తమిళ, మళయాళాల్లో 'స్వామి రారా' రీమేక్
చిన్న సినిమాగా మొదలై.. మంచి విజయం సాధించిన క్రైం కామెడీ చిత్రం 'స్వామి రారా' బాక్సాఫీసును బద్దలుకొట్టి వందరోజులు దాటడంతో, ఇప్పుడు ఆ సినిమాను తమిళం, మళయాళంలో కూడా రీమేక్ చేయనున్నారు. ఇప్పటికే ఇది కన్నడంలో రూపొందుతోంది. ఈ సినిమా రీమేక్ రైట్స్ను తమిళ నటుడు శ్రీకాంత్ కొన్నారు. తమిళం, మళయాళం రెండు భాషలకూ తాను రీమేక్ రైట్స్ కొన్నానని, తమిళ వెర్షన్ ముందుగా తెరకెక్కించి, తర్వాత మళయాళంలో తీస్తామని శ్రీకాంత్ చెప్పారు. ఈ సినిమా చాలా సరదాగా ఉంటుందని, అందుకే దాన్ని తమిళంలో తీయాలని భావించానని తెలిపారు. తమిళంలో కూడా ఈ సినిమా బాగా ఆడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తమిళ చిత్రంలో ప్రధాన పాత్రను శ్రీకాంతే పోషిస్తారు. మిగిలిన పాత్రలకు నటీనటులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. డైరెక్టర్ను ఖరారు చేసే దశలో ఉన్నట్లు శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాగానే ఈ సినిమా పని మొదలుపెడతామని అన్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ తమిళంలో నంబియార్, ఓం శాంతి ఓం చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నారు. సుధీర్ వర్మ అనే కొత్త దర్శకుడి చేతిలో రూపొందిన స్వామి రారా చిత్రం ఈ సంవత్సరంలో సైలెంట్ హిట్గా నిలిచింది. విఘ్నేశ్వరుడి విగ్రహం చుట్టూ సినిమా మొత్తం నడుస్తుంది.. కాదు పరుగు పెడుతుంది. నిఖిల్, పూజా రామచంద్రన్, స్వాతి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.