
తమిళసినిమా: నటుడు సూర్య ఇంతకు ముందెప్పుడూ లేనట్లుగా చిత్రాల విషయలో స్పీడ్ పెంచారు. ఆయన కథానాయకుడిగా నటించిన ఎన్‌జీకే చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. మే 31న తెరపైకి రానుంది. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చిత్ర ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. నటి రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించారు. సూర్య నటిస్తున్న మరో చిత్రం కాప్పాన్. కేవీ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి సాయేషాసైగల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మోహన్‌లాల్, ఆర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. దీన్ని ఆగస్ట్ 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం.
ఇకపోతే ఈ రెండు చిత్రాలు తెరపైకి రాకముందే సూర్య మరో చిత్రంలోనూ నటించేస్తున్నారు. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సూరరై పోట్రు అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో సూర్యకు జంటగా అపర్ణ బాలమురళి నటిస్తోంది. ఈ చిత్రం గురించి ఈమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొంటూ సూరరై పోట్రు చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి అయ్యిందని తెలిపారు. ఈ యూనిట్‌లో అందరూ సహృదయులేనని, ఇక దర్శకురాలు సుధ కొంగర లాంటి ఐరన్‌లేడీ ఎవరూ ఉండరని పేర్కొంది. కాగా ఇది ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారత సైనికుడు అయిన జీఆర్.గోపీనాథ్ జీవిత చరిత్ర ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం అని తెలిసింది. గోపీనాథ్ సతీమణి భార్గవి పాత్రలో నటి అపర్ణ నటిస్తున్న విషయం తెలిసిందే. భార్గవిని పోలి ఉండడం వల్లే అపర్ణను ఆ పాత్రకు ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. కాగా సగటు మనిషి కూడా విమానపయనాన్ని వినియోగించుకునే విధంగా టికెట్ ధరలను తీసుకొచ్చిన ఏయిర్ డెక్కన్ సంస్థ అధినేత జీఆర్.గోపీనాథ్ అన్నది గమనార్హం. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ, సిఖ్యా ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ కలిసి నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment