డైరెక్టర్‌ రాజమౌళి.. యాక్టర్‌ లాయర్‌ | Office Boy Arrest in Cheating Case Hyderabad | Sakshi
Sakshi News home page

డైరెక్టర్‌ రాజమౌళి.. యాక్టర్‌ లాయర్‌

Published Fri, Jul 19 2019 8:18 AM | Last Updated on Wed, Jul 24 2019 1:13 PM

Office Boy Arrest in Cheating Case Hyderabad - Sakshi

పోలీసుల అదుపులో నిందితులు

ఓ ఆఫీస్‌ బాయ్‌ సినీ నిర్మాత అవతారం ఎత్తాడు. జస్ట్‌ డయల్‌ ద్వారా పరిచయమైన ఓ మహిళా న్యాయవాదికి తాను నిర్మాతనని చెప్పి నమ్మించాడు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిగా అవకాశం ఇప్పిస్తానని ఎరవేశాడు. ఆమె మాయగాడి మాటలు నమ్మడంతో రకరకాల పేర్లు చెప్పి రూ.50 లక్షలు గుంజాడు.  

సాక్షి, సిటీబ్యూరో: ఆఫీస్‌బాయ్‌గా పని చేసే అతడి పేరు వీరబత్తిని నరేష్‌ కుమార్‌... ఆదిత్య, జై అనే పేర్లతోనూ చెలామణి అతగాడు సినీ నిర్మాతగా చెప్పుకున్నాడు... జస్ట్‌ డయల్‌ ద్వారా పరిచయమైన న్యాయవాదికి నటించే అవకాశం ఇస్తానన్నాడు... ఆ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నట్లు నమ్మించాడు... రకరకాల పేర్లు చెప్పి ఆమె నుంచి రూ.50 లక్షలు గుంజాడు... ఈ డబ్బు డిపాజిట్‌ చేయించుకునేందుకు 15 మంది స్నేహితుల బ్యాంకు ఖాతాలు వాడుకున్నాడు... ఈ ఘరానా మోసగాడిని అరెస్టు చేసిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రూ.65 వేల నగదు, కారు, బంగారం తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలు ఇవ్వడం ద్వారా ఇతడికి సహకరించిన 15 మంది స్నేహితులనూ నిందితుల జాబితాలో చేర్చిన అధికారులు వీరిలో ఇద్దరిని కూడా పట్టుకున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు గురువారం పేర్కొన్నారు. కొండాపూర్‌ ప్రాంతానికి చెందిన నరేష్‌ కుమార్‌ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా పని చేస్తున్నాడు. పథకం ప్రకారం ఇతను జస్ట్‌ డయల్‌ ద్వారా ఓ మహిళా న్యాయవాది (73) ఫోన్‌ నెంబర్‌ సేకించాడు. ఆమెను సంప్రదించిన అతను తమ వాళ్లకు సంబంధించి న్యాయ సలహా కావాలని కోరాడు. మాటల మధ్యలోనే తానో సినీ నిర్మాతనని, ఇప్పటికే చాలా సినిమాలు నిర్మించానని, దర్శకుడు రాజమౌళి మంచి సన్నిహితుడనీ చెప్పాడు.

ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరుతో చిత్రాన్ని రూపొందించే సన్నాహాల్లో ఉన్నట్లు పేర్కొన్నాడు. అందులో తల్లి పాత్రలో నటించే ఆసక్తి ఉందా అంటూ సదరు న్యాయవాదిని కోరాడు. ఆసక్తి చూపిన ఆమె తాను గతంలో మూడు నెలల పాటు నటనలో శిక్షణ సైతం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఆమెకు మూడు వేర్వేను నంబర్ల నుంచి ఫోన్లు చేసి రాజమౌళి గొంతును ఇమిటేట్‌ చేస్తూ మాట్లాడాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో పాత్ర పక్కా అంటూ దీనికోసం ఫిల్మ్‌ ఛాంబర్, ‘మా’ టీవీ సీరియల్‌ నటి గుర్తింపుకార్డు తీసుకోవాలంటూ చెప్పాడు. ఆదిత్య పేరుతో న్యాయవాదితో మాట్లాడిన నరేష్‌ కనీసం ఒక్కసారి కూడా ఆమెకు కనిపించలేదు. ఆయా గుర్తింపుకార్డులు తీసుకునేందుకు రుసుము చెల్లించాలని చెబుతూ ఈ ఏడాది జనవరి–జూన్‌ మధ్య వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.50 లక్షల వరకు డిపాజిట్‌ చేయించుకున్నాడు. ఏప్రిల్‌ 17న న్యాయవాదికి ఫోన్‌ చేసిన ఆదిత్య తన కారు చెడిపోయినందున, షూటింగ్‌ స్పాట్స్‌కు వెళ్లడానికి ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో మీ కారు కొన్ని రోజులకు కావాలని అడిగాడు. ఆమె అంగీకరించడంతో స్నేహితుడి సాయంతో దానిని తీసుకుని తన వద్దే ఉంచేసుకున్నాడు. న్యాయవాదికి మళ్లీ ఫోన్‌ చేసి మరికొంత మొత్తం కోరగా ఆమె తన వద్ద లేవని చెబుతూ కారు విషయం ప్రశ్నించింది. దీంతో దుర్భాషలాడిన అతగాడు ఆమెను తీవ్రంగా హెచ్చరించాడు. ఆపై సదరు న్యాయవాదితో సంప్రదింపులకు వినియోగించిన ఫోన్‌ నంబర్లు స్విచ్ఛాఫ్‌ చేశాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడిని పట్టుకునేందుకు సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై కె.శ్రీనివాసులుతో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఎట్టకేలకు గురువారం అతడిని అదుపులోకి తీసుకుంది. విచారణ నేపథ్యంలో సదరు న్యాయవాది నుంచి డబ్బు డిపాజిట్‌ చేయించుకునేందుకు తన స్నేహితులు, పరిచయస్తులైన 15 మంది బ్యాంకు ఖాతాలు వినియోగించానని, దీనికి వారంతా సహకరించారని వెల్లడించాడు. దీంతో ఎం.రామకృష్ణ, కె.సోమన్నలను సైతం అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.నిందితులను బోయిన్‌పల్లి పోలీసులకు అప్పగించారు.  

నిందితుడిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌
ఇదే తరహా మోసానికి పాల్పడటంతో నరేష్‌పై గతంలో  గుంటూరు జిల్లా, కొల్లిపర ఠాణాలోనూ కేసు నమోదైనట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. ఆ కేసులో అరెస్టైన బెయిల్‌పై వచ్చి కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం నాన్‌–బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇతను మరింత మందిని మోసం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement