
నా గతాన్ని మరిచిపోనివ్వడం లేదు!
‘గతం గతః’ అంటారు. సన్నీ లియోన్ కూడా తన గతం గురించి అలానే అనుకుంటున్నారు. కానీ, కొంతమంది తన గతాన్ని మర్చిపోనివ్వడంలేదట. ఆ విషయం గురించి సన్నీ లియోన్ మాట్లాడుతూ -‘‘విదేశాల్లో నేను చేసిన చిత్రాలకు భిన్నమైనవి చేయాలని ఇక్కడికొచ్చా. కొత్త లైఫ్ మొదలుపెట్టాలన్నది నా ఆకాంక్ష. కానీ, కొంతమంది ఇంకా నా పాత చిత్రాలనే దృష్టిలో పెట్టుకుంటున్నారు. పైగా, ఇక్కడ రాజకీయాలు ఎక్కువ.
ఏ అవకాశం ఎవరికి దక్కుతుందో చివరి నిమిషం వరకూ చెప్పలేం. మధ్యలో బోల్డన్ని రాజకీయాలు జరిగిపోతాయ్. కాకపోతే అందరూ చెడ్డవాళ్లని అనలేం. కొంతమంది మంచివాళ్లు కూడా ఉన్నారు. అయితే, నేనిక్కడ నిలదొక్కుకోగలిగానంటే దానికి కారణం నా అభిమానులే. ఒకవేళ నేను నటించిన సినిమా సరిగ్గా ఆడకపోయినా, ‘నటిగా ఫెయిల్ కాలేదు’ అని అభిమానులు అంటున్నారు.
ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న తారలకు పరిశ్రమలో గౌరవం ఉంటుంది. నా అభిమానులు నాకా గౌరవం దక్కేలా చేశారు. అభిమానుల్లో నాకు బోల్డంత క్రేజ్ ఉంది కాబట్టే, నాతో దర్శక, నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. దీపికా పదుకొనే వంటి ‘ఎ’ లిస్ట్ తారల జాబితాలో లేను కానీ, పరిశ్రమలో నాకంటూ ఓ స్థానం సంపాదించుకోగలిగాను’’ అన్నారు.