రజనీ సలహాఇచ్చారు
తమిళ సినిమా : సూపర్‌స్టార్ రజనీకాంత్ తనకు అడ్వైజ్ చేశారంటున్నారు యువ నటుడు విక్రమ్ ప్రభు. సహ నటుడు శివాజీ గణేశన్ వంశం నుంచి వచ్చిన మూడో తరం హీరో ఈయన. నటుడు ప్రభు కొడుకయిన విక్రమ్ ప్రభు కుంకీ చిత్రం ద్వారా హీరోగా రంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే నటుడిగా తన ఈ సత్తా చాటి ప్రశంసలందుకున్నారు. ఆ తరువాత ఇవన్ వేరమాదిరి, అరిమానంబి చిత్రాలతో హీరోగా తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్న విక్రమ్ ప్రభు ప్రస్తుతం మూడు, నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన నటించిన తాజా చిత్రం శిఖరం తొడు విడుదలకు సిద్ధమవుతోంది. ఇది తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రం.
తండ్రిగా సత్యరాజ్ నటించారు. మోనాల్ గజ్జర్ నాయకి. చిత్రంలో విక్రమ్ ప్రభు పోలీస్ అధికారిగా నటించారు. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు మంచి పేరు వస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ ప్రభు తన భావాలను వెల్లడిస్తూ పలానా పాత్రలే చెయ్యాలనే నిర్దిష్ట అభిప్రాయం ఏమీ లేదన్నారు. తన తాత శివాజీ గణేశన్ మాదిరి అన్ని రకాల పాత్రలను పోషించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వెళ్ళైక్కార దురై చిత్రంతోపాటు దర్శకుడు విజయ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నానని చెప్పారు. వెళ్లైక్కార దురై చిత్రంలో తొలిసారిగా వినోదభరిత పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. పోరాట దృశ్యాలలో డూప్ లేకుండా రిస్క్ తీసుకుని నటిస్తున్నానని కుటుంబ సభ్యులు భయపడుతున్నారన్నారు.
రజనీకాంత్ కూడా రిస్క్ తీసుకోవద్దని సలహా ఇచ్చారని పేర్కొన్నారు. అయితే తనకు డూప్‌లను పెట్టి నటింప జేయడం ఇష్టం లేదన్నారు. కుంకీ చిత్రంలో డూప్‌లేకుండా సాహసం చేసి ఏనుగుతో నటించిన సన్నివేశాలకు ప్రశంసలు లభించాయని గుర్తు చేసుకున్నారు. అలాగే యువన్ వేరమాదిరి. అరిమానంబి చిత్రాల్లో ఫైట్ సన్నివేశాలలో అభినందనలు లభించాయన్నారు. తాత శివాజీగణేశన్, నాన్న ప్రభుల పేరు కాపాడే విధంగా చిత్రాల ఎంపికలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు విక్రమ్ ప్రభు తెలిపారు.