హీరో అంటే ఎవరు ? : రాజమౌళి
'ఈ నగరానికి ఏమైంది? ఒక వైపు నుసి... మరోవైపు పొగ...' థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే తెలుగువారందరికీ సుపరిచితమైన 'నో స్మోకింగ్' యాడ్. అందరూ చూసేవారే.. యాడ్పై సెటైర్లు వేసేవారే.. పాటించేవారే కరువు! 'ధూమపానం ఆరోగ్యానికి హానికరం' అని స్కూల్లోనే చెప్తారు. అయితే ఆ పాఠాన్ని స్కూల్లోనే వదిలేస్తాం. ఇప్పుడు అలాంటి పాఠాన్నే మరోసారి చెబుతున్నారు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ధూమపానానికి వ్యతిరేకంగా ఓ ప్రముఖ ఆస్పత్రి చేపట్టిన ప్రచారంలో భాగంగా ఓ వీడియోలో నటించారు రాజమౌళి.
ఒకటిన్నర నిమిషాల నిడివి గల ఆ వీడియోలో రాజమౌళి.. 'హీరో అంటే ఎగ్జాక్ట్గా ఎవరు?' అని ప్రశ్నిస్తారు. సూపర్ మ్యాన్, అమితాబ్, మహేష్ బాబు, బాహుబలి, క్రిష్.. ఇలా రకరకాల సమాధానాలు విన్నాక.. 'అవును, వీళ్లంతా హీరోలే. అయితే మీరు కూడా హీరోలవ్వచ్చు.. ఒకే ఒక్క నిర్ణయంతో. ధూమపానాన్ని వ్యతిరేకించి మీ జీవితానికి మీరే హీరో అవ్వండి' అంటూ జక్కన్న చెబుతున్నారు. మరి మీరూ హీరో అవుతారు కదూ.