సినీ పరిశ్రమను రక్షించాలంటే ప్రభుత్వం కచ్చితమైన విధానాలు అవలంబించాలని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు 1990ల కాలం నుంచి హైదరాబాద్ సొంతింటిలా ఉందని, సరైన విధాన నిర్ణయాలు అమలుచేసినంత కాలం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పరిశ్రమను హైదరాబాద్ నుంచి తరలిస్తేనే అసలు సమస్యలన్నీ వస్తాయన్నారు. ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్న ప్రాంతాల్లో షూటింగ్ చేసుకునేవాళ్లమని, అలాంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో షూటింగ్ చేయాల్సి వస్తుందని, ఇది కొంత ఇబ్బంది కావచ్చని మాత్రం చెప్పారు. చాలావరకు తెలుగు సినిమాలను హైదరాబాద్లోని స్టూడియోలలోనే తీస్తున్నారని, మరికొన్నింటిని చుట్టుపక్క్లల ప్రాంతాలలో తీస్తున్నారని.. అయితే ఇదంతా తర్వాత తెలంగాణే అవుతుందని అన్నారు. ముందుగా అనుమతి తీసుకున్నాకే షూటింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుందని భరద్వాజ చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత.. తెలంగాణ సినిమా ఫోర్స్ పేరుతో ప్రత్యేక సినిమా కమిటీ ఏర్పాటు చేయడానికి పరిశ్రమకు చెందిన కొంతమంది ఆసక్తి చూపించారని తెలిపారు. పరిశ్రమను తరలించడం అనేమాట ఇప్పుడే చెప్పడం చాలా తొందర అవుతుందన్నారు. ప్రభుత్వం వినోద పన్ను మినహాయిస్తామని ప్రకటిస్తే, అక్కడకు వెళ్లొచ్చని.. ఒకచోట మినహాయింపు ఉండి, మరోచోట లేకపోతే నిర్మాతలు మినహాయింపు ఉన్నచోటే షూటింగ్ చేసుకుంటారని ఆయన తెలిపారు. వినోదపన్ను మినహాయిస్తే చాలా సొమ్ము ఆదా అవుతుందని, అందువల్ల సహజంగానే నిర్మాతలు పన్ను లేని చోట్ల షూటింగ్ చేసుకోడానికి ఆసక్తి చూపుతారని భరద్వాజ చెప్పారు. హైదరాబాద్లో కావల్సినన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని, స్టూడియోల నుంచి ల్యాబ్లు, సినిమా హాళ్లు అన్నీ ఇక్కడ ఉన్నాయని, ఇలాంటి సమయంలో ఇక్కడి నుంచి వెళ్లి వేరేచోట మళ్లీ కొత్తగా ఏర్పాటు చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పైపెచ్చు అంత భారీగా సదుపాయాలు ఏర్పాటుచేసుకోడానికి నిధులు ఎక్కడినుంచి వస్తాయని ప్రశ్నించారు.