నాన్న ఒక లెజెండ్
నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తరువాతే మీతో నటించగలననే నమ్మకం కలుగుతుందని నాన్నతో చెప్పాను. ఆయన నా భావాన్ని అర్థం చేసుకున్నారు అని పేర్కొన్నారు విశ్వనటుడు కమలహాసన్ వారసురాలు, నేటి క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్. భారతీయ సినిమాలోనే తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నటి శ్రుతిహాసన్. తమిళం, తెలుగు, హిందీ అంటూ బిజీగా నటిస్తున్న ఈ బ్యూటీ తన తండ్రితో కలిసి నటించాలన్న తన కలను త్వరలో నెరవేర్చుకోనున్నారు. ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన ఎస్-3, ప్రేమమ్ చిత్ర తెలుగు రీమేక్‌తో పాటు హిందీలో రాఖీ హ్యాండ్సం, యారా చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో రాఖీ హ్యాండ్సం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సందర్భంగా శ్రుతిహాసన్‌తో చిన్న భేటీ.
ప్ర: నటుడు సూర్యతో రెండో సారి నటించడం గురించి?
జ: చాలా సంతోషంగా ఉంది. సూర్య చిత్రం ద్వారానే నేను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాను. నేనీ స్థాయిలో ఉండడానికి ఆ చిత్రం ఒక కారణం. ఇక ఎస్-3 చిత్రం వివరాలను ప్రస్తుతానికి చెప్పలేను. ఈ చిత్ర దర్శకుడు హరి దర్శకత్వంలో ఇంతకు ముందు పూజై చిత్రంలో నటించాను. మళ్లీ ఆయన దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది.ఆయన వర్కింగ్ స్టైల్ నచ్చుతుంది.
ప్ర: మీలో మంచి సంగీత దర్శకురాలు ఉన్నారు.అయినా నటనకు,పాటలకు పరిమితం అయిపోయారే?
జ: నేను మళ్లీ చెబుతున్నాను.సంగీతానికి దూరం కాను. అది ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఈ ఏడాదే నేనొక శపథం చేసుకున్నాను. సంగీతం పై అధిక దృష్టి సారించాలన్నదే అది. సంగీతంలో దిగితే దానికి అధిక సమయం కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు అంత సమయం లేదు. అయినా సంగీతంపై గమనం సారించాలని నిర్ణయించుకున్నాను.
ప్ర: త్వరలో మీ తండ్రి కమలహాసన్‌తో నటించే కల నెరవేరబోతుండడం గురించి?
జ: అవును. ఇంకా చెప్పాలంటే నా తొలి చిత్రం నుంచే నాన్నతో నటించడం గురించి చాలా ప్రచారం జరిగింది. అలాంటి ఆశ నాకూ ఉంది. అలాంటిది నాన్నతో ఒకే ఒక్క విషయం చెప్పాను.నాకంటూ పేరు సంపాదించుకున్న తరువాతే మీతో కలసి నటించగలననే నమ్మకం కలుగుతుంది అన్నాను. నా భావనను నాన్న అర్థం చేసుకున్నారు.అందుకు కావలసిన సమయాన్ని ఇచ్చారు.ఆ మధ్య నాన్నతో కలిసి నటించే అవకాశం వచ్చినా,అప్పుడు ఇద్దరం బిజీగా ఉన్నాం. మళ్లీ అలాంటి అవకాశం ఇప్పటికి వచ్చింది. మేమిద్దరం కలిసి నటించనున్న చిత్రం ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. నాన్న ఒక లెజెండ్. ఆయనతో నటిస్తున్నప్పుడు చాలా నేర్చుకోగలననే నమ్మకం నాకుంది.ఆ షూటింగ్ రోజుల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను.
ప్ర: మీ తండ్రి నటనలో కింగ్. మీరేమో కమర్షియల్ చిత్రాలపై మాత్రమే దృష్టి పెడుతున్నారు.దీనిపై మీ స్పందన?
జ: కమర్షియల్ చిత్రాల గురించి మీ అభిప్రాయం ఏమిటో తెలియదు గానీ, ఇలాంటి చిత్రాలకు మంచి నటన అవసరం అవుతుంది.నా వరకూ చిన్న పాత్ర అయినా దానికి పూర్తి న్యాయం చేయడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తాను.