ముంబైకి శ్రీదేవి పార్థివదేహం | Sridevi Dead Body Reached Mumbai | Sakshi
Sakshi News home page

ముంబైకి శ్రీదేవి పార్థివదేహం

Published Wed, Feb 28 2018 1:53 AM | Last Updated on Wed, Feb 28 2018 6:59 AM

Sridevi Dead Body Reached Mumbai - Sakshi

అంబులెన్స్‌లో తరలిస్తున్న శ్రీదేవి మృతదేహం

దుబాయ్‌/ముంబై : సినీనటి శ్రీదేవి మరణంపై ముసురుకున్న అనుమానాలకు తెరపడింది! దేశవ్యాప్తంగా గత మూడ్రోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. స్పృహ కోల్పోయి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడిపోవడం వల్లే శ్రీదేవి మరణించారని నిర్ధారిస్తూ దుబాయ్‌ పోలీసులు మంగళవారం కేసును మూసివేశారు. భౌతికకాయాన్ని భర్త బోనీకపూర్‌కు అప్పజెప్పారు.

అంతకుముందే మృతదేహం పాడవకుండా చేసే ఎంబామింగ్‌ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ప్రత్యేక ప్రైవేటు విమానం ద్వారా శ్రీదేవి భౌతికకాయం మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ముంబై చేరుకుంది. 10.30 గంటలకు లోఖండ్‌వాలాలోని  శ్రీదేవి నివాసానికి తరలించారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విలేపార్లె సేవా సమాజ్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు అభిమానులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని సెలబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో శ్రీదేవి భౌతికకాయాన్ని ఉంచుతారు.

కేసు మూసేశారు.. కానీ..
దుబాయ్‌లో బంధువుల వివాహ వేడుకకు హాజరైన శ్రీదేవి అక్కడే తానున్న జుమైరా ఎమిరేట్స్‌ టవర్స్‌ హోటల్‌లోని గదిలో శనివారం హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. తొలుత, ఆమె గుండెపోటుతో మరణించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత గుండెపోటుతో కాదు.. బాత్‌టబ్‌లో పడిపోయి చనిపోయారని, ఆమె శరీరంలో మద్యం తాగిన ఆనవాళ్లున్నాయని, శరీరంపై గాయాలు కూడా ఉన్నాయని ఫోరెన్సిక్‌ నివేదికను ఉటంకిస్తూ గల్ఫ్‌ న్యూస్‌ పత్రిక ఒక కథనం ప్రచురించింది.

దుబాయ్‌ పోలీసులు బోనీకపూర్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారని, ఆయన పాస్‌పోర్ట్‌ను సైతం స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే వీటన్నింటినీ ముగింపు పలుకుతూ మంగళవారం దుబాయ్‌ ప్రభుత్వ మీడియా కార్యాలయం పలు ట్వీట్లు చేసింది. ‘‘నటి శ్రీదేవి మరణంపై పూర్తి దర్యాప్తు అనంతరం.. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పేందుకు దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ అనుమతించింది’’అని అందులో పేర్కొంది.

‘‘ఈ తరహా కేసుల దర్యాప్తులో చేపట్టాల్సిన అన్ని లాంఛనాలను దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ముగించింది. ఫోరెన్సిక్‌ నివేదిక ప్రకారం.. స్పృహ కోల్పోవడంతో బాత్‌రూమ్‌లోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ పడిపోయి ఆమె మృతి చెందారని నిర్ధారించారు. అందువల్ల కేసును దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ మూసివేస్తోంది’’అని మరో ట్వీట్‌ చేసింది. అయితే ఆమె స్పృహ కోల్పోవడానికి గల కారణాలను మాత్రం ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం.

నో కెమెరా.. ప్లీజ్‌!
‘ఈ బాధాకర సమయంలో మాకు తోడుగా నిలిచిన మీడియాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’’అని పేర్కొంటూ కపూర్, అయ్యప్పన్‌ కుటుంబాలు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. శ్రీదేవి భౌతికకాయాన్ని అభిమానులు, శ్రేయోభిలాషుల చివరి చూపుకోసం లోఖండ్‌వాలాలోని సెలబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో బుధవారం ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 వరకు ఉంచుతామన్నారు. 2 గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. మీడియా కూడా నివాళులర్పించవచ్చని, అయితే కెమెరాలు, ఇతర రికార్డింగ్‌ వస్తువులను బయటే వదిలేసి రావాలని విజ్ఞప్తి చేశారు.

తండ్రికి సాయంగా..
శనివారం శ్రీదేవిని సర్‌ప్రైజ్‌ డిన్నర్‌కు తీసుకెళ్లేందుకు బోనీకపూర్‌ దుబాయ్‌ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ఆయన అక్కడే ఉన్నారు. మంగళవారం ఉదయం ఆయనకు తోడుగా ఉండేందుకు మొదటి భార్య కుమారుడు అర్జున్‌ కపూర్‌ కూడా దుబాయ్‌ బయల్దేరి వెళ్లారు. శ్రీదేవి భౌతికకాయాన్ని తమకు అప్పగించినప్పుడు బోనీతోపాటు ఆయన కూడా అక్కడే ఉన్నారు. శ్రీదేవి మృతదేహాన్ని ముంబైకి తీసుకువచ్చేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీ తన ఎంబ్రేయర్‌ విమానాన్ని దుబాయ్‌ పంపించారు.

అనిల్‌ కపూర్‌ నివాసానికి తారాలోకం
ముంబైలోని బోనీకపూర్‌ సోదరుడు అనిల్‌ కపూర్‌ నివాసం శ్రీదేవి సహ నటులు, శ్రేయోభిలాషులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం నుంచే వారంతా రావడం ప్రారంభించారు. ‘‘మా నాన్న మరణం తర్వాత నన్నంతగా బాధించింది శ్రీదేవి మరణమే. ఈ వార్త విన్నప్పటి నుంచి ఆమె ముఖమే పదేపదే నాకు గుర్తొస్తోంది. తను నన్నెంతో ప్రేమగా చూసేది. నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తిత్వం ఆమెది. నేను తనను చిన్నమ్మ (మౌసీ)లా భావిస్తాను’’అని బాలీవుడ్‌ నటి రాణి ముఖర్జీ కన్నీళ్ల పర్యంతమయ్యారు.

అనిల్‌కపూర్‌ నివాసానికి వచ్చినవారిలో షారూఖ్‌ ఖాన్, ఆయన భార్య గౌరి ఖాన్, రజనీకాంత్, కమల్‌హాసన్, దీపిక పడుకోన్, రణ్‌వీర్‌ సింగ్, టబు, రేఖ, ఫరాఖాన్, జావేద్‌ అఖ్తర్, షబానా ఆజ్మీ తదితరులున్నారు. మరోవైపు లోఖండ్‌వాలాలోని శ్రీదేవి నివాసం వెలుపల అభిమాన నటికి చివరి వీడ్కోలు పలికేందుకు అశ్రునయనాలతో అభిమానులు వేచి చూస్తున్నారు.

చానళ్ల అతిపై సెలబ్రిటీల మండిపాటు
శ్రీదేవి మరణంపై టీవీ చానళ్ల అతిపై పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, ఆమె అభిమానులు మండిపడ్డారు. చానెళ్లు నిర్దయగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాయని హీరోయిన్‌ విద్యాబాలన్, నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ దుయ్యబట్టారు. ‘ప్రాణానికి భారత్‌లో విలువ లేదన్న విషయాన్ని మీడియా మరోసారి రుజువు చేసింది. శ్రీదేవి మీకు వినోదం పంచేందుకు మరణించలేదు..’అని అమితాబ్‌ బచ్చన్‌ ఘాటుగా విమర్శించారు. ‘మీకు, మీ ఫ్యామిలీకి ఏదైనా మంచి చేయాలనుకుంటే వెంటనే టీవీలు కట్టేయండి’అని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా మాంటెనా పేర్కొన్నారు.

ఓ లెజెండ్‌ మరణం చుట్టూ ఇన్ని కట్టుకథలు అల్లిన తర్వాత ఆమె ఆత్మకు ఎలా శాంతి చేకూరుతుంది అని సోనూ సూద్‌ ప్రశ్నించారు. రిపోర్టింగ్‌ ప్రమాణాలు ఏ స్థాయికి దిగజారాయో చూసుకొని చానళ్లు సిగ్గు తెచ్చుకోవాలన్నారు. ‘శ్రీదేవిని మీడియా లైవ్‌లో చంపేస్తుండగా దేశమంతా చేష్టలుడిగి చూసింది’ అని ఓ అభిమాని, శ్రీదేవి మరణాన్ని ఓ వినోద కార్యక్రమంగా చూపడం ఇకనైనా ఆపాలని మరో అభిమాని ఆవేదన వ్యక్తంచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement