
'24' కలెక్షన్ల రికార్డు!
సూర్య తాజా ద్విభాష చిత్రం '24' బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 'టైమ్ ట్రావెల్' అనే వినూత్న అంశంతో 'సైన్స్-ఫిక్షన్'గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సూర్య అద్భుతమైన అభినయం, దర్శకుడు విక్రమ్ కుమార్ స్క్రీన్‌ప్లే ప్రతిభ ఈ సినిమాను హిట్ జాబితాలో చేర్చింది. మంచి రివ్యూలు, ప్రేక్షకుల నుంచి సానుకూల టాక్ సాధించిన ఈ సినిమా అనుకున్నట్టుగానే బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ తొలి వీకెండ్‌లో '24' భారీ వసూళ్లు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది.
ఇక, ఓవర్సీస్ మార్కెట్ విషయానికొస్తే ఈ సినిమా అరుదైన రికార్డును సాధించింది. తొలి వీకెండ్‌లోనే '24' సినిమా ఉత్తర అమెరికాలో మిలియన్ డాలర్ల (రూ. 6.65 కోట్ల) వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించిన తొలి సూర్య సినిమా ఇదే కావడం గమనార్హం. ఉత్తర అమెరికాలో మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించిన తొలి సూర్య సినిమాగా '24' రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని ఉత్తర అమెరికాలో ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న సినీగెలాక్సీ ఇంక్ తాజాగా వెల్లడించింది. సమంత, నిత్య మీనన్ హీరోయిన్లుగా తెరకెక్కిన '24'లో సూర్య మూడు పాత్రల్లో కనిపించి అబ్బురపరిచాడు. అతడి నటనా నైపుణ్యం ప్రేక్షకుల నుంచే కాదు.. విమర్శకుల నుంచి ప్రశంసలందుకుంటోంది.