
జ్యోతికకు అతిథి కానున్న సూర్య
నటి జ్యోతికకు అతిథిగా సూర్య ఏమిటీ, ఆమెకు ఆయన ఏకంగా పతి అయిపోయారుగా అన్న సందేహం మీకు రావచ్చు. సూర్య జ్యోతిక పతి అన్నది రియల్ లైఫ్‌లో. అతిథి కానున్నది రీల్ లైఫ్‌లో. సూర్యను వివాహమాడిన తరువాత నటనకు విరామం ఇచ్చిన జ్యోతిక సుమారు తొమ్మిదేళ్ల తరువాత మళ్లీ ముఖానికి రంగేసుకుని ఇటీవల 36 వయదినిలే చిత్రంలో నటించారు. పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
దీన్ని ఆమె భర్త సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై నిర్మించారన్నది తెలిసిన విషయమే. జ్యోతిక తన సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెకెండ్ చిత్రానికి సిద్ధమవుతున్నారు.దీనికి తొలి చిత్రం కుట్రం కడిదల్‌తోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందిన బ్రహ్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై సూర్యనే నిర్మించనున్నారు.అంతే కాదు ఇందులో ఆయన అతిథి పాత్రలో నటించనున్నారని కోలీవుడ్ సమాచారం.
జ్యోతిక, సూర్య జంటగా నటించిన చివరి చిత్రం చిల్లన్ను ఒరు కాదల్. ఇది 2006లో విడుదలైంది. పదేళ్ల తరువాత మళ్లీ ఈ క్రేజీ జంట కలసి నటించడానికి సిద్ధమవుతున్నారన్న మాట. ఇంకో విషయం ఏమిటంటే సూర్య నటించిన పసంగ-2 చిత్రంలో హీరోయిన్‌గా జ్యోతికనే నటింపచేయాలని ఆ చిత్ర దర్శకుడు పాండిరాజ్ భావించారు. అప్పుడు ఆ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపని జ్యోతిక చితరం విడుదలై విజయం సాధించడంతో మంచి చిత్రాన్ని మిస్ అయ్యానని కించిత్ చింతను వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయన్నది గమనార్హం.