
వైవిధ్యమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు సుమంత్. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రానికి ‘ఇదం జగత్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ని ఖరారు చేశారు. మలయాళ ‘ప్రేమమ్’ ఫేమ్ అంజు కురియన్ ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నారు. అనిల్ శ్రీ కంఠం దర్శకత్వంలో విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు.
పద్మావతి, శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘సుమంత్ కెరీర్‌లో ఇప్పటివరకు చేయని వైవిధ్యమైన పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారు. ఎవరూ ఊహించని విభిన్నమైన ఆ పాత్ర ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమంత్ పాత్ర, కథకు ‘ఇదం జగత్’ టైటిల్ కరెక్ట్‌గా సరిపోతుంది. టైటిల్‌కు చక్కని స్పందన వస్తోంది. 80 శాతం షూటింగ్ పూర్తయింది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సహ నిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి.