
సందీప్ ‘జోరు’ చూడొచ్చు
‘‘ఈ సినిమా నేను చేయడానికి ఏకైక కారణం దర్శకుడు కుమార్ నాగేంద్ర. ఆయనపై గుడ్డి నమ్మకంతోనే ఈ సినిమా ఒప్పుకున్నా. ఎందుకంటే ‘గుండెల్లో గోదారి’ సినిమాలో నాతో అద్భుతమైన పాత్ర చేయించారాయన. భవిష్యత్తులో కూడా మేం సినిమాలు చేస్తాం’’ అని సందీప్ కిషన్ చెప్పారు. సందీప్ కిషన్, రాశిఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మా హీరోహీరోయిన్లుగా కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో అశోక్, నాగార్జున నిర్మించిన ‘జోరు’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత ఎన్‌వీప్రసాద్ పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని నటుడు బ్రహ్మానందంకు అందించారు.
ప్రచార చిత్రాలను బోయపాటి శ్రీను ఆవిష్కరించారు. సినిమా చాలా బాగా వచ్చిందని, సందీప్ కిషన్, బ్రహ్మానందంల సహకారం మరిచిపోలేనిదని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. ఇందులో నాయిక రాశి ఖన్నాతో పాట పాడిం చానని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తెలిపారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ జోరు చూడొచ్చని బ్రహ్మానందం అన్నారు. ఈ వేడుకలో బి. గోపాల్ నరేష్, సప్తగిరి, పరుచూరి బ్రదర్స్, వీరశంకర్, మేర్లపాక గాంధీ, పాల్గొన్నారు.