ఆ చిత్రంలో హీరో ఎవరు?
కోలీవుడ్‌లో మగధీరా, బాహుబలి చిత్రాల తరహాలో ఒక బ్రహ్మాండ చారిత్రక కథాంశంతో కూడిన చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి, నటుడిగా విజయాలను అందుకుంటున్న ప్రముఖ దర్శకుడు సుందర్.సి. ఈ భారీ చారిత్రాత్మక చిత్రాన్ని హ్యాండిల్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీతే నాండాళ్ ఫిలింస్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. ఇది ఈ సంస్థ నిర్మించనున్న వందో చిత్రం కావడం విశేషం.
తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందించడానికి చిత్ర నిర్మాత మురళి రామనారాయణన్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి తిరు చాయాగ్రహణం, శిబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, బాహుబలి చిత్రానికి వీఎఫ్‌ఎక్స్‌ను అందించిన కమలకన్నన్ పనిచేయనున్నారు. ఇక ఈ గ్రాండియర్ చిత్రానికి సంగీతజ్ఞాని ఇళయరాజా గానీ, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ గానీ బాణీలు కట్టే అవకాశం ఉందని సమాచారం.
అదే విధంగా ఈ చారిత్రాత్మక కథా చిత్రంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గానీ, కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య గానీ కథానాయకుడిగా నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈ విషయం గురించి చెప్పడానికి ఇంకా సయమం ఉందని నిర్మాత మురళి రామనారాయణన్ పేర్కొన్నారు. అయితే తెలుగు, తమిళ భాషల్లో బాక్సాఫీస్ కలెక్షన్ కింగ్‌నే ఇందులో కథానాయకుడుగా నటిస్తారని స్పష్టం చేశారు. అలాగే హీరోయిన్‌గా ప్రముఖ బాలీవుడ్ నటి ఉంటారని అన్నారు. సుందర్.సి ప్రస్తుతం తాను హీరోగా నటించిన ముత్తిన కత్తిరికా చిత్ర రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 17న తెరపైకి రానుంది.