సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘దేశంలోనే అగ్రశ్రేణి తారగా ఖ్యాతి గడించిన సూపర్‌స్టార్ శ్రీదేవికి సొంత చిన్నమ్మ కూతుర్నని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడేదాన్ని. ఆమె తిరుపతి వస్తే ఆ రోజంతా మాకు పండుగే. ఎంతో ప్రేమ, ఆప్యాయతతో పలకరిస్తుంది. బంధువుల సంగతులన్నీ విని, అవునా.. అంటూ ఆశ్చర్యపోయేది. మాతో కలసి సరదాగా తింటుంది. అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. పప్పీ అక్క లేదంటే నమ్మశక్యంగా లేదు..’ అంటూ శ్రీదేవి చిన్నమ్మ కూతురు ప్రసన్నలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు.
అలవాట్లు, అభిరుచులు దాదాపు ఒక్కటే కావడంతో తమద్దరి మధ్యా అపూర్వ బంధం పెనవేసుకుందని ప్రసన్నలక్ష్మి వివరించారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేసే ప్రసన్నలక్ష్మికి శ్రీదేవి స్వయానా పెద్దమ్మ కూతురు. శ్రీదేవి, ప్రసన్నలక్ష్మిలు అక్కాచెల్లెళ్లైన రాజేశ్వరి, అనసూయల కుమార్తెలు.
దుబాయ్‌లో శ్రీదేవి ఆకస్మికంగా కన్నుమూసిందన్న సమాచారం వినగానే తిరుపతి పద్మావతిపురంలో ఉండే పిన్ని అనసూయ, సోదరి ప్రసన్నలక్ష్మి, ఈమె భర్త గిరిప్రసాద్‌లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దుబాయ్ నుంచి శ్రీదేవి మృతదేహం ముంబైకు తీసుకువస్తున్నారని తెలుసుకున్న వీరంతా మంగళవారం హుటాహుటిన ముంబై వెళ్లారు. వెళ్లే ముందు వీరు శ్రీదేవితో తమ జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
శనివారమంటే ఎంతో ఇష్టం..
‘శ్రీదేవి అక్కను ఇంట్లో అందరూ ప్రేమగా పప్పీ అని పిలుస్తుంటారు. మేం కూడా అలాగే పిలుస్తుంటాం. తన పుట్టిన రోజైన ఆగస్టు 13న ఏటా తిరుమల వస్తుండేది. తిరుమల శ్రీవారికి శనివారం అంటే ఇష్టం. అక్కకు కూడా అదేరోజు ఇష్టం. యాధృచ్ఛికంగా శనివారమే తనూ చనిపోయింది. దేవుడు తనలో ఐక్యం చేసుకున్నాడని భావిస్తున్నామని’ ప్రసన్నలక్ష్మి కన్నీరు పెట్టుకున్నారు. తమకున్న బంధువులందరిలోనూ పప్పీ అక్కే టాప్. ఆమె నటనలోనే కాదు. అన్నింటా ఆమె ముందుంటుంది.
సినీ పరిశ్రమ గురించి ఆమె చెప్పే కబుర్లు గుర్తుకొస్తున్నాయి. చివరకు శ్రీదేవి అక్క మామ్ సినిమా ప్రమోషన్ కోసం తిరుపతి వచ్చింది. హోటల్ రూమ్‌లో ఉండి ఫోన్ చేసింది. మేమంతా అక్కడికెళ్లాం. సరదాగా భోజనం చేస్తూ మాట్లాడుకున్నాం. అదే లాస్ట్ ఆమెను చూడటం..’ అని ప్రసన్నలక్ష్మి గుర్తుచేసుకున్నారు. ఆమెలో కోపం, చిరాకు, ఏడుపులాంటివి ఎన్నడూ చూడలేదని.. ఎప్పుడూ ఏంజల్ (దేవత)లా కనిపించేదని ఆమె వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment