్యాయి. ఇంకా చాలా సినిమాలు చేతిలో ఉన్నాయి. హీరోగా, నిర్మాతగా, ఫుట్‌బాల్‌ టీమ్‌ యజమానిగా జాన్‌ చాలా పనుల్లో ఉన్నాడు. సినిమా అతడి జీవితంలో ఒక భాగం మాత్రమే. మనిషిగా బాధ్యత గల పౌరుడిగా ఉండటమే ముఖ్యమని అతడు భావిస్తాడు. జాన్‌ డిఫరెంట్‌. ఆ సంగతి కాలం గడిచే కొద్దీ అందరికీ అర్థమైంది. మిగిలిన హీరోల్లా అవార్డు ఫంక్షన్లకు వెళ్లడు. పార్టీలకు వెళ్లడు. డబ్బున్న వాళ్ల పెళ్లిళ్లకు వెళ్లి చిల్లర కోసం డాన్సులు చేయడు. పెద్దగా కాంట్రవర్సీల్లో ఇరుక్కోడు. తను.. తన పని.. అంతే.

ఒకప్పుడు జాన్‌ వచ్చిన వెంటనే డైరెక్టర్‌ ‘జాన్‌... చొక్కా విప్పెయ్‌’ అనేవాడు. ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్‌ వెండితెరకు కొత్త సంస్కారాన్ని కుట్టే పాత్ర కోసం జాన్‌ను ఎంచుకుంటున్నారు.జాన్‌– ఇప్పుడు ఒక రెస్పెక్టబుల్‌ హీరో.రెస్పెక్ట్‌ సంపాదించుకోవాలి. రెస్పెక్ట్‌ ఊరికనే మాత్రం రాదు. – సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement