జాలీ రైడ్...
మెగా కాంపౌండ్ నుంచి వెండితెరపైకి దూసుకొచ్చిన మిసైల్ సాయిధరమ్ తేజ్. సక్సెస్ ట్రాక్‌లో ఉన్న సాయిధరమ్ ‘సుప్రీమ్’ సినిమాతో సమ్మర్‌లో సందడి చేయడానికి వచ్చేశారు. ‘పటాస్’ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం గురువారం తెరకొచ్చింది. ‘సుప్రీమ్’ ఎలా ఉందో తెలియాలంటే కథలోకి వెళాల్సిందే...
కథ ఏంటంటే: అనంతపూర్‌లో తరతరాలుగా వేలాది మందికి అన్నం పెట్టే జాగృతి ట్రస్ట్‌ను విక్రమ్ సర్కార్ (కబీర్ సింగ్) అనే వ్యాపారవేత్త దక్కించుకుని, విదేశీ కంపెనీలకు అమ్మే ప్రయత్నంలో ఉంటాడు. ఈ క్రమంలో ఆ ట్రస్టులో ఆశ్రయం పొందుతున్నవారందరూ నిరాశ్రయులవుతారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ సంపాదించి ఎలాగైనా ట్రస్టుని దక్కించుకోవాలని నిర్వాహకుడు నారాయణ రావు (సాయికుమార్) అనుకుంటాడు. ఆ ట్రస్టును చాలా ఏళ్ల క్రితం అరికెపూడి రాఘవరావు అనే రాజవంశీకుడు ప్రజల కోసం దానం చేస్తాడు.
దానికి సంబంధించిన పేపర్లు ఆయన వారసుల దగ్గర ఉంటాయి. కానీ, వారి జాడ మాత్రం తెలియదు. అందుకే నారాయణ రావు వాటిని కోర్టులో దాఖలు చేయడానికి సమయం అడుగుతాడు. వారసుడు కోసం నారాయణరావు అన్వేషణ మొదలుపెడతాడు. మరోవైపు విక్రమ్ సర్కార్ రంగంలోకి దిగి, వారసుణ్ణి వెతికిపట్టుకుని, తానే డాక్యుమెంట్స్ దక్కించుకుని వాటిని నాశనం చేయాలనుకుంటాడు. కట్ చేస్తే... వారసుడు హైదరాబాద్‌లో ఉన్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలోనే బాలు (సాయిధరమ్ తేజ్) అనే ట్యాక్సీ డ్రైవర్ కథలోకి ఎంటరవుతాడు. బాలూది ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం.
అతని తండ్రి (రాజేంద్రప్రసాద్)ని స్నేహితులే ఆస్తి విషయంలో మోసం చేయడంతో వాళ్ల జీవితం తలకిందులవుతుంది. ఆ దిగులుతో తండ్రి తాగుడుకు బానిసైపోతాడు. అయినప్పటికీ ‘ఆయనే నా హీరో’ అంటూ బాలు కంటికిరెప్పలా చూసుకుంటాడు. ఇలా సాగుతున్న వీళ్ల లైఫ్‌లోకి రాజన్ (మిఖైల్ గాంధీ) అనే పిల్లాడు ఎంటరవుతాడు. తన చిన్న మాటలతో వాళ్ల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొ స్తాడు. ఇంతలో రాజన్‌కు అనుకోని ప్రమాదం ఏర్పడుతుంది. ఆ పిల్లాడెవరు? అతని కోసం బాలు ఏం చేశాడు? తాను ప్రేమించిన పోలీసాఫీసర్ బెల్లం శ్రీదేవి (రాశీఖన్నా) ప్రేమను పొందగలుగుతాడా? అనేది మిగతా కథ...
ఓ ఊరును కాపాడటానికి హీరో ఏం చేశాడు? అనే కాన్సెప్ట్‌ను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు అనిల్ రావిపూడి. యాక్షన్, డ్యాన్స్, ఎమోషనల్.. ఇలా అన్ని సీన్స్‌లోనూ సాయిధరమ్ భేష్ అనిపించుకున్నారు. బెల్లం శ్రీదేవిగా రాశీఖన్నా నటన బాగుంది. చిరంజీవి హిట్ సాంగ్ ‘అందం హిందోళం.. అధరం తాంబూలం’ రీమిక్స్ ఓ హైలైట్. పక్కా మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి కావాల్సిన అంశాలతో తీసిన జాలీ రైడ్ ‘సుప్రీమ్’.
చిత్రం: సుప్రీమ్,
తారాగణం: సాయిధరమ్‌తేజ్, రాశీఖన్నా, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, కబీర్‌సింగ్, రవికిషన్, రఘుబాబు, మాస్టర్ మిఖైల్ గాంధీ... సంగీతం: సాయి కార్తీక్,
సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్,
ఎడిటర్: ఎం.ఆర్. వర్మ,
నిర్మాత: శిరీష్, సమర్పణ: ‘దిల్’ రాజు,
దర్శకత్వం: అనిల్ రావిపూడి.