చిన్న సినిమాల కోసం థియేటర్లు నిర్మించాలనుకుంటున్నాం...
‘‘దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలికి సంబంధించి చెన్నయ్‌లో ఓ ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలనేది ముప్పై ఏళ్ల నాటి కల. మొత్తానికి ఆ కల నెరవేరింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కృతజ్ఞతలు’’ అని దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు సి.కల్యాణ్ చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో పత్రికలవారితో సి. కల్యాణ్ మాట్లాడుతూ -‘‘2010లో దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలికి అధ్యక్షుణ్ని అయ్యాను. నిజానికి ఆ పదవీకాలం ఏడాది మాత్రమే. కానీ అయిదేళ్లుగా ఆ పదవిలోనే కొనసాగుతున్నా. నాలుగు సినీ పరిశ్రమలకు సంబంధించి త్వరలో ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయనున్నాం.
సభ్యుల కుటుంబాల సంక్షేమంతో పాటు, పిల్లల చదువుకూ అవకాశాలు కల్పిస్తాం. చిన్న సినిమాలు కూడా శాటిలైట్‌కి వెళ్లే విధంగా చర్యలు చేపడతాం. అయిదు రాష్ట్రాలకు సంబంధించిన సెకండ్ గ్రేడ్ పట్టణాల్లో 300 సీటింగ్‌తో థియేటర్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కేవలం చిన్న సినిమాల కోసమే ఈ థియేటర్లు’’ అని చెప్పారు. వృద్ధాశ్రమం ఏర్పాటుకు ఆర్థిక సహకారాన్ని అందిస్తామని నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి కొడాలి వెంకటేశ్వరరావు తెలిపారు.