శ్రీదేవి (ఫైల్ ఫొటో)
‘శ్రీదేవి ఇకలేరు అంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా. మోహిత్ మర్వా పెళ్లిలో శ్రీదేవికి మేకప్ కోసం నేను దుబాయ్‌లోనే ఉన్నా. పెళ్లి వేడుకలో ఎప్పటిలాగే ఆమె ఎంతో అందంగా, ఆనందంగా, ఉజ్వలంగా కనిపించారు. ఆ తర్వాత నేను దుబాయ్ నుంచి భారత్ తిరిగి వచ్చాను. శనివారం రాత్రి నుంచి ఆమె చనిపోయిందనే వార్తలు వస్తున్నాయి. నేను ఇప్పటికీ షాక్‌లో ఉన్నాను’ అని చివరిగడియల్లో శ్రీదేవితో ఉన్న మేకప్ ఆర్టిస్ట్ సుభాష్ షీండే చెప్పిన మాటలివి. దుబాయ్‌లో తన మేనల్లుడు మోహిత్ మర్వా పెళ్లిలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి ఆకస్మికంగా చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె మృతిపై పలు అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోహిత్ మర్వా పెళ్లికోసం శ్రీదేవితోపాటు దుబాయ్ వెళ్లి మేకప్ అందించిన షీండే ఐఏఎన్‌ఎస్ వార్తాసంస్థతో మాట్లాడారు. ఆమె చివరిగడియల్లోనే ఎంతో ఉత్సాహంగా కనిపించారని తెలిపారు.
శ్రీదేవి నటించిన ‘పులి’, ‘మామ్’ సినిమాలకు షీండే మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. శ్రీదేవి ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో, ఉత్సాహంతో ఉండేవారని, సినిమా సెట్స్‌లో ఉన్న మేకప్ ఆర్టిస్టులు మొదులుకొని అందరినీ కుటుంబసభ్యులలాగా చూసుకునేవారని ఆయన తెలిపారు. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమా నుంచి తాను ఆమెతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. సమయానికి భోజనం చేస్తున్నావా? మీ కుటుంబసభ్యులు ఎలా ఉన్నారు వంటి క్షేమసమాచారాలను ఆమె తనను అడిగేదని చెప్పారు.
‘శ్రీదేవి మంచి పెయింటర్. కలర్స్, షేడ్స్ గురించి ఆమె గొప్ప అవగాహన ఉంది. వస్త్రాల కలర్స్, వాటి కాంబినేషన్ విషయంలో నేను ఆమెను అడిగి తెలుసుకునేవాణ్ని. ఆమెకు గొప్ప కళాత్మక దృష్టి ఉంది’అని షీండే వివరించారు. రంగులు, బంగారు అభరణాలు, చివరికి తాను పెట్టుకున్న బొట్టుబిల్లా (బిందీ) వరకు ప్రతి వివరాన్ని ఆమె అడిగి తెలుసుకునేవారని చెప్పారు. మేకప్ సెషన్‌లో శ్రీదేవి ఎంతో ఓపికతో ఉండేవారని, ఆమె ఎంతో సహకరించేవారని తెలిపారు.‘పులి చిత్రం సమయంలో ఆమె భారీ మేకప్ వేసుకోవాల్సి వచ్చేది. ఆ సమయంలో కూడా ఆమె ఎప్పుడూ రుసరుసలాడటం లాంటిది చేయలేదు. మేకప్ కోసం ఎంతో సమయం తీసుకున్నా.. ఎంతో ఓపికగా మాకు ఆమె సహకరించేది’ అని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment