Kamala Haasan
-
వెబ్ ప్రపంచంలోకి ఐశ్వర్య లక్ష్మి
బహుభాషా కథానాయకిగా రాణిస్తున్న మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి. ఈమె నిర్మాత కూడా. మలయాళంలో పలు సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించారు. ఇకపోతే తమిళంలో జగమే తంతిరం, యాక్షన్, కట్టాకుస్తీ, పొన్నియిన్ సెల్వన్ తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్,థ్రిల్లర్ థగ్ లైఫ్ చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటిస్తున్న ఐశ్వర్య లక్ష్మి తాజాగా వెబ్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారని తెలిసింది. యాలీ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న తమిళ వెబ్‌సిరీస్‌లో నటి ఐశ్వర్యలక్ష్మి ప్రధాన పాత్రను పోషించనున్నట్లు తెలిసింది. నవ దర్శకుడు పరిచయం అవుతున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా చాలా మంది ప్రముఖ నటీమణులు ఇప్పుడు వెబ్ సిరీస్‌లో నటించడానికి ఆసక్తి చూసుతున్నారు. ఆ కోవలో నటి ఐశ్వర్యలక్ష్మి కూడా చేరుతున్నారన్నమాట. -
విజయ్ చిత్రంలో కమలహాసన్?
లోకనాయకుడు కమలహాసన్ దళపతి విజయ్ కథానాయకుడు నటించనున్న చిత్రంలో అతిథి పాత్రలో మెరువనున్నారనే వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. విజయ్ కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం గోట్. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకొని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో విజయ్ తన 69వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇదే ఈయన చివరి చిత్రం అనే ప్రచారం చాలా రోజుల నుంచే జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారిస్తారని సమాచారం. ఇకపోతే ఆయన 69వ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఇది పూర్తిగా రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని కూడా ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏంటంటే ఈ చిత్రను కథను దర్శకుడు హెచ్ వినోద్ నటుడు కమలహాసన్ కోసం తయారు చేశారని సమాచారం. నిజం చెప్పాలంటే కమలహాసన్ హెచ్ వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేశారు. ఆ చిత్ర కథా చర్చల్లోనూ ఆయన దర్శకుడు హెచ్ వినోద్‌తో కలిసి పాల్గొన్నారు. అనివార్య కారణాలవల్ల ఆ చిత్రం తెరకెక్కలేదు. ఆ తర్వాత దర్శకుడు హెచ్ వినోద్ విజయ్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. అయితే కమలహాసన్ నటించాల్సిన కథనే ఆయన విజయ్‌తో చేస్తున్నారా? అన్న విషయంపై క్లారిటీ లేదు. తాజాగా విజయ్ కథానాయకుడుగా నటించే చిత్రంలో నటుడు కమలహాసన్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరలవుతోంది. ఇందులో నిజం ఎంత అన్నది కూడా తెలియాల్సి ఉంది. -
కామెడీ కథా పాత్రల్లో నటించాలని ఉంది
నటి సాయిపల్లవి ఈ పేరు నటనకు, డాన్స్‌కు చిరునామా అని పేర్కొనవచ్చు. మలయాళంలో ప్రేమమ్ అనే చిత్రంలో టీజర్‌గా నటించి అందరి ప్రశంసలు అందుకున్న అచ్చ తమిళ నటి సాయి పల్లవి. ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో కథానాయకిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈమె వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోకుండా, పాత్ర నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం తమిళంలో కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలింస్ పతాకంపై శివకార్తికేయన్ హీరోగా నిర్మిస్తున్న అమరన్ చిత్రంలో నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అలాగే తెలుగులో నాగచైతన్య సరసన ఒక చిత్రం చేస్తున్న సాయిపల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ రామయణం చిత్రంలో సీతగా నటిస్తున్నారు. కాగా ఇటీవల ఒక భేటీలో సాయి పల్లవి మాట్లాడుతూ తాను ఇప్పటి వరకూ వివిధ భాషల్లో రకరకాల పాత్రలు పోషించానన్నారు. ముఖ్యంగా తెలుగులో ఫిదా, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం వంటి చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించానని చెప్పారు. అయితే వాటన్నింటి కంటే విభిన్నమైన కామెడీ కథా పాత్రలో నటించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాంటి చిత్రంలో అవకాశం వస్తే భాషా బేధం లేకుండా నటించడానికి రెడీ అని నటి సాయిపల్లవి పేర్కొన్నారు. -
ఆయన నుంచి చాలా నేర్చుకున్నా!
దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు, తమిళ, భాషల్లో అగ్ర కథానాయకిగా రాణించిన నటి రకుల్ ప్రీత్ సింగ్. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ అమ్మడికి అవకాశాలు బాగా తగ్గాయి. అయితే హిందీలో మాత్రం ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇకపోతే నటన కంటే గ్లామర్‌కే అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన రకుల్‌ప్రీత్‌సింగ్‌కు గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం విశేషమే. నటుడు కమలహాసన్ కథానాయకుడిగా నటించిన ఇండియన్– 2 చిత్రంలో నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఒక నాయకిగా నటించారు. ఇందులో ఆమె నటుడు సిద్ధార్్థకు జంటగా నటించినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం జూలై 12వ తేదీన భారీ అంచనాల మధ్య తెరపైకి రానుంది. ఇటీవల విడుదలైన చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఇందులో నటించిన నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఒక భేటీలో పేర్కొంటూ ఇండియన్–2 చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర దర్శకుడు శంకర్ నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. గ్రేట్ దర్శకుడైన ఆయనతో కలిసి పని చేయడమే ప్రత్యేక రాయితీగా భావిస్తున్నాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన అద్భుతమైన దర్శకుడని, కథాపాత్రలను ఆయన చూసే విధానం, ఆయన ఆలోచనా విధానం, షూటింగ్ స్పాట్లో ఆయన సృజనాత్మకత ఇలా చాలా విషయాలను తాను నేర్చుకున్నానని చెప్పారు. ఇండియన్–2 చిత్ర షూటింగ్ తనకు నిజంగా మరచిపోలేని అనుభవాన్ని అందించిందని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొన్నారు. కాగా అవకాశాలు తగ్గడంతో ఈమె ఇప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా దాన్ని ఉపయెగించుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో తరచూ విడుదల చేస్తూ ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య శివకార్తికేయన్ సరసన నటించిన అయలాన్ చిత్రం హిట్ అయినా, రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదన్నది గమనార్హం. ఇంకా చెప్పాలంటే పెళ్లి అయిన తరువాత ఈమె కెరీర్ చాలా కుంటుపడిందనే ప్రచారం జరుగుతోంది. -
కమల్‌హాసన్ 'థగ్ లైఫ్'.. ఆ హీరోను రిప్లేస్ చేశారు!
మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న భారీ చిత్రం 'థగ్ లైఫ్'. నాయగన్(1987) సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష, శింబు, ఐశ్వర్యా లక్ష్మి, జోజూ జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్‌లో కోలీవుడ్ హీరో శింబు జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్.కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి, గన్‌తో ఎవరిపైనో గురి పెట్టి శింబు కాల్చుతున్నట్లుగా ఈ వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. కమల్‌హాసన్, శింబులతో పాటు ప్రముఖ నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఢిల్లీ షూటింగ్ షెడ్యూల్ పూర్తవగానే ‘థగ్ లైఫ్’ టీమ్ లండన్ వెళుతుందని కోలీవుడ్ సమాచారం. రెడ్ జెయింట్ మూవీస్, మద్రాస్ టాకీస్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘థగ్ లైఫ్’ సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారని.. ఈ ప్లేస్లోనే శింబును ఎంపిక చేశారని టాక్. అలాగే జయం రవి కూడా ఈ చిత్రం నుంచి తప్పుకోగా.. ఆ పాత్రను అశోక్ సెల్వన్ చేస్తారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. -
కూతురికి కమల్ సర్ప్రైజ్
సమయానుకూలంగా మారిపోయే నటుడు కమలహాసన్. ఈయనలో గొప్పనటుడితో పాటు రాజకీయనాయకుడు ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. అంతకుమించి గొప్ప తాత్వికుడు, ప్రేమికుడు ఉన్నారు. ప్రేమకు నిర్వచనాలు చాలానే ఉన్నాయి. అది ఎవరితోనైనా ఎప్పుడైనా పంచుకోగలిగినవారే పరిపూర్ణ మనిషి అవుతారు. కమలహాసన్ పెద్దల్లో పెద్దగా చిన్నవాళ్లలో చిన్నవాడిగా మారిపోతుంటారు. అందుకు చిన్న ఉదాహరణ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరులవుతున్న వీడియో. పులి కడుపున పులిపిల్లే పుడుతుంది అనడానికి ఒక ఉదాహరణ శ్రుతిహాసన్. తండ్రి వారసురాలుగా సినీ రంగప్రవేశం చేసిన శ్రుతిహాసన్ ఇక్కడ తనను నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలుగా పలు కోణాల్లో ఆవిష్కరించుకున్నారు. తన తండ్రి అన్నా, ఆయన చిత్రాలు అన్నా ఇష్టపడే శ్రుతిహాసన్ తాజాగా కమలహాసన్ నాలుగు దశాబ్దాల క్రితం కథానాయకుడిగా నటించిన విక్రమ్ చిత్రంలో ఇళయరాజా సంగీతాన్ని అఃదించీన విక్రమ్ విక్రమ్ అనే థీమ్ సాంగ్‌ను ఎంతో తన్మయత్వంతో ఆస్వాదిస్తూ రిథమిక్‌గా హావభావాలను పలికిస్తూ ఉండగా హఠాత్తుగా చివరలో కమలహాసన్ ఎంట్రీ ఇచ్చి చిరు దరహాసంతో హాయ్ చెప్పి ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇది ఆ తండ్రి కూతురు మధ్య ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది. కమలహాసన్‌లో గొప్ప నటుడు లేక రాజకీయనాయకుడు కాకుండా ఒక కూతురిని ప్రేమించే తండ్రి మాత్రమే కనిపించడం విశేషం. -
కమల్ పార్టీలో చేరిన వినోదిని
నటుడు కమలహాసన్ నటుడిగా, నిర్మాతగా బిజీగా ఉంటూనే తన మక్కళ్ నీది మయ్యం పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి జనాల్లోకి వెళ్లిన కమలహాసన్ మరో ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగా పలువురిని పార్టీలో చేర్చుకుంటున్నారు. అలా నటి వినోదిని తాజాగా మక్కళ్ నీది మయ్యం పార్టీలో చేరారు. ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రంతో నటిగా పరిచయమైన ఈమె ఆ తరువాత జిగర్తండా, ఓకే కణ్మణి చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించి గుర్తింపు పొందారు. ఇటీవల విడుదలైన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటి ఐశ్వర్యరాయ్ స్నేహితురాలిగా నటించారు. కాగా ఈమె తరచూ సినీ, రాజకీయాల గురించి మాట్లాడుతూ విడుదల చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. తాజాగా మక్కళ్ నీది మయ్యం పార్టీలో చేరినట్లు తెలుపుతూ, ఆ పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌తో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. -
ఖద్దర్ వ్యాపారంలోకి కమల్
నటుడు కమలహాసన్‌కి ఇప్పటికే సకల కళా వల్లభుడు అనే పేరు ఉంది. నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన కమలహాసన్ 2008లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మక్కల్ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీలు ప్రారంభించి గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన అభ్యర్థులు గెలవకపోయినా మంచి ఓట్ల శాతాన్ని రాబట్టుకున్నారు. అదేవిధంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుపలికి తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా తాజాగా కమలహాసన్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన ఎప్పటి నుంచో ఖద్దరు వస్త్రాలకు, చేనేత కార్మికుల మద్దతు తెలుపుతూ వస్తున్నారు. గత ఏడాది హౌస్ ఆఫ్ ఖద్దర్ అనే వ్యాపార సంస్థను కూడా ఏర్పాటు చేశారు. గాంధీజీ సిద్ధాంతాలను అవలంభించేలా ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు కమలహాసన్ పేర్కొన్నారు. కాగా ఈ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు ఖద్దర్ వస్త్రాల నిపుణులను తీసుకొని ఆయన ఇటలీకి వెళ్లినట్లు మంగళవారం ఆ పార్టీ నాయకుడు వెల్లడించారు. -
పద.. చూస్కుందాం.. 'విక్రమ్'ను వదిలిన రామ్ చరణ్..
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించిన చిత్రం 'విక్రమ్'. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించారు. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం (మే 20) విక్రమ్ తెలుగు ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఇందులో మొదటిసారిగా కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించారు. వీరేకాకుండా స్టార్ హీరో సూర్య కూడా 'విక్రమ్'లో అతిథి పాత్రలో అలరించనున్నాడు. 2 నిమిషాల 38 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్లో కమల్, విజయ్, ఫాహద్ ఫాజిల్ ఎవరికీ వారి ప్రత్యేక నటనతో అదరగొట్టారు. వీరి ముగ్గురి లుక్స్, యాక్టింగ్ కన్నుల పండుగగా ఉంది. ప్రతి ఒక్క సీన్ అద్భుతంగా యాక్షన్‌తో నిండిపోయింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. ఖైదీ, మాస్టర్ సినిమాల డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించడం, ముగ్గురు విలక్షణ నటులతోపాటు సూర్య అతిథి పాత్రలో నటించడంతో ఇదివరకే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే ఆ అంచనాలు మరింత పెరిగేలా ఉన్నాయి. మే 15న ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. Glad to release the Action packed #Vikram Telugu trailer#VikramHitlisthttps://t.co/3EFvSmFSmt My heartfelt wishes to @ikamalhaasan sir, @Dir_Lokesh @VijaySethuOffl #FahadhFaasil @anirudhofficial @RKFI & Team! Good luck to @actor_nithiin @SreshthMovies for the Telugu release pic.twitter.com/M2RDYwodID — Ram Charan (@AlwaysRamCharan) May 20, 2022 చదవండి: హిందీ భాషపై కమల్‌హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు -
కెమేరాకి నచ్చితే ప్రేక్షకులకూ నచ్చుతాం
ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో చదివే వ్యక్తులను మెంటలిస్ట్ అంటారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా మెంటలిస్టేనేమో! ఎందుకంటే, ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా మనసులో ఏముందో రజనీ తెలుసుకున్నారు. స్వయంగా రజనీయే ఈ సంగతి వెల్లడించారు. చెన్నైలో భారతీరాజా నెలకొల్పిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవానికి అతిథులుగా హాజరయ్యారు రజనీకాంత్, కమలహాసన్. ఈ వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘నటుడిగా నన్ను ప్రజలు ఎలా అంగీకరిస్తున్నారు? అని భారతీరాజా మనసులో అనుకుంటుంటారు. నేను ఆయన మనస్సును చదవగలను. గతంలో కొంతమంది విలేకరులు ‘రజనీ గురించి మీ అభిప్రాయం ఏంటి?’ అని భారతీరాజాను అడగ్గా... ‘మంచి వ్యక్తి’ అని చెప్పారు. అంతే కానీ.. ‘అతను మంచి నటుడు’ అని ఆయన ఎప్పటికీ అంగీకరించరు. ‘కళ్లుక్కుల్ ఈరమ్’లో నటించిన నన్నే ప్రేక్షకులు నటుడిగా గుర్తించలేదు.. నిన్నెలా అంగీకరించారు’ అన్నట్లుగా ఆయన నన్ను చూస్తుంటారు. భారతీరాజా అంటే నాకూ.. నేనంటే ఆయనకూ ఎంతో ఇష్టం. నటులు కెమేరాకి నచ్చితే ప్రేక్షకులకూ నచ్చుతారు. అభిమానులకు ఏ హీరో నచ్చుతాడో ఎవరూ చెప్పలేం. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నదానికంటే దర్శకుడు కె. బాలచందర్ దగ్గరే ఎక్కువ నేర్చుకున్నాను’’ అన్నారు. -
నాన్న ఒక లెజెండ్
నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తరువాతే మీతో నటించగలననే నమ్మకం కలుగుతుందని నాన్నతో చెప్పాను. ఆయన నా భావాన్ని అర్థం చేసుకున్నారు అని పేర్కొన్నారు విశ్వనటుడు కమలహాసన్ వారసురాలు, నేటి క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్. భారతీయ సినిమాలోనే తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నటి శ్రుతిహాసన్. తమిళం, తెలుగు, హిందీ అంటూ బిజీగా నటిస్తున్న ఈ బ్యూటీ తన తండ్రితో కలిసి నటించాలన్న తన కలను త్వరలో నెరవేర్చుకోనున్నారు. ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన ఎస్-3, ప్రేమమ్ చిత్ర తెలుగు రీమేక్‌తో పాటు హిందీలో రాఖీ హ్యాండ్సం, యారా చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో రాఖీ హ్యాండ్సం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సందర్భంగా శ్రుతిహాసన్‌తో చిన్న భేటీ. ప్ర: నటుడు సూర్యతో రెండో సారి నటించడం గురించి? జ: చాలా సంతోషంగా ఉంది. సూర్య చిత్రం ద్వారానే నేను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాను. నేనీ స్థాయిలో ఉండడానికి ఆ చిత్రం ఒక కారణం. ఇక ఎస్-3 చిత్రం వివరాలను ప్రస్తుతానికి చెప్పలేను. ఈ చిత్ర దర్శకుడు హరి దర్శకత్వంలో ఇంతకు ముందు పూజై చిత్రంలో నటించాను. మళ్లీ ఆయన దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది.ఆయన వర్కింగ్ స్టైల్ నచ్చుతుంది. ప్ర: మీలో మంచి సంగీత దర్శకురాలు ఉన్నారు.అయినా నటనకు,పాటలకు పరిమితం అయిపోయారే? జ: నేను మళ్లీ చెబుతున్నాను.సంగీతానికి దూరం కాను. అది ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఈ ఏడాదే నేనొక శపథం చేసుకున్నాను. సంగీతం పై అధిక దృష్టి సారించాలన్నదే అది. సంగీతంలో దిగితే దానికి అధిక సమయం కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు అంత సమయం లేదు. అయినా సంగీతంపై గమనం సారించాలని నిర్ణయించుకున్నాను. ప్ర: త్వరలో మీ తండ్రి కమలహాసన్‌తో నటించే కల నెరవేరబోతుండడం గురించి? జ: అవును. ఇంకా చెప్పాలంటే నా తొలి చిత్రం నుంచే నాన్నతో నటించడం గురించి చాలా ప్రచారం జరిగింది. అలాంటి ఆశ నాకూ ఉంది. అలాంటిది నాన్నతో ఒకే ఒక్క విషయం చెప్పాను.నాకంటూ పేరు సంపాదించుకున్న తరువాతే మీతో కలసి నటించగలననే నమ్మకం కలుగుతుంది అన్నాను. నా భావనను నాన్న అర్థం చేసుకున్నారు.అందుకు కావలసిన సమయాన్ని ఇచ్చారు.ఆ మధ్య నాన్నతో కలిసి నటించే అవకాశం వచ్చినా,అప్పుడు ఇద్దరం బిజీగా ఉన్నాం. మళ్లీ అలాంటి అవకాశం ఇప్పటికి వచ్చింది. మేమిద్దరం కలిసి నటించనున్న చిత్రం ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. నాన్న ఒక లెజెండ్. ఆయనతో నటిస్తున్నప్పుడు చాలా నేర్చుకోగలననే నమ్మకం నాకుంది.ఆ షూటింగ్ రోజుల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ప్ర: మీ తండ్రి నటనలో కింగ్. మీరేమో కమర్షియల్ చిత్రాలపై మాత్రమే దృష్టి పెడుతున్నారు.దీనిపై మీ స్పందన? జ: కమర్షియల్ చిత్రాల గురించి మీ అభిప్రాయం ఏమిటో తెలియదు గానీ, ఇలాంటి చిత్రాలకు మంచి నటన అవసరం అవుతుంది.నా వరకూ చిన్న పాత్ర అయినా దానికి పూర్తి న్యాయం చేయడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తాను.