
ఆండ్రియాతో గొంతు కలిపిన సూర్య
సూర్య తమిళంలో ఎంత స్టార్ హీరోనో, తెలుగులో కూడా అంతే స్టార్ హీరో. శివపుత్రుడు, గజని, యముడు, సింగం-2... ఇలా ఇక్కడ కూడా ఎన్నో విజయాలను అందుకున్నారు సూర్య. ప్రస్తుతం ఆయన లింగుస్వామి దర్శకత్వంలో ‘ఆంజాన్’ సినిమా చేస్తున్నారు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ‘సికిందర్’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. లగడపాటి శిరీషా శ్రీధర్, తిరుపతి బ్రదర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇందులో సూర్య పాత్ర చిత్రణ ఊహలకు అందని రీతిలో ఉంటుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
సూర్య గత చిత్రాలను మించే బడ్జెట్‌తో సిద్దార్థ్‌రాయ్ కపూర్, ఎన్.సుభాష్‌చంద్రబోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని మరో ప్రత్యేకత ఏంటంటే... ఇటీవలే అనిరుథ్ స్వరసారథ్యంలో ఆండ్రియాతో కలిసి సూర్య ఈ చిత్రంలో ఓ గీతం ఆలపించారు. ఆ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని టాక్. ‘ఏక్ దో తీన్...’ అంటూ సాగే ఈ పాటను తెలుగు వెర్షన్‌లో కూడా సూర్యనే ఆలపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. తమిళ వెర్షన్ పాటలను ఈ నెల 22న విడుదల చేయనుండగా, తెలుగు వెర్షన్ గీతాలు ఈ నెల 31న విడుదల కానున్నాయి. ఆగస్ట్ 15న ‘సికిందర్’ విడుదల కానున్నట్లు సమాచారం.