జపాన్‌లో సుదీప్ ‘చ్యూయింగ్ గమ్’
మన భారతీయ నటుల్లో జపనీయుల అభిమానం సంపాదించుకున్న తొలి నటుడు రజనీకాంత్. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా జపాన్‌లో ఫాలోయింగ్ ఏర్పడింది. టీవీ చానల్స్‌లో ఎన్టీఆర్ డాన్సులు చూసి, ఆయనకు అక్కడ అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడీ జాబితాలో కన్నడ నటుడు సుదీప్ చేరారు. ఆయన జపనీయుల అభిమానం సంపాదించుకోవడానికి కారణం తెలుగు చిత్రం ‘ఈగ’. ఈ బహు భాషా చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. జపాన్‌లో కూడా ఈ చిత్రం విడుదలైంది. ఇందులో సుదీప్ నటనకు జపాన్‌లో అభిమానులు ఏర్పడ్డారు.
ఓ చ్యూయింగ్ గమ్ ఉత్పత్తిదారుడైతే, సుదీప్ ఫోటోని ఉపయోగించుకున్నాడు. చ్యూయింగ్ గమ్‌కి సంబంధించిన కవర్‌పై సుదీప్ ఫొటోని ముద్రించాడు. మామూలుగా అయితే ఈ విషయం సుదీప్‌కి తెలిసి ఉండేది కాదు. కానీ, ఒక్క జపాన్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇవి దొరుకుతున్నాయి. ఇటీవల సుదీప్ బ్యాంకాక్‌లో షూటింగ్ చేస్తుండగా, ఈ చ్యూయింగ్ గమ్స్ ఆయన కంటపడ్డాయి. ‘స్వీట్ షాక్ తగిలినట్లుగా అనిపించింది’ అని అంటున్నారు సుదీప్. దేశం కాని దేశంలో ఇలాంటి అభిమానం దక్కినందుకు ఆనందంగా ఉందని, జపాన్ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.