సామాన్యుడిగా మొదలై అసమాన్యుడిగా | super star Rajinikanth Birthday | Sakshi
Sakshi News home page

సామాన్యుడిగా మొదలై అసమాన్యుడిగా

Published Sat, Dec 12 2015 9:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

సామాన్యుడిగా మొదలై అసమాన్యుడిగా

సామాన్యుడిగా మొదలై అసమాన్యుడిగా

హీరో అంటే వెండితెర మీద విలన్లపై చెలరేగిపోవటం కాదు. నిజజీవితంలోనూ గెలవాలి. అట్టడుగు స్థాయి నుంచి ...అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి. చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలి. ఎంతో మందికి స్ఫూర్తి నివ్వాలి. తనకున్నంతలో కొంత మందికైన జీవితాన్ని ఇవ్వగలగాలి. అలాంటి వ్యక్తే నిజమైన హీరో. అటువంటి హీరో అభిమానుల గుండెల్లో నిలిచిపోతాడు. దైవసమానుడై నీరాజనాలు అందుకుంటాడు. అలా సామన్యుడిగా మొదలై అసమాన్యుడిగా ఎదిగిన సినీ శిఖరం రజనీకాంత్ పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం.

భారతీయ సినీ ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అంతర్జాతీయ స్థాయి నటుడు రజనీకాంత్. బస్సు కండక్టర్గా జీవితాన్ని ప్రారంభించి.. సినిమా వ్యాపారాన్ని తిరగరాసి చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగిన రజనీ కాంత్ జీవితం.. స్ఫూర్తినిచ్చే సజీవ కావ్యం. రజనీ సినీ జీవితం చిన్న చిన్న విలన్ పాత్రలతో మొదలైంది. క్యారెక్టర్ రోల్స్తో కొత్త పుంతలు తొక్కింది. హీరో పాత్రలతో తారా పథాన్ని అందుకుంది. అయితే, ఈ ఆరోహణ అవలీలగా సాధ్యమైంది కాదు. ఆయన హీరోచిత ప్రస్థానం వెనుక కఠోర శ్రమ ఉంది. నిరాడంబరమైన దీక్ష ఉంది.

చిన్నా పెద్దా అందరికీ.. ఓ బాషా కావాలి. ఓ రోబో కావాలి.. అలాంటివే ఇంకా ఇంకా కావాలి. ఈ రోజున రజనీ ఈ స్ధాయి కి చేరుకున్నాడంటే దాని వెనుక ఎంతో శ్రమ ఉంది. రజనీ జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదు. అవకాశాల కోసం మొదట్లో అనేక కష్టాలు పడ్డాడు. 1949 డిసెంబర్ 12 న బెంగుళూరులో ఒక మరాఠీ కుటుంబం లో జన్మించిన రజనీ కాంత్కు తల్లిదండ్రులు పెట్టిన పేరు శివాజీ రావ్ గైక్వాడ్. తండ్రి రామోజీరావ్ గైక్వాడ్ పోలీసు కానిస్టేబుల్గా ఉద్యోగం చేసేవారు, తల్లి జిజీబాయ్. అయిదేళ్ళ వయసులోనే తల్లిని పోగొట్టుకున్న రజనీకాంత్ చిన్నప్పట్నుంచే అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. బెంగుళూరులోని రామకృష్ణ మిషన్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసి, హైస్కూల్ విద్యకు ఫుల్ స్టాప్ పెట్టి బతుకు తెరువు కోసం చిన్న చిన్న పనులు చేశాడు. తర్వాత బెంగుళూరులో బస్ కండక్టర్గా రూట్ నెంబర్ 10 Aలో పనిచేశాడు..

బాలచందర్ దర్శకత్వంలో అపూర్వ రాగంగళ్ తమిళ వెర్షన్లో రజనీ సెకండ్ హీరోగా నటించాడు. క్యాన్సర్ రోగిగా ఆయన పోషించిన పాత్రకు పెద్దగాగుర్తింపు రాలేదు .ఆ తరవాత కన్నడంలో పుట్టన్న కన్నంగళ్ దర్శకత్వం వహించిన కథా సంగమం చిత్రంలో హీరోగా చేశాడు. అయినా పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ దశలో మళ్ళీ బాలచందర్ నుంచి వచ్చిన పిలుపు రజనీ జీవితాన్ని అనూహ్యంగా మలుపు తిప్పింది. తమిళంలో అవర్ ఒరు తోడర్ కథై, తెలుగులో అంతులేని కథ పేర్లతో వచ్చిన చిత్రాలలో రజనీ పోషించిన పాత్ర సూపర్ హిట్. ఈ చిత్రంలో రజనీకాంత్ సిగరెట్ కాల్చే స్టయిల్ ప్రేక్షకులను విపరీతంగా నచ్చింది. ఆ తర్వాత విలన్, హీరో అని చూడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు దూసుకుపోయాడు రజనీ కాంత్ . ఆయన మొదటిసారి సోలో హీరోగా నటించిన చిత్రం భైరవి. ఆ చిత్రం 1978లో విడుదలైంది.

తన చిత్రాల రికార్డులను తానే బద్దలు కొట్టడం రజనీ స్టయిల్. బాషా, అన్నామలై, ముత్తు, అరుణాచలం, నరసింహ, ఇలా ప్రతి సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచిపెట్టింది. ముత్తు సినిమాతో ఆయన సినిమాలు జపనీస్లోకి డబ్బింగ్ అవడం మొదలైంది. జపాన్, సౌదీ, బ్రిటన్, అమెరికా దేశాల్లోనూ రజనీ సినిమాకు వచ్చే కలెక్షన్లు మరే భారతీయ స్టార్ సినిమాకూ రావన్నది అక్షర సత్యం.

సూపర్ స్టార్ గా , అంతకు మించిన మంచి మనిషిగా కోట్లాది హృదయాలను దోచుకున్న రజనీ కాంత్.. వ్యక్తిగత జీవితంలో ఇప్పటికీ నిరాడంబరంగానే ఉంటాడు. మేకప్ తీసేస్తే ఆయన ఓ సాదా సీదా మనిషి. మంచితనంతో మూర్తీభవించిన ఉన్నతమైన వ్యక్తి. తనను అభిమానించే ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే ప్రతి సారి నేనున్నానంటూ స్పందించటం రజనీకి అలవాటు అందుకే ఆయన అభిమానుల గుండెల్లో దైవంగా నిలిచాడు. తెర మీద రజనీ స్టైల్కే కాదు, తెర వెనుక రజనీ వ్యక్తిత్వానికి కూడా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ ఏడాది చెన్నై మహానగరాన్ని వరదలు ముంచెత్తిన కారణంగా తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దంటూ అభిమానులకు పిలుపునిచ్చాడు రజనీ. ఇప్పటికీ తన అభిమానులను అలరించటమే లక్ష్యం అంటున్న రజనీకాంత్ మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆశిద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement