శ్రీదేవి, బోనీ కపూర్
ముంబై: ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణంపై వారం రోజులుగా అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆమె భర్త, ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్ తొలిసారి స్పందించారు. తన స్నేహితుని వద్ద శ్రీదేవి మరణించిన రోజు ఏం జరిగిందనే విషయంపై పెదవి విప్పారు. తాను సడెన్‌గా దుబాయ్ వెళ్లడం.. అక్కడ శ్రీదేవిని సర్‌ప్రైజ్ చేయడం.. ఇద్దరం కలసి గడపడం.. చివరిగా బాత్‌రూమ్‌లో శ్రీదేవిని విగతజీవిగా చూడటం.. ఇలా ఫిబ్రవరి 24న సాయంత్రం జరిగిన ప్రతి విషయాన్ని బోనీ తన స్నేహితుడు, ట్రేడ్ ఎనలిస్ట్ కోమల్ నాహ్తాకు పూసగుచ్చినట్టు వివరించారు. బుధవారం శ్రీదేవి అంత్యక్రియలకు కొద్దిసేపటి ముందు వారిద్దరి మధ్యా జరిగిన ఈ సంభాషణలను యథాతథంగా కోమల్ తన బ్లాగ్‌లో రాసి ఆ తర్వాత దానిని అధికారిక ట్వీటర్ పేజీలో షేర్ చేశారు.
ఒంటరితనమంటే ఆమెకు భయం..
కోమల్ బ్లాగ్‌లో షేర్ చేసిన ప్రకారం(బోనీ కోణం నుంచి).. ఫిబ్రవరి 24 ఉదయం నేను శ్రీదేవితో మాట్లాడాను. ఆ రోజు సాయంత్రం నేను దుబాయ్ వస్తున్నట్టు ఆమెకు చెప్పలేదు. దుబాయ్ వెళ్లాలనే ఆలోచనకు జాన్వీ కూడా ఓకే చెప్పింది. ఎందుకంటే.. శ్రీదేవి ఒంటరిగా ఉంటే భయపడుతుందని, పాస్‌పోర్ట్, ఇతర కీలకమైన పత్రాలను ఎక్కడో పెట్టి మరిచిపోతుందనేది ఆమె భయం. గత 24 ఏళ్లలో నేను, శ్రీదేవి కలసి విదేశాలకు వెళ్లకపోవడం రెండుసార్లే జరిగింది. సినిమా ప్రదర్శనల కోసం న్యూజెర్సీ, వాంకోవర్‌లకు శ్రీదేవి వెళ్లింది. అప్పుడు నేను ఆమెతో లేను. అయితే నా స్నేహితుని భార్యను శ్రీదేవికి తోడుగా పంపాను. రెండు రోజులు శ్రీదేవి ఒంటరిగా ఓ విదేశీ గడ్డపై ఉండటం మాత్రం దుబాయ్‌లోనే జరిగింది.
ఫిబ్రవరి 20న నేను, శ్రీదేవి, ఖుషీ ఓ వివాహం నిమిత్తం దుబాయ్ వెళ్లాం. ఫిబ్రవరి 22న లక్నోలో ఓ కీలకమైన సమావేశం ఉండటంతో దానికి హాజరయ్యేందుకు నేను ఇండియా వచ్చాను. ఫిబ్రవరి 22, 23వ తేదీల్లో జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్‌లోని రూమ్ నంబర్ 2201లో శ్రీదేవి రిలాక్స్ అవుతూ.. జాన్వీ కోసం షాపింగ్ చేసింది. ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3.30 గంటలకు నేను విమాన టికెట్ బుక్ చేసుకున్నాను. దుబాయ్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.20 గంటలకు శ్రీదేవి ఉంటున్న హోటల్‌కు చేరుకున్నాను. హోటల్ వద్ద శ్రీదేవిని సర్‌ప్రైజ్ చేశాను. ఇద్దరం 15 నిమిషాలు గడిపాం. అనంతరం నేను ఫ్రెషప్ అయి.. రొమాంటిక్ డిన్నర్‌కు వెళదామని ప్రతిపాదించాను.
దీనికి ఓకే అన్న శ్రీదేవి.. స్నానానికి వెళ్లింది.శ్రీదేవి మాస్టర్ బాత్‌రూమ్‌కు వెళ్లింది. లివింగ్ రూమ్‌కు వచ్చిన నేను టీవీ చూస్తూ కొద్దిసేపు గడిపాను. 15–20 నిమిషాల తర్వాత సమయం 8 గంటలకు సమీపిస్తుండటం.. శనివారం కావడంతో హోటల్‌లో రష్ పెరిగిపోతు0దనే ఉద్దేశంతో లివింగ్ రూమ్ నుంచే రెండుసార్లు బిగ్గరగా శ్రీదేవిని పిలిచినా పలక లేదు. టీవీ వాల్యూమ్ తగ్గించి మళ్లీ పిలిచినా స్పందన లేదు. దీంతో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి డోర్ కొట్టి.. మళ్లీ శ్రీదేవిని పిలిచాను. ఎంతసేపటికీ డోర్ తీయకపో వడం.. లోపలి నుంచి ట్యాప్ అన్ చేసి ఉన్న శబ్దం రావడంతో ఆందోళన చెంది డోర్ తెరిచే ప్రయత్నం చేశాను.
లోపల బోల్ట్ పెట్టకపోవడంతో డోర్ వెంటనే తెరుచుకుంది. లోపలికి వెళ్లి చూస్తే బాత్‌ట బ్‌లోని నీటిలో పూర్తిగా మునిగిన శ్రీదేవి కనిపించింది. షాక్‌కు గురై ఎటువంటి చలనం లేకుండా శ్రీదేవిని చూస్తూ ఉండిపోయాను. శ్రీదేవి మునిగిపోయింది.. బోనీ ప్రపంచం బద్దలైపో యింది. శ్రీదేవిని బోనీ సర్‌ప్రైజ్ చేసిన రెండు గంటల్లోనే అంతా జరిగిపోయిందని కోమల్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. తొలుత నీట మునిగి ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉండొచ్చని లేదా మొదట నిద్రలోకి జారుకుని లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లి నీట మునిగిపోయి ఉండొచ్చని కోమల్ అంచనా వేశారు. ఆమె ఒక్క నిమిషం కూడా వేదన అనుభవించిన దాఖలాలు లేవని, ఎందుకంటే బాత్‌టబ్ పూర్తిగా నిండినా చుక్క నీరు కింద పడకపోవడం దీనికి నిదర్శనమని స్పష్టం చేశారు.
రామేశ్వరంలో శ్రీదేవి అస్థికలు నిమజ్జనం
సాక్షి, చెన్నై: ప్రముఖ నటి శ్రీదేవి అస్థికలను ఆమె కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం రామేశ్వరం వద్ద సముద్రంలో కలిపారు. దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడిపోయి శ్రీదేవి చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె భౌతికకాయానికి ముంబైలో ఫిబ్రవరి 28న అంత్యక్రియలు జరిగాయి. సంప్రదాయం ప్రకారం శ్రీదేవి మృతదేహాన్ని దహనం చేశారు. ప్రత్యేక విమానంలో శ్రీదేవి భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషి, ఇతర కుటుంబ సభ్యులు శుక్రవారం చెన్నై చేరుకున్నారు. అనంతరం ఈసీఆర్‌లోని శ్రీదేవి ఫామ్ హౌస్‌లో బసచేశారు. శనివారం ఉదయాన్నే పూజలు నిర్వహించిన తర్వాత రామేశ్వరానికి వెళ్లి అక్కడి సముద్రతీరంలోని అగ్నితీర్థంలో శ్రీదేవి అస్థికలను బోనీకపూర్ కలిపారు.
Comments
Please login to add a commentAdd a comment