రిజర్వేషన్లలో అక్రమాల కూత
Published Fri, Sep 27 2013 3:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
తిరువళ్లూరు, న్యూస్లైన్: దీపావళికి ముందస్తు రిజర్వేషన్తో పాటు సాధారణ ప్రయాణికులకు ఇచ్చే టికెట్లలోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్టు రైల్వే విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు గురువారం తిరువళ్లూరులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిరువళ్లూరు, అరక్కోణం తదితర రైల్వేస్టేషన్లలో దీపావళి పండుగ కోసం టికెట్ల రిజర్వు చేస్తున్నారు. రెండు నెలలుగా తిరువళ్లూరు నుంచి బెంగళూరు, హైదరాబాదు, కేరళ తదితర ప్రాంతాలకు రిజర్వేషన్లుచేస్తున్నారు. పండుగ దగ్గరపడడంతో ముందస్తు రిజర్వేషన్ల వేగం పుంజుకుంది. తిరువళ్లూరు నుంచి వేర్వేరు ప్రాంతాలకు జోరుగా రిజర్వేషన్లు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాల వలన రిజర్వేషన్లు రద్దు చేసుకున్న వారి స్థానంలో రైల్వే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా మరొకరికి రిజర్వేషన్ టికెట్లను విక్రయిస్తున్నట్టు సమాచారం అం దింది. దీంతో పాటు సాధారణ టికెట్ల విక్రయాలలోనూ అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ కందస్వామి, హనిచంద్రన్తో పాటు ఇతర అధికారులు గురువారం ఉదయం రైల్వేస్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే తిరువళ్లూరు నుంచి ఆరక్కోణం వైపు వెళ్తున్న ప్రయాణికుల వద్ద నకిలీ టికెట్లను అధికారులు గుర్తించారు. వీటిని పరిశీలించగా నకిలీ నంబర్లని తేలింది. అంతేగాక టికెట్లను చేతితో రాసి ఇచ్చినట్టు తెలుసుకున్నారు. అనంతరం అధికారులు దాదాపు రెండు గంటల పాటు కౌంటర్ లోని ఉద్యోగులను విచారించారు. ఈ విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అయితే వాటిని మీడియాకు వివరించడానికి అధికారులు నిరాకరించారు.
Advertisement
Advertisement