‘స్పెక్టర్’లో 35 తప్పులున్నాయ్!
సినిమాల్లో తప్పులు దొర్లడం సహ జమే. విజయం సాధిస్తే ఆ తప్పులన్నీ మూలపడిపోతాయి. అయితే అనుకున్నంత బాగాలేకపోతే మాత్రం ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకూ అందరూ అణువణువూ శోధించి అందులో తప్పులు కనిపెట్టేస్తారు. ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న జేమ్స్ బాండ్ సినిమాలకు ఈ పరిస్థితి వేరుగా ఉంటుంది. అవి హిట్టయినా.. ఫ్లాపయినా పోస్ట్‌మార్టమ్ మాత్రం తప్పదు. గతంలో విడుదలైన ‘స్కెఫాల్’ చిత్రంలో 68 తప్పులున్నాయని తీర్పునిచ్చిన అభిమానులు, ఈ సారి ‘స్పెక్టర్’ను కూడా భూతద్దం పెట్టి మరీ వెతికేసి 35 తప్పులు ఉన్నాయని తేల్చేశారు. అందులో మచ్చుకు కొన్ని...
హీరో, హీరోయిన్ ఉన్న కార్‌ను ఓ విమానం చేజ్ చేసే సీన్ ఉంటుంది. చాలా వేగంగా వచ్చి కార్‌ను ఢీ కొట్టగానే దాని ల్యాండింగ్ గేర్‌లో ఉన్న రెండు చక్రాల్లో ఒకటి ఊడిపోతుంది. కట్ చేస్తే...అది ల్యాండ్ అయ్యే టైమ్‌కు మాత్రం రెండు చక్రాలు సరిగ్గానే ఉన్నట్టు చూపించారు.
బాండ్ పాత్రధారి డేనియల్ క్రెగ్, కథానాయిక లీ సెడూ ఓ ట్రైన్‌లోని డైనింగ్ కార్‌లో తింటుంటారు. ఆ సీన్‌లో వాళ్ల చుట్టూ చాలా మంది ప్రయాణికులు ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో సడన్‌గా వాళ్ల మీద విలన్ పాత్రధారి డేవ్ బాటిస్టా దాడి చేస్తాడు. అప్పుడెవరూ కనబడరు. ఉన్నట్టుండి చుట్టూ ఉన్న ప్రయాణికులు, కిచెన్ స్టాఫ్ ఏమైపోయారో?
ఇలా ఎన్ని తప్పులున్నా కూడా ‘బాండ్’ఇమేజ్ ఈ సినిమాను కాపాడేసింది.
2,200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 3,300 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ నుంచి కొల్లగొట్టింది ఆ బ్రాండ్ ఇమేజ్‌తోనే.