మీకెలాంటి మగాడంటే ఇష్టం? అని ఏ కథానాయికను అడిగినా...
మీకెలాంటి మగాడంటే ఇష్టం? అని ఏ కథానాయికను అడిగినా... ‘అతను చాలా మంచివాడు అయ్యుండాలి’ అని కామన్‌గా సమాధానం చెబుతుంటారు. శ్రుతీహాసన్ కూడా అలానే చెప్పారు. దాంతో పాటు తనకు ఎలాంటి మగాళ్లంటే ఇష్టం? ఎదుటి వ్యక్తి తన గురించి ఏమనుకుంటున్నాడో ఎలా తెలుసుకుంటాను? అనే విషయాల గురించి ఈ చెన్నై సుందరి చెబుతూ - ‘‘బేసిక్‌గా నేను మంచి వ్యక్తినే పెళ్లాడాలనుకుంటా. అఫ్‌కోర్స్ ఎవరైనా అలానే అనుకుంటారనుకోండి.
ఆ సంగతి అలా ఉంచితే... అతనికి కొంచెమైనా సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. అతను రాక్‌స్టార్ కాకపోయినా ఫరవాలేదు. ముందు మంచి మనసు ముఖ్యం. అది ఉంటే... ఆ తర్వాత మనకు కావాల్సిన లక్షణాలు అతనిలో ఉండేలా చేయొచ్చు. ఒక మగాడు నా గురించి ఏమనుకుంటున్నాడో అతను నన్ను చూసే విధానాన్ని బట్టి అంచనా వేసేస్తాను. అందుకే ముందు అతని కళ్లను చూస్తాను. ఆ తర్వాత అతని చేతి గోళ్లను కూడా చూస్తాను. మగాళ్లు గోళ్లు కొరుక్కోకూడదని నా బలమైన నమ్మకం. ఎందుకు కొరుక్కోకూడదో నేను చెప్పలేను. కళ్లు, గోళ్లూ చూశాక టోటల్‌గా అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో గమనిస్తాను. పద్ధతి గల మనుషుల బాడీ లాంగ్వేజ్ కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. సో... ఏ వ్యక్తి గురించి అయినా ఓ నిర్ణయానికి రావడానికి అతని బాడీ లాంగ్వేజ్ కూడా ఓ కారణ మవుతుంది’’ అన్నారు.