'నేరేడు చెట్టు కాడ నా రేడు మాటేసి' | Bakta Kannappa Lyrics Speciality In Funday | Sakshi
Sakshi News home page

'నేరేడు చెట్టు కాడ నా రేడు మాటేసి'

Published Sun, Oct 20 2019 11:32 AM | Last Updated on Sun, Oct 20 2019 11:34 AM

Bakta Kannappa Lyrics Speciality In Funday - Sakshi

చిత్రం: భక్తకన్నప్ప 
రచన: సి.నారాయణరెడ్డి
గానం: పి. సుశీల, వి. రామకృష్ణ 
సంగీతం: సత్యం

భక్త కన్నప్ప చిత్రంలోని ‘కండ గెలిచింది కన్నె దొరికింది గుండె పొంగిందిరా/మాత పలికింది మనువు కలిపింది మనసు గెలిచిందిరా/ హైరా మా దొరగారికి వీరగంధాలు/సైరా మా దొరసానికి పారిజాతాలు’ పాటను డ్రమ్స్‌ మీద నాట్యం చే స్తున్నట్లుగా చిత్రీకరించాను. సాధారణంగా ఆ పాట సిట్యుయేషన్‌కి ఒక డ్యూయెట్‌ పెడతారు ఎవరైనా. కాని బాపుగారు కొత్త తరహాలో రాయించుకున్నారు. ఈ పాటలో వీరం, శృంగారం, భక్తి, నాట్యం అన్నీ కలిసి ఉన్నాయి. అలాగే నృత్యం, నాట్యం, నృత్తం మూడూ ఈ పాటలో ఉంటాయి.  కథానాయిక నీల (వాణిశ్రీ)కు భక్తి ఉంటుంది.  

‘ధిమింధిమింధిమి భేరీ ధ్వనులు తెలిపెనురా నా గెలుపునే/ఘలం ఘలల చిరుగజ్జెల మోతలు పలికెనురా నా వలపునే/అల్లె తాళ్ల ఝంకారాలే జయం దొరా అని పాడెనులే/నల్ల త్రాచు వాలు జడలే ఆ పాటకూ సయ్యాడెనులే’ అని సాగే మొదటి చరణంలో ప్రియుడు తన గెలుపును తెలిపేలా, వీరత్వం గురించి ఆనంద తాండవం చేస్తూ పాడుతుంటే, ప్రియురాలు తన ప్రేమను శృంగార రసంలో తెలుపుతుంది. 

‘నేరేడు చెట్టు కాడ నా రేడు మాటేసి/చారెడేసి కళ్లతోటి బారెడేసి బాణమేసి/బాణమేసి నా ప్రాణం తోడేస్తుంటే/ఓయమ్మో ఓలమ్మో నీ ప్రాణం తోడేస్తుంటే’ అంటూ సాగే రెండో చరణంలో నాయిక పరవశంగా డ్రమ్‌ మీద కూర్చుని పాడుతుంటే, కిందే నిలబడిన నాయకుడు ఆమె వైపు ఆరాధనగా చూస్తున్నట్టుగా కంపోజ్‌ చేశాను. ఈ చరణం నడక చాలా వేగంగా ప్రారంభమై, అక్కడకు వచ్చేసరికి మెలోడియస్‌గా ఉంటుంది. ఆ తరవాత వచ్చే ‘ఎంతా చక్కని కన్ను, ఎంతో చల్లని చూపు/ఇంతకన్న ఇంకేమి కావాలి/ నా బతుకంతా ఇలా ఉండిపోవాలి’ చరణంలో ముందుగా కృష్ణంరాజు చుట్టూ బల్లాలు వేస్తారు.

వాణిశ్రీ వాటిని తొలగించుకుంటూ వస్తుంది. దర్శకుడు బాపుగారు ‘ఎంత చల్లటి చూపు’ పదాలు వచ్చినప్పుడు అమ్మవారిని చూపించమన్నారు. ఆ కళ్లు ఈ కళ్లు... అటు భక్తి, ఇటు ప్రేమ రెండు కళ్లు ఒకేలా ఉన్నాయన్నట్టుగా చూపాను. పాటంతా పూర్తయ్యాక బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మొదలవుతుంది. డిఫరెంట్‌ పోశ్చర్లు తీశాను. ఇలాంటివి ఆ రోజుల్లోనే ప్రారంభించాం.

ఈ సినిమా పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెంలో తీశారు. అక్కడ దొరలు వాళ్ల ఇళ్లల్లోనే మమ్మల్ని ఉంచుకుని, వాళ్ల ఆహారమే పెట్టారు. అక్కడే ఔట్‌డోర్‌లో తీశారు ఈ సినిమా. ఒక ఎకరం స్థలం సేకరించి, సెట్‌ వేశారు. ఈ పాటను ఆరు రోజులు తీశాను. ఆరు రోజుల పాటు తీసిన నాలుగైదు పాటలలో ఇది ఒకటి. వాణిశ్రీ, కృష్ణంరాజు... ఇద్దరూ లొకేషన్‌లోనే నాట్యం నేర్చుకున్నారు. వాణిశ్రీకి వాణిశ్రీనే సాటి అని నా ఉద్దేశం. కృష్ణంరాజును ఈ పాట కోసం చాలా కష్టపెట్టాను. మంచి సెట్‌ వేసిన ఆర్ట్‌ డైరెక్టర్‌ భాస్కర్‌రాజుగారిని అభినందించాలి.
ఈ పాట పూర్తయిన తరవాత చూస్తే, నాకు ‘శివపార్వతుల తాండవం’ లా అనిపించింది. 
 - వైజయంతి పురాణపండ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement