కెమేరాకి నచ్చితే ప్రేక్షకులకూ నచ్చుతాం
ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో చదివే వ్యక్తులను మెంటలిస్ట్ అంటారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా మెంటలిస్టేనేమో! ఎందుకంటే, ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా మనసులో ఏముందో రజనీ తెలుసుకున్నారు. స్వయంగా రజనీయే ఈ సంగతి వెల్లడించారు. చెన్నైలో భారతీరాజా నెలకొల్పిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవానికి అతిథులుగా హాజరయ్యారు రజనీకాంత్, కమలహాసన్.
ఈ వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘నటుడిగా నన్ను ప్రజలు ఎలా అంగీకరిస్తున్నారు? అని భారతీరాజా మనసులో అనుకుంటుంటారు. నేను ఆయన మనస్సును చదవగలను. గతంలో కొంతమంది విలేకరులు ‘రజనీ గురించి మీ అభిప్రాయం ఏంటి?’ అని భారతీరాజాను అడగ్గా... ‘మంచి వ్యక్తి’ అని చెప్పారు. అంతే కానీ.. ‘అతను మంచి నటుడు’ అని ఆయన ఎప్పటికీ అంగీకరించరు.
‘కళ్లుక్కుల్ ఈరమ్’లో నటించిన నన్నే ప్రేక్షకులు నటుడిగా గుర్తించలేదు.. నిన్నెలా అంగీకరించారు’ అన్నట్లుగా ఆయన నన్ను చూస్తుంటారు. భారతీరాజా అంటే నాకూ.. నేనంటే ఆయనకూ ఎంతో ఇష్టం. నటులు కెమేరాకి నచ్చితే ప్రేక్షకులకూ నచ్చుతారు. అభిమానులకు ఏ హీరో నచ్చుతాడో ఎవరూ చెప్పలేం. నేను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నదానికంటే దర్శకుడు కె. బాలచందర్ దగ్గరే ఎక్కువ నేర్చుకున్నాను’’ అన్నారు.