భక్త కన్నప్పగా సునీల్
కన్నప్ప కథ తెలుగులో రెండుసార్లు తెరకెక్కింది. రెండింటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం గమనార్హం. ముచ్చటగా మూడోసారి కన్నప్ప ప్రేక్షకులను పలకరించబోతున్నాడని విశ్వసనీయ సమాచారం. అయితే... ఈ దఫా కన్నప్పగా కనిపించబోయేది సునీల్. గతంలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, రెబల్‌స్టార్ కృష్ణంరాజు లాంటి లెజెండ్స్ పోషించిన ఈ పాత్రను కామెడీ హీరో సునీల్ పోషించనుండటం విశేషమే. ‘మిథునం’ లాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకందించిన తనికెళ్ల భరణి ఈ చిత్రానికి దర్శకుడని వినికిడి. భరణి స్వతహాగా శివభక్తుడన్న విషయం తెలిసిందే. శ్రీకాళహస్తి స్థలపురాణమైన ఈ కథను ఆయన ఎలా తెరకెక్కించనున్నారనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఈ కథతో తొలుత వచ్చిన సినిమా ‘శ్రీకాళహస్తీశ్వరమహాత్మ్యం’. హెచ్‌ఎల్‌ఎన్ సింహా దర్శకుడు. తర్వాత వచ్చిన సినిమా ‘భక్తకన్నప్ప’. బాపు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. దర్శకత్వ ప్రతిభ విషయంలో రెండిటికీ రెండే అని చెప్పాలి. మరి వాటి స్థాయిని భరణి అందుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అటు సునీల్‌కి ఇటు భరణికి ఇది ఒక రకంగా సవాలే.