Baktha Kannapa
-
మంచు విష్ణు సినిమాలో ప్రభాస్.. కారణం అదా?
ప్రభాస్ పేరు చెప్పగానే 'బాహుబలి', 'సాహో', 'సలార్' లాంటి పాన్ ఇండియా సినిమాలే గుర్తొస్తాయి. అలాంటిది మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త మూవీలో నటిస్తాడనే విషయం బయటకు రాగానే అందరూ షాకయ్యారు. ఎందుకంటే అంత పెద్ద పాన్ ఇండియా స్టార్.. ఓ రీజనల్ హీరో సినిమాలోనా? అని మీరు అనుకోవచ్చు. కానీ దీని వెనక చాలా కారణాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) మంచు విష్ణు హీరోగా.. భక్త కన్నప్ప స్టోరీతో ఓ సినిమా చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఉన్నట్టుండి సడన్‌గా ఈ మూవీలోని శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తారనే టాక్ బయటకొచ్చింది. ఇది నిజమేనని విష్ణు కూడా ఓ ట్వీట్ కి సమధానమిచ్చాడు. ఇప్పటికే రాముడు, విశ్వామిత్రుడు పాత్రల్లో యాక్ట్ చేసిన ప్రభాస్.. ఇందులో శివుడిగా ఎలా ఉండబోతున్నాడా అని ఫ్యాన్స్ ఇప్పటినుంచే తెగ ఆలోచిస్తున్నారు. ఇకపోతే 'బుజ్జిగాడు' మూవీ చేస్తున్న టైంలోనే ప్రభాస్‌కి మోహన్‌బాబుతో మంచి బాండింగ్ ఏర్పడింది. మరోవైపు మంచు విష్ణు, ప్రభాస్ చాలా ఏళ్ల నుంచి ఫ్రెండ్స్. గతంలో విష్ణు 'దూసుకెళ్తా' ఓ సీన్ కోసం ప్రభాస్ గొంతు అరువిచ్చాడు. అలానే ఇప్పుడు తీస్తున్న సినిమాకు డైరెక్టర్ ముఖేశ్ కుమార్. 'మహాభారతం' సీరియల్‌ని తీసింది ఈయనే. ఈ డైరెక్టర్ అంటే కచ్చితంగా తనని బాగా చూపిస్తారనే ప్రభాస్ అనుకున్నాడు. ఇలా చాలా కారణాలు.. మంచు విష్ణు సినిమాలో ప్రభాస్ నటించడానికి కారణాలు అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: రైతుబిడ్డ సెంటిమెంట్ వాడొద్దు.. ప్రశాంత్ కి కంటెస్టెంట్ల వార్నింగ్) -
'నేరేడు చెట్టు కాడ నా రేడు మాటేసి'
చిత్రం: భక్తకన్నప్ప రచన: సి.నారాయణరెడ్డి గానం: పి. సుశీల, వి. రామకృష్ణ సంగీతం: సత్యం భక్త కన్నప్ప చిత్రంలోని ‘కండ గెలిచింది కన్నె దొరికింది గుండె పొంగిందిరా/మాత పలికింది మనువు కలిపింది మనసు గెలిచిందిరా/ హైరా మా దొరగారికి వీరగంధాలు/సైరా మా దొరసానికి పారిజాతాలు’ పాటను డ్రమ్స్ మీద నాట్యం చే స్తున్నట్లుగా చిత్రీకరించాను. సాధారణంగా ఆ పాట సిట్యుయేషన్‌కి ఒక డ్యూయెట్ పెడతారు ఎవరైనా. కాని బాపుగారు కొత్త తరహాలో రాయించుకున్నారు. ఈ పాటలో వీరం, శృంగారం, భక్తి, నాట్యం అన్నీ కలిసి ఉన్నాయి. అలాగే నృత్యం, నాట్యం, నృత్తం మూడూ ఈ పాటలో ఉంటాయి. కథానాయిక నీల (వాణిశ్రీ)కు భక్తి ఉంటుంది. ‘ధిమింధిమింధిమి భేరీ ధ్వనులు తెలిపెనురా నా గెలుపునే/ఘలం ఘలల చిరుగజ్జెల మోతలు పలికెనురా నా వలపునే/అల్లె తాళ్ల ఝంకారాలే జయం దొరా అని పాడెనులే/నల్ల త్రాచు వాలు జడలే ఆ పాటకూ సయ్యాడెనులే’ అని సాగే మొదటి చరణంలో ప్రియుడు తన గెలుపును తెలిపేలా, వీరత్వం గురించి ఆనంద తాండవం చేస్తూ పాడుతుంటే, ప్రియురాలు తన ప్రేమను శృంగార రసంలో తెలుపుతుంది. ‘నేరేడు చెట్టు కాడ నా రేడు మాటేసి/చారెడేసి కళ్లతోటి బారెడేసి బాణమేసి/బాణమేసి నా ప్రాణం తోడేస్తుంటే/ఓయమ్మో ఓలమ్మో నీ ప్రాణం తోడేస్తుంటే’ అంటూ సాగే రెండో చరణంలో నాయిక పరవశంగా డ్రమ్ మీద కూర్చుని పాడుతుంటే, కిందే నిలబడిన నాయకుడు ఆమె వైపు ఆరాధనగా చూస్తున్నట్టుగా కంపోజ్ చేశాను. ఈ చరణం నడక చాలా వేగంగా ప్రారంభమై, అక్కడకు వచ్చేసరికి మెలోడియస్గా ఉంటుంది. ఆ తరవాత వచ్చే ‘ఎంతా చక్కని కన్ను, ఎంతో చల్లని చూపు/ఇంతకన్న ఇంకేమి కావాలి/ నా బతుకంతా ఇలా ఉండిపోవాలి’ చరణంలో ముందుగా కృష్ణంరాజు చుట్టూ బల్లాలు వేస్తారు. వాణిశ్రీ వాటిని తొలగించుకుంటూ వస్తుంది. దర్శకుడు బాపుగారు ‘ఎంత చల్లటి చూపు’ పదాలు వచ్చినప్పుడు అమ్మవారిని చూపించమన్నారు. ఆ కళ్లు ఈ కళ్లు... అటు భక్తి, ఇటు ప్రేమ రెండు కళ్లు ఒకేలా ఉన్నాయన్నట్టుగా చూపాను. పాటంతా పూర్తయ్యాక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మొదలవుతుంది. డిఫరెంట్ పోశ్చర్లు తీశాను. ఇలాంటివి ఆ రోజుల్లోనే ప్రారంభించాం. ఈ సినిమా పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెంలో తీశారు. అక్కడ దొరలు వాళ్ల ఇళ్లల్లోనే మమ్మల్ని ఉంచుకుని, వాళ్ల ఆహారమే పెట్టారు. అక్కడే ఔట్‌డోర్‌లో తీశారు ఈ సినిమా. ఒక ఎకరం స్థలం సేకరించి, సెట్ వేశారు. ఈ పాటను ఆరు రోజులు తీశాను. ఆరు రోజుల పాటు తీసిన నాలుగైదు పాటలలో ఇది ఒకటి. వాణిశ్రీ, కృష్ణంరాజు... ఇద్దరూ లొకేషన్లోనే నాట్యం నేర్చుకున్నారు. వాణిశ్రీకి వాణిశ్రీనే సాటి అని నా ఉద్దేశం. కృష్ణంరాజును ఈ పాట కోసం చాలా కష్టపెట్టాను. మంచి సెట్ వేసిన ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్రాజుగారిని అభినందించాలి. ఈ పాట పూర్తయిన తరవాత చూస్తే, నాకు ‘శివపార్వతుల తాండవం’ లా అనిపించింది. - వైజయంతి పురాణపండ -
భక్త కన్నప్పగా సునీల్
కన్నప్ప కథ తెలుగులో రెండుసార్లు తెరకెక్కింది. రెండింటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం గమనార్హం. ముచ్చటగా మూడోసారి కన్నప్ప ప్రేక్షకులను పలకరించబోతున్నాడని విశ్వసనీయ సమాచారం. అయితే... ఈ దఫా కన్నప్పగా కనిపించబోయేది సునీల్. గతంలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, రెబల్‌స్టార్ కృష్ణంరాజు లాంటి లెజెండ్స్ పోషించిన ఈ పాత్రను కామెడీ హీరో సునీల్ పోషించనుండటం విశేషమే. ‘మిథునం’ లాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకందించిన తనికెళ్ల భరణి ఈ చిత్రానికి దర్శకుడని వినికిడి. భరణి స్వతహాగా శివభక్తుడన్న విషయం తెలిసిందే. శ్రీకాళహస్తి స్థలపురాణమైన ఈ కథను ఆయన ఎలా తెరకెక్కించనున్నారనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఈ కథతో తొలుత వచ్చిన సినిమా ‘శ్రీకాళహస్తీశ్వరమహాత్మ్యం’. హెచ్ఎల్ఎన్ సింహా దర్శకుడు. తర్వాత వచ్చిన సినిమా ‘భక్తకన్నప్ప’. బాపు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. దర్శకత్వ ప్రతిభ విషయంలో రెండిటికీ రెండే అని చెప్పాలి. మరి వాటి స్థాయిని భరణి అందుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అటు సునీల్‌కి ఇటు భరణికి ఇది ఒక రకంగా సవాలే.