
అనుపమ్ ఖేర్‌ను మన దేశంలో అందరూ గుర్తించడంలో గౌరవించడంలో వింత లేదు.కాని అమెరికాలో అతను ఇప్పుడు సామాన్యుల గౌరవాన్ని పొందుతున్నాడు. ఇటీవల అతడు అమెరికాలోని ఒక ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ క్లియరెన్స్ దగ్గర నిలబడ్డాడు. ఏదో ఈవెంట్‌కు హాజరవ్వాల్సి ఉండగా అతని దగ్గర అనుమతించిన లగేజీకి మించిన బరువుతో కొన్ని సూట్స్ ఉన్నాయి. వాటి బరువుకు తగ్గ చార్జ్ చెల్లించాల్సి వస్తుందేమోనని అనుపమ్‌ఖేర్ సందేహించాడు. కాని కౌంటర్‌లో ఉన్న ఒక ఆఫ్రికన్–అమెరికన్ అతణ్ణి చూసి చిన్న చిర్నవ్వుతో ‘మిస్టర్ కపూర్.. నాకు మీ యాక్టింగ్ అంటే ఇష్టం. పర్లేదు. మీరు వెళ్లొచ్చు’ అంది. అనుపమ్ ఖేర్ అమెరికాలో ‘మిస్టర్ కపూర్’గా మారడానికి అక్కడ గత సంవత్సరం ప్రసారమైన టెలివిజన్ షో ‘న్యూ ఆమ్‌స్టర్‌డామ్’ కారణం. అమెరికాలో పాఠకాదరణ పొందిన ‘ట్వల్వ్ పేషెంట్స్: లైఫ్ అండ్ డెత్ ఎట్ బెల్‌వ్యూ హాస్పిటల్’ అనే పుస్తకం ఆధారంగా ఈ టెలివిజన్ షో గత సంవత్సరం 16 ఎపిసోడ్లుగా ప్రసారం అయ్యింది. ఇది ఒక సీజన్‌కు మాత్రమే పరిమితమైన షో అనుకున్నారు. కాని ఇది ప్రసారం కావడమే పెద్ద హిట్ అయ్యింది. ఇండియన్ డాక్టర్‌గా నటించిన అనుపమ్‌ఖేర్‌ను అమెరికన్లు బాగా ఇష్టపడ్డారు. దాంతో ఇప్పుడు రెండో సీజన్ కోసం ఈ షో షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. అనుపమ్ ఖేర్ అక్కడే ఉదయం ఆరు గంటల కాల్షీట్ నుంచి పని చేస్తున్నారు.
‘నేను హిందీ నటుణ్ణి. నా బుర్ర హిందీలోనే ఆలోచిస్తుంది. ఇంగ్లిష్‌లో డైలాగులు చెప్పాలంటే ఎక్కువసార్లు వాటిని మననం చేసుకోవాల్సి వస్తోంది’ అన్నారు అనుపమ్ ఖేర్. దాదాపు అమెరికన్లు తెర మీద తెర వెనుక పని చేస్తున్న ఆ సెట్‌లో అనుపమ్‌తో హిందీలో మాట్లాడేది అతడి మేనేజర్ మాత్రమే. మిగిలినవారితో ఇంగ్లిష్‌లోనే సంభాషణలు సాగుతున్నారు. ‘ఇక్కడ బాగా పేరొచ్చింది. న్యూయార్క్‌లో నడుస్తుంటే దారిన పోతున్నవాళ్లు విష్ చేస్తున్నారు. అందుకే ఉత్సాహంగా షూటింగ్ కోసమని వచ్చాను. కాని నా ముంబై స్టుడియోల్లోని సందడి, అరుపులు, కేకలు మాత్రం మిస్సవుతున్నాను’ అన్నాడాయన. భారతదేశంలో ఇప్పుడు ఎలక్షన్ల హడావిడి నడుస్తోందని మనందరికీ తెలుసు. అనుపమ్ ఖేర్ బిజెపి మద్దతుదారు అని కూడా తెలుసు. అయితే ప్రత్యక్షంగా ఆయన ప్రచారంలో కనిపించే అవకాశాలు ఈ షూటింగ్ వల్ల ఉండవని అర్థమవుతోంది. అదీగాక తాను నేరుగా రాజకీయాల్లోకి రాదలచుకోలేదని ఆయన ఇదివరకే ప్రకటించాడు. ఆయన భార్య కిరణ్ ఖేర్ మాత్రం చండీగఢ్ నుంచి బిజెపి ఎం.పిగా ఐదేళ్లు పూర్తిచేసి మరోసారి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.
‘హోటల్ ముంబై’కి చిక్కులు
2008లో ముంబై తాజ్ హోటల్ మీద జరిగిన ముష్కర దాడి అందరికీ తెలుసు. ఆ ఉదంతం పై రామ్‌గోపాల్ వర్మ ‘ది అటాక్స్ ఆఫ్ 24/11’ అనే సినిమా తీశాడు. అయితే ఆ ఉదంతం జరిగినప్పుడు తాజ్ హోటల్‌లోని సిబ్బంది అందులో బస చేసిన వారి ప్రాణాలను ఎలా కాపాడారో వివరిస్తూ ఇంగ్లిష్‌లో ‘హోటల్ ముంబై’ సినిమా సిద్ధమైంది. ఇందులో అనుపమ్ ఖేర్ తాజ్ హోటల్ చీఫ్ చెఫ్‌గా నటించారు. సినిమాలో అది కీలకపాత్ర. కాని ఆ పాత్రను అందరూ చూసే వీలు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ సినిమా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో విడుదల కాగా తాజా న్యూజిలాండ్‌లో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో ఉగ్రవాదాన్ని చూపి భావోద్వేగాలను ప్రభావితం చేసే ఇటువంటి సినిమా అక్కర్లేదని భావించి అక్కడి ప్రభుత్వం దాని ప్రదర్శనను రద్దు చేసింది. మరోవైపు భారత్‌లో విడుదలకు నిర్మాతలకు, దుబాయ్‌లో ఉన్న ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థకు పేచీ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ సినిమా ప్రదర్శనను విరమించుకుంది. కనుక అనుపమ్ ఖేర్ ఎంతో బాగా నటించానని అనుకుంటున్న ఆ సినిమా ఇప్పుడిప్పుడే మనం చూసే అవకాశానికి వీలు కల్పించకుండా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment