
‘అంజాన్’లో సూర్య గాత్రం
సంగీతం, సాహిత్యాల మేనికలయిక పాట. అలాంటి పాటకు మంచి గానం తోడయితే వీనులవిందుగా ఉంటుంది. అయితే పాడడం అంత సులభం కాదు. గాయకులుగా రాణించడానికి అర్హత ఉంటుంది. అయితే అంత పరిజ్ఞానం లేకపోయినా చాలా మంది పాడేస్తున్నారు. ముఖ్యంగా నేటి నటీనటులు తమ గాన పాండిత్యాన్ని చూపించేస్తున్నారు. పద్మశ్రీ కమల్ హాసన్‌లో మంచి గాయకుడున్నాడని ఇప్పటికే నిరూపించుకున్నారు. ఈయన సంగీత, సాహిత్య రంగాల్లోనూ శిక్షణ పొందారు. అయితే అలాంటి శిక్షణ లేకుండా నటుడు శింబు, ధనుష్, శివకార్తికేయన్‌లాంటి యువ నటులు పాడేస్తున్నారు.
చివరికి సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా కోచ్చడయాన్ చిత్రంలో పాడి తాను గాయకుడిననిపించుకున్నారు. తాజాగా ఈ కోవలోకి నటుడు సూర్య చేరనున్నారు. ఈయన ఇంతకు ముందు ఒక వాణిజ్య ప్రకటన కోసం గళం విప్పారు. తాజాగా అంజాన్ చిత్రం కోసం పాడనున్నారు. ఈయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అంజాన్. తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శక నిర్మాత లింగుసామి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్. చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రం కోసం సూర్య ఒక పాట పాడనున్నారు. అయితే ఈపాట ఇంకా రికార్డ్ చేయూల్సి ఉందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.