'ఆ పాత్ర కోసం ఎవరినీ అడగలేదు'
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ధృవ. తమిళ సూపర్ హిట్ తనీ ఒరువన్కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. థ్రిల్లింగ్ మైండ్ గేమ్తో సాగే ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర కూడా హీరోకు సమానంగా ఉంటుంది. తమిళ నాట ఈ పాత్రలో నటించిన అరవింద్ స్వామికి మంచి గుర్తింపు వచ్చింది. అందుకే తెలుగు వర్షన్ లోనూ ఆయన్నే విలన్గా తీసుకున్నారు.
అయితే ధృవ సినిమా ప్రారంభానికి ముందు విలన్ పాత్రకు టాలీవుడ్ ప్రముఖులను సంప్రదించారన్న టాక్ వినిపించింది. ముఖ్యంగా సీనియర్ హీరో నాగార్జున ఈ విలన్ పాత్రకు అంగీకరించాడన్న వార్త అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. అదే సమయంలో జగపతిబాబు లాంటి సీనియర్ హీరోల పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా ఈ రూమర్స్ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.
తనీ ఒరువన్ సినిమాను రీమేక్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడే విలన్ పాత్రకు అరవింద్ స్వామినే తీసుకోవాలని ఫిక్స్ అయినట్టుగా తెలిపాడు. మరే నటుణ్ని సంప్రదించలేదన్న డైరెక్టర్, ఈ పాత్ర కేవలం ఆయన కోసం పుట్టింది. ఆయన తప్ప ఇంకెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరన్నాడు. తొలి రోజే 10 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ధృవ ఓవర్సీస్లో హాఫ్ మిలియన్ మార్క్ను దాటి వన్ మిలియన్ క్లబ్లో స్థానం కోసం పరుగులు తీస్తోంది.