
శ్రీవాస్ దర్శకత్వంలో 99వ సినిమా...?
చకచకా నూరో సినిమా వైపు అడుగులేస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన 98వ చిత్రం నిర్మాణ దశలో ఉంది. సత్యదేవాను దర్శకునిగా పరిచయం చేస్తూ బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి ‘లయన్’ అనే టైటిల్ విస్తృత ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇదే వేడిలో తన 99వ చిత్రానికి కూడా రంగం సిద్ధం చేసేశారు బాలయ్య. ఇటీవల ‘లౌక్యం’ చిత్రంతో విజయాన్ని అందుకున్న శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నిజానికి తన తొలి చిత్రం ‘లక్ష్యం’ తర్వాతే శ్రీవాస్, బాలకృష్ణతో సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇటీవలే ‘లౌక్యం’ సినిమా చూసి మెచ్చుకొన్న బాలకృష్ణ, శ్రీవాస్‌తో సినిమా చేయాలని భావించారు. ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపీమోహన్‌లు ఈ కొత్త ప్రాజెక్ట్‌కు స్క్రిప్టు సమకూర్చే పనిలో ఉన్నారు. వీళ్లిద్దరూ బాలకృష్ణ చిత్రానికి పనిచేయడం ఇదే ప్రథమం. బాలకృష్ణతో ‘ఆదిత్య 369, వంశానికొక్కడు, భలేవా డివి బాసు, మిత్రుడు’ చిత్రాలు నిర్మించిన సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని వినికిడి. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని ఫిలిమ్‌నగర్ సమాచారం. పూర్తి వివరాలు అధికారికంగా త్వరలోనే తెలుస్తాయి.